సీఎం నివాసంలో కరోనా ఆస్పత్రి ఏర్పాటుపై యూటర్న్!
ABN, First Publish Date - 2020-07-08T23:13:14+05:30
ఒడిశా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసంలో తాత్కాలికంగా కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పట్నా మెడికల్ కాలేజీ ఉపసంహరించుకుంది.
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసంలో తాత్కాలికంగా కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పట్నా మెడికల్ కాలేజీ ఉపసంహరించుకుంది. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయానికి వచ్చింది.
అంతకుమునుపు.. సీఎం నివాసంలోనే ఉంటున్న ఆయన బంధువొకరు కరోనా బారిన పడ్డారని తెలియడంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా రిపోర్టుల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా..సీఎం నివాసంలోనే ఓ ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటూ పట్నా మెడికల్ కాలేజీకి ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ఈ మేరకు ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు మెడికల్ కాలేజీ ముందుకు వచ్చింది. వెంటిలేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటూ ఈ ఆస్పత్రికి ఆరు డాక్టర్లు, ముగ్గురు నర్సులను కేటాయించింది. వీరందరూ మూడు షిఫ్టుల్లో పని చేస్తారని తెలిపింది.
అయితే ఈ నిర్ణయం అమలయ్యేలోపే ప్రతిపక్షం ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ‘ప్రజలకు కరోనా పరీక్షలు చేస్తే రిపోర్టు రావడానికి 5-7 రోజులు పడుతోంది. అదే సీఎం విషయంలో మాత్రం రెండు గంటల్లో ఫలితం తెలిసిపోతోంది’ అని ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. ‘సరైన వైద్య సౌకర్యం అందకు పేదలు అల్లాడుతుంటే ఏకంగా సీఎం ఇంట్లోనే కరోనా ఆస్పత్రి ఏర్పాటవుతోంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పట్నా మెడికల్ కాలేజీ నిర్వహకులు ఆస్పత్రి ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
Updated Date - 2020-07-08T23:13:14+05:30 IST