బీజేపీలో చేరిన షహీన్‌బాగ్ షూటర్ కపిల్ గుర్జార్
ABN, First Publish Date - 2020-12-30T23:20:24+05:30
షహీన్‌బాగ్‌లో కాల్పులు జరిపిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీతో తన కుటుంబానికి సంబంధం ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేశాడు. ఆప్‌లో తన తండ్రి 2019 వరకు పని చేశాడని తన ఫోన్‌లో..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్‌బాగ్ నిరసనలో కాల్పులతో కలకలం సృష్టించిన కపిల్ గుర్జార్, భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన బీజేపీ కమిటీ.. బుధవారం గుర్జార్‌కు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించింది. పార్టీలో చేరిన అనంతరం గుర్జార్ మాట్లాడుతూ ‘‘నేను బీజేపీలో చేరడానికి ఇంతకు ముందే సిద్ధమయ్యాను. బీజేపీనే ఎంచుకోవడానికి కారణం, ఆ పార్టీ హిందుత్వం కోసం పని చేస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున నిరవధిక నిరసన జరిగింది. మహిళలు నేతృత్వం వహించిన ఈ నిరసన దేశ వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని సృష్టించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి చివరి వారంలో నిరసనను ముగించారు. అయితే ఫిబ్రవరిలో షహీన్‌బాగ్ నిరసనకారుల వద్దకు వచ్చిన గుర్జార్.. గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపుతూ ‘‘జై శ్రీరాం’’, ‘‘మా దేశంలో హిందువులు మాత్రమే ఏదైనా చెప్పాలి. ఇంకొకరు చెప్పకూడదు’’ అంటూ నినదించాడు. అనంతరం, అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశాడు.
కాల్పులకు గుర్జార్ చెప్పిన కారణం
షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేకుల కారణంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయిందని ఆ నిరాశతోనే కాల్పులు జరిపినట్లు చెప్పుకొచ్చాడు. ఇంట్లో తన సోదరి వివాహం పెట్టుకున్నారని, అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా పెళ్లి పనులు చేసుకోలేకపోయామని, ఆ నిరాశతోనే నిరసన చేస్తున్న ప్రదేశంలో కాల్పులు జరిపినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో గుర్జార్ చెప్పుకొచ్చాడు.
ఆప్‌పై ఆరోపణలు
షహీన్‌బాగ్‌లో కాల్పులు జరిపిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీతో తన కుటుంబానికి సంబంధం ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేశాడు. ఆప్‌లో తన తండ్రి 2019 వరకు పని చేశాడని తన ఫోన్‌లో ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషితో ఉన్న తన తండ్రి ఫొటోలను చూపించాడు. అయితే అతడి వాదనను అతడి కుటుంబ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించాయి. గుర్జర్ కుటుంబంతో ఆప్‌కు ఎలాంటి సంబంధం ఏదని ఆప్ నేతలు చెప్పగా, తాను ఆప్‌తో ఎప్పుడూ పని చేయలేదని గుర్జార్ తండ్రి పేర్కొన్నాడు.
Updated Date - 2020-12-30T23:20:24+05:30 IST