పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీలకు కేంద్రం సమన్లు!
ABN, First Publish Date - 2020-12-11T18:19:48+05:30
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడిని కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీస్తోంది. గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పంపిన నివేదికను పరిశీలిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)లకు సమన్లు జారీ చేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరించాలని ఆదేశించింది. సౌత్ 24 పరగణాస్‌కు వెళ్తుండగా నడ్డా కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఓ లేఖ కూడా రాశారు.
బీజేపీ అధ్యక్షుడు నడ్డా గురువారం కోల్‌కతా నుంచి డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్ళ దాడి చేశారు. దాడికి పాల్పడినవారు టీఎంసీ మద్దతుదారులని బీజేపీ ఆరోపించింది. అయితే ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ ఇదంతా బీజేపీ నాటకమేనని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం స్పందిస్తూ, జేపీ నడ్డాపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిపై దర్యాప్తుకు ఆదేశించడంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను కోరారు.
Updated Date - 2020-12-11T18:19:48+05:30 IST