ఆసియాలో ఫైజర్ టీకా.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తొలిదేశం ఇదే!
ABN, First Publish Date - 2020-12-16T00:15:03+05:30
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికానే అల్లాడుతోంది. ఈ వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా దేశాలు ప్రయత్నించాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికానే అల్లాడుతోంది. ఈ వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా దేశాలు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ కంపెనీలు కలిసి ఓ వ్యాక్సిన్ తయారు చేశాయి. దీని వినియోగానికి అగ్రరాజ్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత ఈ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అమెరికాలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ కరోనా టీకా ఎలా పనిచేస్తుంది.. అంటే.. రోగనిరోధశక్తిని కరోనాతో పోరాడగలిగేలా ప్రేరేపిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కరోనా నిరోధక యాంటీబాడీలు తయారయ్యేలా ఇమ్యునిటీని సిద్ధం చేస్తోంది. దీంతో.. శరీరంలోకి మరోసారి వైరస్ ప్రవేశిస్తే..ఈ యాంటీబాడీలు వాటిని నిర్వీర్యం చేస్తాయి. అయితే.. ఈ విషయంపై ప్రజల్లో ఇప్పటికే కొంత అవగాహన ఉంది. అందుకే టీకాపై ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఫైజర్ కంపెనీ టీకా రేసులో ముందుంది. ఫైజర్ కంపెనీ ఇప్పటికే బ్రిటన్, అమెరికా దేశాల్లో అత్యవసర అనుమతులు పొందగలిగింది. మిగతా దేశాలు కూడా ఈ టీకాకు రేపో మాపో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ఉన్న అనేక దేశాలు.. ఈ టీకాకు అనుమతులు ఇచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేయడంలో ఫైజర్ టీకా మంచి పనితీరు కనబరచడంతో బ్రిటన్ ఈ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. బ్రిటన్ బాటలోనే నడిచిన అమెరికా, బహ్రెయిన్ దేశాలు కూడా ఇదే పద్ధతిలో ఫైజర్ టీకాకు ఎమర్జెన్సీ ఆథొరైజేషన్ ఇచ్చేశాయి.
ఇప్పుడు ఈ జాబితాలో మరో దేశం చేరింది. అదే సింగపూర్. ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్‌కు ఇప్పటిదాకా యూరప్ దేశాలు, అమెరికా మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ఇప్పుడు తొలిసారిగా ఓ ఆసియా దేశంలో కూడా ఈ టీకాకు అత్యవసర అనుమతులు లభించడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ వెల్లడించారు. సింగపూర్ జనాభా 57 లక్షలు. వీరందరికీ 2021 మూడో త్రైమాసికంలోగా వ్యాక్సిన్ అందేలా చూడటమే తమ లక్ష్యమని లీ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం ప్రజలకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. తొలి విడతలో భాగంగా తనతోపాటు ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ అఫీషియల్స్, వృద్ధులు తదితరులకు ఈ టీకా అందించనున్నట్లు లీ ప్రకటించారు.
సింగపూర్ కూడా ఫైజర్ టీకాకు అనుమతులు ఇవ్వడంతో.. భారత్‌కు కూడా తమ టీకా అమ్మడానికి ఫైజర్ ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికా తర్వాత అంత భారీగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే ఫైజర్ కంపెనీ భారత్‌లో తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు చురుగ్గా కదులుతోంది. ఎమర్జెన్సీ అనుమతి కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న తొలి కంపెనీ ఫైజర్‌యే. అయితే.. కరోనా టీకా రూపొందించిన విదేశీ కంపెనీలు మన దేశంలో కూడా క్లినికిల్ ట్రయల్స్ నిర్వహించాలనే నిబంధన ఉంది. ఈ రూల్ నుంచి తమకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని ఫైజర్ కోరిందట. ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఫైజర్ ఈ డిమాండ్ చేస్తోందట. ఈ విషయంలో భారత్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాంటే వేచి చూడాల్సిందే.
Updated Date - 2020-12-16T00:15:03+05:30 IST