ఆసుపత్రులకు ఆక్సిజన్ నిరంతరాయ సరఫరాకు ‘పెసో’ చర్యలు
ABN, First Publish Date - 2020-03-28T01:59:16+05:30
ఆసుపత్రులకు ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అయ్యేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల
న్యూఢిల్లీ : ఆసుపత్రులకు ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అయ్యేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో భాగమైన పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లొజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) ఈ చర్యలను చేపట్టింది.
ఆసుపత్రులతోపాటు పెట్రోలియం, ఎక్స్‌ప్లొజివ్స్, బాణసంచా, పారిశ్రామిక గ్యాస్ కంపెనీలు ఆక్సిజన్ విషయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా చూసేందుకు వివిధ చర్యలను పెసో అమలు చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాపించకుండా నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం విధించిన నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేవిధంగా ఈ చర్యలు చేపట్టింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పెసో ప్రధాన కార్యాలయం నుంచి దాని అన్ని కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిపింది. మెడికల్ ఆక్సిజన్ నిల్వ, రవాణాకు అత్యవసరంగా లైసెన్సులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపినట్లు పేర్కొంది.
పెసో ఈ నెల 25న అన్ని రాష్ట్రాల హోం శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఓ సర్క్యులర్‌ను పంపించింది. మెడికల్ ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్‌ల తయారీ, రవాణా నిరంతరాయంగా జరగడానికి అనుమతి ఇవ్వాలని కోరింది.
ఆక్సిజన్, ఇతర గ్యాస్‌ల రవాణాకు ఇచ్చిన అనుమతుల గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు పెసో తెలిపింది.
Updated Date - 2020-03-28T01:59:16+05:30 IST