నిధుల కొరతతో మహారాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు కష్టాలు
ABN, First Publish Date - 2020-05-10T02:07:30+05:30
మహారాష్ట్రలో ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై నిధుల కొరత ప్రభావం
ముంబై : మహారాష్ట్రలో ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై నిధుల కొరత ప్రభావం తీవ్రంగా పడుతోంది. మార్కెట్ బాండ్ల ద్వారా నిధులను సేకరించేందుకు ప్రయత్నాలను ప్రస్తుతానికి నిలిపేయవలసి వస్తోంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ వ్యయాన్ని తగ్గించాలని నిర్ణయించడం మరింత ఇబ్బందికరంగా మారింది. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్ ఈ వివరాలను వెల్లడించారు.
సాగునీటి ప్రాజెక్టుల పనులను అష్ట దిగ్బంధనం సమయంలో కూడా ఆపలేదన్నారు. మొత్తం 22 వేల మంది కూలీలు 537 కేంద్రాల్లో ఉన్నారన్నారు. వీరు శిబిరాల నుంచి వెళ్ళిపోకుండా జాగ్రత్త వహించామన్నారు. వీరందరికీ ఆహార ధాన్యాలు, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.
అయితే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధుల కొరత పెను సవాలుగా మారిందన్నారు. నిధుల సేకరణ చాలా కష్టంగా మారిందన్నారు. బడ్జెట్ వ్యయంపై పరిమితి విధించడం వల్ల పని జరిగే వేగంపై ప్రభావం పడుతుందన్నారు.
సాగునీటి ప్రాజెక్టులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రిందకు తీసుకురావాలన్న ఆలోచన లేదన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో జలవనరుల శాఖకు రూ.10,235 కోట్లు కేటాయించారని, 313 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.1.09 లక్షల కోట్లు అవసరమని చెప్పారు.
Updated Date - 2020-05-10T02:07:30+05:30 IST