ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 2 వారాలు

ABN, First Publish Date - 2020-04-12T07:39:09+05:30

కరోనా కట్టడి నిమిత్తం ప్రకటించిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్చి 25న ప్రకటించిన ఈ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈనెల 14న ముగియాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంలదీ ఇదే మాట.. కానీ గతంలోలా ఉండదు

మనమూ ఉండాలి.. ప్రపంచమూ ఉండాలి

ప్రాణంతోపాటు ఆర్థికమూ ముఖ్యమే

వివిధ రంగాల్లో దశలవారీగా ఎత్తివేత!

సాగుకు ప్యాకేజీ.. నేరుగా అమ్ముకునే వీలు

కేంద్రం యోచన.. నేడో రేపో మోదీ ప్రకటన


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి నిమిత్తం ప్రకటించిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్చి 25న ప్రకటించిన ఈ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈనెల 14న ముగియాల్సి ఉంది.  కొవిడ్‌-19 ఉధృతి ఇంకా అదుపులోకి రాలేదని, రోగుల సంఖ్య పెరుగుతూనే ఉందని, అందుచేత లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతకు సంబంధించి మోదీ శనివారం 13 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 4 గంటలకు పైగా జరిగిన ఈ చర్చలో దాదాపు అందరూ పొడిగింపు వైపే మొగ్గుచూపారని, దీనిని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం మనం తీసుకుంటున్న చర్యల ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది వచ్చే మూడు-నాలుగు వారాల్లో తెలుస్తుంది. ఈ నాలుగు వారాలూ నిరంతర నిఘా, అప్రమత్తత అవసరం’’ అన్నారాయన. షెడ్యూల్‌ ప్రకారం మోదీ శనివారంరాత్రే దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన ఆది లేదా సోమవారాల్లో ఈ ప్రసంగం చేస్తారని, ఎత్తివేత విషయం చెబుతారని అధికార వర్గాలు తెలిపాయి. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని అభిప్రాయపడగా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాలని సూచించడం గమనార్హం. 


జాన్‌ భీ.. జహాన్‌ భీ..!

‘‘జాన్‌ హై తో జహాన్‌ హై(మనం బతికుంటేనే ప్రపంచం ఉంటుంది) అని గతంలో లాక్‌డౌన్‌ విధించినపుడు నేను అన్నాను.  ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు. ఇపుడు జాన్‌ భీ, జహాన్‌ భీ(మనమూ ఉండాలి.. ప్రపంచమూ ఉండాలి) అని అంటున్నా. అంటే ప్రాణంతో పాటు జీవనమూ (ఆర్థిక కార్యకలాపాలూ) ముఖ్యమే..’’ అని మోదీ పేర్కొన్నారు. దీని అర్థం లాక్‌డౌన్‌ పొడిగించినా కొన్ని ప్రాంతాల్లో, రంగాల్లో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే వివిధ ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకుంది. ఏయే రంగాలకు మినహాయింపులివ్వాలన్నది పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘‘పారిశ్రామిక, నిర్మాణరంగాలకు దశలవారీగా ఎత్తివేత అమలు చేస్తాం. వ్యవసాయదారులకు ఆర్థిక ప్యాకేజీ అందజేస్తాం. ఒకవేళ మార్కెట్లను షట్‌డౌన్‌ చేసినా రైతులు వ్యవసాయ క్షేత్రాల నుంచే అమ్మకాలు జరపొచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్లలో వైద్యులు, మెడికల్‌ సిబ్బందిపై దాడులు జరగడాన్ని ఆయన ఖండించారు. వారికి భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ను ఎత్తేసినా, పూర్తిగా సడలించినా తమకు ఇబ్బందేనని, ఎత్తేస్తే రోగుల సంఖ్య ఊహించనంతగా పెరిగిపోతుందని ముఖ్యమంత్రులు ప్రధానికి చెప్పారు. వేల సంఖ్యలో రోగులు వస్తే తాము తట్టుకోలేమని వారు అన్నట్లు తెలిసింది. ‘‘ఈ పొడిగింపు తొలిసారి ప్రకటించిన లాక్‌డౌన్‌ మాదిరి ఉండదు. చాలా వెసులుబాట్లు ఉంటాయి’’ అని కర్ణాటక సీఎం యడ్యూరప్ప వెల్లడించారు. 


లాక్‌డౌన్‌ను నీరుగారుస్తున్నారు: బెంగాల్‌పై కేంద్రం ఆక్షేపణ

లాక్‌డౌన్‌ను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కఠినంగా అమలు చేయడం లేదని కేంద్రం తప్పుబట్టింది. ‘‘దుకాణాలను తెరుస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. కూరగాయలు, చేపలు, మటన్‌ మార్కెట్లలో జనం ఎగబడుతున్నారు. సామూహిక సమావేశాలు, మతపరమైన కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు’’ అని కేంద్ర హోంశాఖ విమర్శించింది. 


