వర్క్ ఫ్రమ్ హోమ్... తెలివైన నిర్ణయం: ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2020-03-16T21:36:58+05:30
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తనవంతు బాధ్యత తీసుకున్న ఓ నెటిజన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు....
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తనవంతు బాధ్యత తీసుకున్న ఓ నెటిజన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘‘తెలివైన నిర్ణయమంటూ’’ సదరు ట్వీట్‌ను రిట్వీట్ చేశారు. దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇవాళ అశు ముగ్లికర్ అనే ఓ నెటిజన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘నా సమావేశాలన్నీ రద్దు చేసుకున్నాను. ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుకు తాళం వేశాం. బిజినెస్ ప్రయాణలన్నీ నిలిపివేశాను. ఒక బాధ్యతాయుతమైన యజమానిగా పౌరులు, వారి భద్రతకే నా ప్రధమ ప్రాధాన్యం. నివారణే ఉత్తమం..’’ అని పేర్కొన్నారు.
దీనిపై ప్రధాని స్పందిస్తూ... ‘‘ఇది తెలివైన నిర్ణయం. అనవసరమైన ప్రయాణాలు రద్దు చేసుకోవడం.. పదిమందిలో తిరగడాన్ని తగ్గించుకోవడం... స్వాగతించదగిన చర్యలు...’’ అని పేర్కొన్నారు. అశు పెట్టిన పోస్టును రీట్వీట్ చేశారు. దేశంలో కరోనా వైరస్ కేసులు 110 మార్కును దాటడం.. ఒక్క మహారాష్ట్రలోనే 30కి పైగా కేసులు నమోదు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు మూసివేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2020-03-16T21:36:58+05:30 IST