పేదలకే పెద్ద కష్టం
ABN, First Publish Date - 2020-06-01T06:59:01+05:30
కరోనా మహమ్మారి వల్ల పేద ప్రజలు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, వారి బాధను మాటల్లో వర్ణించలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ పేదప్రజలు...
- కనీవినీ ఎరుగని విపత్తు కరోనా
- మన్‌కీ బాత్‌లో మోదీ
న్యూఢిల్లీ, మే 31: కరోనా మహమ్మారి వల్ల పేద ప్రజలు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, వారి బాధను మాటల్లో వర్ణించలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ పేదప్రజలు, వలస కార్మికులు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన్‌కీబాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ఆదివారం ప్రసంగించారు. గతంలో ఎన్నడూ చూడని విపత్తు కరోనా అని మోదీ అన్నారు. దీనిపై దీర్ఘకాలం పోరాడాల్సి ఉంటుందన్నారు.
వలస కార్మికుల కోసం కమిషన్
వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే సిబ్బంది రేయింబవళ్లు పనిచేశారని ప్రశంసించారు. వారు కూడా కరోనా పోరాట యోధులేనని ప్రశంసించారు. వలస కార్మికుల సమస్యకు మైగ్రేషన్ కమిషన్ (వలసల కమిషన్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఉద్దీపన చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకున్న చర్యలు గ్రామస్థాయిలో ఉపాధి కల్పన, స్వయం ఉపాధికి అవకాశాలు పెంచాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయంసమృద్ధి భారత్‌ను ప్రజలు ఒక ఉద్యమంలా తీసుకున్నారని మోదీ పేర్కొన్నారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారని స్థానికానికే మద్దతు అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత ‘మన్‌కీ బాత్’ సమయానికి దేశంలో బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ నిలిచిపోయాయని.. ప్రస్తుతం పాక్షికంగా పునరుద్ధరించామని వివరించారు. కరోనా సవాళ్లను భవిష్యత్తుకు ఒక పాఠంలా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పాటించాలన్నారు. ఎన్నో కష్టాలకోర్చి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నామని.. ఆ కష్టాన్ని వృధాగా పోనివ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా ఉందని మోదీ పేర్కొన్నారు.
హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకు యోగానే!
కరోనా కష్టకాలంలో హాలీవుడ్‌నుంచి హరిద్వార్ వరకు అందరూయోగాపై దృష్టిపెట్టారని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ దేశాల నేతలు కూడా ఆయుర్వేదం పట్ల, యోగా పట్ల శ్రద్ధ చూపుతున్నారని.. ఈ విషయాన్ని అనేకమంది తనతో ప్రస్తావించారన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆన్‌లైన్ యోగా పోటీల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Updated Date - 2020-06-01T06:59:01+05:30 IST