కాటన్‌ మాస్క్‌ ధరించిన మోదీ 

సీఎంలతో వీసీ సమయంలో ప్రధాని మోదీ కాటన్‌తో చేసిన మాస్క్‌ను ధరించారు. ఇంట్లో ఉన్న వస్త్రాలనే మాస్క్‌లుగా మార్చుకోవాలని గత వారం కేంద్రం సూచించడంతో ఆయన ఈ కాటన్‌ వస్త్రాన్ని మాస్క్‌ గా ధరించి సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ముఖ్యమంత్రులందరూ కూడా ఇదే రీతిన కాటన్‌ మాస్కులు పెట్టుకోవడం విశేషం. సంభాషణ జరిపిన నాలుగు గంటల పాటు ఆయన మాస్క్‌ పెట్టుకునే ఉన్నారు.


లిక్కర్‌కు ఓకే..!

లాక్‌డౌన్‌ను పొడిగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన కేంద్రం.. నగరాలు, పట్టణాల్లో రోగుల సంఖ్యను బట్టి జోన్లుగా విభజించాలని యోచిస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రస్తావన తేకపోయినప్పటికీ.. ఈ దిశగా కసరత్తు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెడ్‌జోన్‌గా ప్రకటిస్తారు. ఇది పూర్తి లాక్‌డౌన్‌లో ఉంటుంది. కాస్త తక్కువ కేసులుంటే ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటిస్తారు. ఇక్కడ పరిమిత సంఖ్యలో ప్రజలకు, దుకాణాలకు అనుమతులుంటాయి. రోగుల్లేని చోట్ల గ్రీన్‌జోన్‌ ప్రకటిస్తారు. ఇక్కడ యథావిధిగా కార్యకలాపాలుంటాయి. అయితే నిర్దిష్ట వేళల్లో మాత్రమే! మద్యం దుకాణాలను అనుమతించే విషయాన్ని కూడా కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రాల సీఎంలు కోరగా.. ప్రధాని వెంటనే ఏ నిర్ణయమూ ప్రకటించలేదు.


ఎవరేమన్నారు?


లాక్‌డౌన్‌ను పొడిగించడం సరైన చర్య. చాలా దేశాల కంటే మనం ఇపుడు మెరుగైన స్థితిలో ఉన్నాం. కారణం... ముందస్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడం!

- కేజ్రీవాల్‌,  ఢిల్లీ సీఎం


లాక్‌డౌన్‌ను మేం ఇప్పటికే 30వ తేదీ దాకా పొడిగించాం. పెద్దగా ప్రభావం లేని ప్రాంతాల్లో కాస్తంత సడలిస్తాం. మిగిలిన చోట్ల మరింత కఠినం చేస్తాం. 30 తరువాత పొడిగించేదీ లేనిదీ అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయిస్తాం..

- ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం


లాక్‌డౌన్‌ మరో 15 రోజులుంటుంది. దశలవారీగా సడలింపులు చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి వెసులుబాటు ఇవ్వాలని కోరాం

- యడ్యూరప్ప, కర్ణాటక సీఎం


అందరికంటే ముందు మేమే లాక్‌డౌన్‌ను 30 దాకా పొడిగించాం. ప్రాణాలు ముఖ్యమా, ఆర్థిక కార్యకలాపాలు ముఖ్యమా అన్నది సంక్లిష్ట నిర్ణయం   

- నవీన్‌ పట్నాయక్‌, ఒడిసా సీఎం


ఇది పంట కోతల సమయం. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి. రైతులు, కూలీలు పొలాల్లో, మండీల్లో పోటెత్తుతారు. అందుచేతే లాక్‌డౌన్‌ను 30 దాకా పొడిగించాం.                   

- అమరీందర్‌ సింగ్‌, పంజాబ్‌ సీఎం


ఆర్థిక కార్యకలాపాలను అంతర్గతంగా పరిమితం చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతివ్వాలి. రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతివ్వాలి

- భూపేశ్‌ బాఘేల్‌, ఛత్తీ్‌సగఢ్‌ సీఎం


లాక్‌డౌన్‌ పొడిగించాల్సిందే. సరిహద్దుల్లో మరింత నిఘా అవసరం. ఎవరూ దేశంలోకి జొరబడకుండా చూడాలి

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం


మాకు తగినన్ని మౌలిక సదుపాయాలున్నాయి. ఇబ్బంది లేదు. లాక్‌డౌన్‌ పొడిగించండి

- శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మధ్యప్రదేశ్‌ సీఎం


కొవిడ్‌ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. కొందరు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారు. దీన్ని నివారించాలి

- వి నారాయణస్వామి, పాండిచ్చేరి సీఎం

Updated Date - 2020-04-12T07:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising