ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రజనీకాంత్ అందుకే వెనక్కి తగ్గాడా?

ABN, First Publish Date - 2020-12-30T01:34:46+05:30

తమిళనాట సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ఆలోచనకు 1996లోనే బీజం పడింది. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెట్టలేనంటూ చేసిన ప్రకటన కోట్లాదిమంది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఆయన చెప్పిన కారణం అరుణాచలం సినిమా డైలాగ్‌ను గుర్తు చేసింది. 'దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు' అన్నట్లుగానే.. ఈ నిర్ణయం దేవుడి సూచనగా భావిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ రజనీకాంత్‌ పలుమార్లు రాజకీయ పార్టీ విషయంలో వెనక్కి తగ్గారు. అసలు ఆయన ఆలోచన ఎప్పుడు మొదలయ్యింది? ఆయన వెనక్కి తగ్గడానికి కారణమేంటో చూద్దాం...


తమిళనాట సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ఆలోచనకు 1996లోనే బీజం పడింది. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చేందుకు, పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు రజనీ. ఇందులో భాగంగా అప్పటి ప్రధానమంత్రి పివి నర్సింహారావును కలిశారు. తాను తమిళనాడులో పార్టీ పెడతానని, కాంగ్రెస్‌పార్టీతో పొత్తుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు రాజకీయాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతుంది. అయితే, ఆ ప్రతిపాదనకు పీవీ నుంచి సానుకూల స్పందన రాలేదని చెబుతారు. దీంతో.. రజనీకాంత్‌ అప్పుడు పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు.


అప్పటినుంచి రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై చేస్తున్న ప్రయత్నాలు, జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వాళ్లు రజనీ రాజకీయ పార్టీ ప్రకటనపై పెదవి విరుస్తున్నారు. రజనీకాంత్‌ స్టేట్‌మెంట్‌లో ఫోర్స్‌ ఉంటుంది గానీ, చేతల్లో ఉండదని అంచనా వేస్తున్నారు. గతంలో జయలలితకు ఓటేస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. కానీ, రజనీకాంత్‌ మాత్రం ఇప్పటికీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.


రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రస్తావన నేపథ్యంలో.. తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తలైవా రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? అనేది ఓ చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి సారీ అటు రాజకీయ వర్గాలు, ఇటు రజనీ అభిమానుల్లో ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ, రజనీ మాత్రం ఈ ఉత్కంఠకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం లేదు.



ఈ క్రమంలోనే 2017లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు రజనీకాంత్‌. త్వరలోనే కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తానని ఊరించారు. ఆ సమయంలో అభిమానులు ఓరకంగా పండుగ చేసుకున్నారు. అయితే, కొద్దిరోజులకే మాట మార్చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడే కదన రంగంలోకి దూకాలని, ఎన్నికలు లేనప్పుడు పార్టీ ఎందుకని,ఇప్పుడంత తొందర అవసరం లేదని రజనీకాంత్‌ ఆసమయంలో పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేశారు. 


వచ్చే యేడాది మేలో తమిళనాడులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల మొదటివారంలో రజనీకాంత్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. డిసెంబర్‌ 31వ తేదీన రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నానన్నారు. దీంతో, ఈసారి మాత్రం ఇక ఫైనల్‌ డెసిషన్‌ వచ్చిందని, డిసెంబర్‌ 31వ తేదీకోసం ప్రధానంగా ఆయన అనుచరులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. అటు.. తమిళనాడు రాజకీయాల్లోనూ వేడి పుట్టింది.


కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న వాళ్లు రజనీకాంత్‌ ఇక పార్టీ పెట్టే అవకాశం ఉండబోదని తేల్చి చెబుతున్నారు. రజనీకాంత్‌కు అనారోగ్యం  కొత్తకాదని, తలైవా వెనక్కి తడం కూడా కొత్తకాదని విశ్లేషిస్తున్నారు. 2011 ఏప్రిల్‌, మే నెలల్లో రజనీకాంత్‌ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో 15రోజులు చికిత్స అందించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కొన్ని అంతుబట్టని అనారోగ్యాలు బాధించడంతో.. ఇక్కడ నయం కావట్లేదని సింగపూర్‌ మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ విజయవంతంగా చికిత్స తీసుకొని తిరిగొచ్చారు.


వాస్తవానికి రజనీకాంత్‌ పార్టీ పెట్టే విషయంలో అనారోగ్య సమస్య అనేది ప్రధాన కారణం కాకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముందే అంచనా వేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. పార్టీ పెడతానన్న ఆలోచన రెండున్నర దశాబ్దాలుగా ఉందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, అలాంటప్పుడు అనారోగ్యం అనే కారణం కరెక్ట్‌ కాకపోవచ్చునని కూడా అభిప్రాయపడుతున్నారు.


రాజకీయ పార్టీ పెట్టడం, రాష్ట్రమంతా ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికలను ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల తర్వాత ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తొమ్మిది నెలల కాలంలో ఆయన చేసిన యాత్రలు, అప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు గెలుపునకు కారణమయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు వేరు. పైగా.. 2021 మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అంటే.. ఏప్రిల్‌లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుంది. అంటే.. రజనీకాంత్‌ ఇప్పుడు పార్టీ పెడితే వంద రోజుల సమయం కూడా ఉండదు.


తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ చుట్టేయాలన్నా, గెలుపుకోసం వ్యూహాలు సిద్ధం చేయాలన్న సమయం సరిపోదని తెలుసు. ఇప్పుడున్న వందరోజుల గడువులో పార్టీని విజయతీరాలకు చేర్చడం కష్టసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. తమిళనాడులో సాధారణంగానే ఎన్నికల్లో డబ్బుల ప్రభావంఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రజనీకాంత్‌ పార్టీ ప్రాచుర్యం పొందాలన్నా, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్నా విపరీతమైన నిధులు అవసరమవుతాయి. ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే రజనీకాంత్‌ పార్టీ పెట్టే ఆలోచనకు అనారోగ్యం కారణం చెప్పారని సినీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి


Updated Date - 2020-12-30T01:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising