‘మాస్క్‌ల వల్ల కార్బన్ డయాక్సైడ్‌కు అతిగా గురయ్యే అవకాశం లేదు’
ABN, First Publish Date - 2020-10-04T22:08:25+05:30
కోవిడ్-19 మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు నోటికి ధరిస్తున్న మాస్క్‌లు హానికరం కాదని తాజా అధ్యయనం వెల్లడించింది.
వాషింగ్టన్ : కోవిడ్-19 మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు నోటికి ధరిస్తున్న మాస్క్‌లు హానికరం కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. మాస్క్ ధారణ వల్ల ఆరోగ్యం పాడవుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఊపిరి వదిలినపుడు కార్బన్ డయాక్సైడ్ మాస్క్‌లో చిక్కుకుని విషపూరితం అవుతుందని జరుగుతున్న ప్రచారానికి విరుద్ధంగా పరిశోధన ఫలితాలు వచ్చాయి. అమెరికన్ థోరాసిక్ సొసైటీకి చెందిన పత్రికలో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ)తో బాధపడే రోగుల్లో గాలి మార్పిడిపై ఫేస్ మాస్క్‌ల ప్రభావం అనే అంశంపై మియామీ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆరోగ్యంగా ఉన్నవారు, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు సర్జికల్ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించిన తర్వాత, అంతకు ముందు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయుల్లో మార్పుల వల్ల ఎదురైన సమస్యలను మైఖేల్ కెంపోస్, ఇతర పరిశోధకులు మదింపు చేశారు.
సీఓపీడీపై ఏటీఎస్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సీఓపీడీతో బాధపడే రోగులు ఊపిరి తీసుకోవడానికి తప్పనిసరిగా తీవ్రంగా శ్రమపడవలసి ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా, అలసటగా ఉంటుంది.
మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన మియామీ వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సెంటర్, పల్మనరీ, అలర్జీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ డివిజన్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ కెంపోస్ మాట్లాడుతూ, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు సైతం ఫేస్ మాస్క్ ధరించడం వల్ల నామమాత్రపు ప్రభావానికి మాత్రమే గురవుతారని తాము నిరూపించినట్లు తెలిపారు. ఆరోగ్యవంతులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటానికి కారణాలను వివరిస్తూ, మాస్క్ ధరించినపుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్న భావం కలిగితే, దానికి, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయుల్లో మార్పులకు సంబంధం ఉన్నట్లు కాదని చెప్పారు. మాస్క్ వల్ల ముక్కు నుంచి గాలి వెలువడే వేగం పరిమితమవడం వల్ల ఈ విధంగా జరగవచ్చునని చెప్పారు. ఊపిరి వదిలేటపుడు గాలి బయటకు వెళ్ళడానికి విశాలమైన మార్గం అవసరమని వివరించారు.
ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిని తప్పించుకోవడానికి ఇతరుల నుంచి సురక్షితమైన దూరంలో ఉన్నపుడు ఫేస్ మాస్క్‌ను తొలగించవచ్చునని, క్రిందకు దించవచ్చునని చెప్పారు.
సర్జికల్ మాస్క్ అందుబాటులో లేకపోతే, బట్టతో రెండు పొరలు ఉండేవిధంగా తయారు చేసిన మాస్క్‌ను ధరించవచ్చునని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి నుంచి బయట పడటానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని వివరించారు.
ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు కోవిడ్-19 మహమ్మారికి దూరంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. వీరు మాస్క్ ధరించడంతోపాటు చేతులు శుభ్రపరచుకోవడం, నిబంధనల ప్రకారం ఇతరుల నుంచి దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Updated Date - 2020-10-04T22:08:25+05:30 IST