కేంద్ర సాయుధ బలగాల అధికారి తప్పిదం.. హోం శాఖకు తలనొప్పులు
ABN, First Publish Date - 2020-06-02T01:00:40+05:30
కేంద్ర సాయుధ బలగాల క్యాంటీన్లలో స్వేదేశీ ఉత్పత్తులనే అమ్మాలనుకున్న ప్రభుత్వానికి అనుకోని అడ్డంకి ఎదురైంది.
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల క్యాంటీన్లలో స్వేదేశీ ఉత్పత్తులనే అమ్మాలనుకున్న ప్రభుత్వానికి అనుకోని అడ్డంకి ఎదురైంది. క్యాంటీన్లలో నిషేధించిన విదేశీ వస్తువుల జాబితాను విడుదల చేసిన కేంద్రం కొద్ది గంటల తరువాత దాన్ని ఉపసంహరించుకుంది. ఈ జాబితాలో భారతీయ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు కూడ ఉండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల ప్రకారం.. స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలన్న ఆదేశాల్ని అనుసరించి.. కేంద్ర సాయుధ బలగాల క్యాంటీన్ల ఇంచార్జి డీఐజీ మీనా ఓ ఉత్తర్వును జారీ చేశారు. క్యాంటీన్లకు సంబంధించి వివిధ వస్తువులను కూడా ఇందులో జత చేశారు. ఈ జాబితాలోని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించగా.. భారత్‌లోని దిగుమతైన వస్తువులు కల్గిన మూడో క్యాటగిరీని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ జాబితాలో ని స్వదేశీ బ్రాండ్లు అయిన డాబర్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్ ఫుడ్స్ ఉన్నట్టు బయటపడింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హోం శాఖ ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. తాజాగా సమాచారంతో కూడిన మరో జాబితాను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. తన పరిధి దాటి తప్పిదానికి కారణమైన అధికారిపై శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
Updated Date - 2020-06-02T01:00:40+05:30 IST