గాంబ్లింగ్ కంపెనీలకు హైకోర్టు షాక్.. కోహ్లీ, రానాలకు..
ABN, First Publish Date - 2020-11-03T23:17:24+05:30
దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఆన్‌లైన్ గాంబ్లింగ్ కంపెనీలకు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయా గాంబ్లింగ్ సంస్థల ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు...
చెన్నై: దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఆన్‌లైన్ గాంబ్లింగ్ కంపెనీలకు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయా గాంబ్లింగ్ సంస్థల ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. గాంబ్లింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటించడంపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని వారందరినీ ఆదేశించింది. నోటీసులు అందుకున్న సెలబ్రిటీల్లో క్రికెటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్‌లు ఉన్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు వ్యతిరేకంగా ఇటీవల మద్రాస్ హైకోర్టులో ఓ పీటీషన్ దాఖలైంది. ఆన్‌లైన్ గాంబ్లింగ్ వల్ల అనేకమంది జీవితాలు నాశనమవుతున్నాయని పిటీషనర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా వాటికి సంబంధించిన ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడం వల్ల సామాన్యులు ఎంతో మంది అటువైపు ఆకర్షితులవుతున్నారని, తద్వారా ఆ వ్యసనానికి బానిసలుగా మారి, అప్పులపాలై, చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారని పిటీషనర్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ఉన్న ప్రకటనల్లో సెలబ్రిటీలు ఎందుకు నటించారంటూ సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో తెలియజేస్తూ ఈ నెల 19వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Updated Date - 2020-11-03T23:17:24+05:30 IST