రైతు రుణం తీర్చుకోవడమంటే లాఠీలతో బాదడం కాదు: రాహుల్
ABN, First Publish Date - 2020-12-01T18:33:36+05:30
వ్యవసాయ చట్టాలు సజావుగా ఉంటే రైతులు ఎందుకు రోడ్డెక్కుతారని కాంగ్రెస్ మాజీ ..
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు సజావుగా ఉంటే రైతులు ఎందుకు రోడ్డెక్కుతారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులతో కేంద్ర ప్రభుత్వం వహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. లాఠీలు, భాష్పవాయు గోళాలు వారిపై ప్రయోగించే బదులు రైతు రుణం తీర్చుకునేందుకు వారికి న్యాయం చేసి, వారి హక్కులు వారికి కల్పించాలని హితవు పలికారు. నేషనల్ టెలివిజన్‌లో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు.
'రైతులు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు, కేంద్రం టీవీల్లో అబద్ధాలు చెబుతోంది. రైతులు పడే కష్టానికి మనం రుణపడి ఉండాలి. వారి న్యాయపరమైన హక్కులను కాపాడటం ద్వారా ఆ రుణం తీర్చుకోవాలి. వారి డిమాండ్లను తిరస్కరిస్తూ లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఎందుకు చేశారు? మేల్కోండి. రైతు హక్కులను కాపాడండి' అని రాహుల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలపై సోమవారంనాడు కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. సంస్కరణలు వారి ప్రయోజనాల కోసమే అయితే రైతులు ఎందుకు నిరసనలకు దిగుతారని కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు అండగా నిలబడాలని, నిరసనలు చేస్తున్న రైతులకు ఆహారం, ఇతర సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తితో కూడిన వీడియోను కూడా ట్వీట్‌కు ఆయన జతచేశారు.
Updated Date - 2020-12-01T18:33:36+05:30 IST