పదేళ్లు ఒకే గదిలో ముగ్గురు తోబుట్టువులు
ABN, First Publish Date - 2020-12-29T09:23:10+05:30
కొన్నాళ్ల క్రితం ఆ ముగ్గురు తోబుట్టువుల తల్లి అనారోగ్యంతో చనిపోయారు. ఈ పరిణామంతో వారు తీవ్రంగా కుంగిపోయారు. తల్లి చనిపోయారన్న
తల్లి మరణంతో కుంగుబాటులోకి.. గదంతా చెత్తాచెదారం, మానవ వ్యర్థాలు
రక్షించిన ఎన్జీవో.. గుజరాత్‌లో ఘటన
అహ్మదాబాద్, డిసెంబరు 28: కొన్నాళ్ల క్రితం ఆ ముగ్గురు తోబుట్టువుల తల్లి అనారోగ్యంతో చనిపోయారు. ఈ పరిణామంతో వారు తీవ్రంగా కుంగిపోయారు. తల్లి చనిపోయారన్న షాక్‌లోనే ఉన్నారు. ఆ షాక్ నుంచి ఎలా బయటపడాలో తెలీక ముగ్గురూ ఓ గదిలో తలుపులు వేసుకొని బందీ అయ్యారు. ఆ గదిలో కనీసం వెలుతురు కూడా లేదు. అలాంటి ప్రదేశంలో దాదాపు పదేళ్ల పాటు ఉన్నారు. ఎట్టకేలకు ‘సాథీ సేవ గ్రూప్’ అనే ఎన్జీవో వారి తండ్రి సహకారంతో ఆ తోబుట్టువులను కాపాడింది. దీంతో వారు పదేళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూడగలిగారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ గదంతా చెత్తాచెదారం, మానవ వ్యర్థాలతో చిందరవందరగా ఉందని ఆ ఎన్జీవో ప్రతినిధి జల్పా పటేల్ తెలిపారు. ‘‘ఆ ముగ్గురు తోబుట్టువుల్లో ఇద్దరు సోదరులు, ఒక సోదరి. అఘోరాల కన్నా వారి పరిస్థితి ఘోరంగా ఉంది. రోజూ గది బయట వారి నాన్న ఆహారం పెట్టేవారు. వారిని ఆ గదిలోంచి బయటకు తీసుకొచ్చి శుభ్రంగా క్షవరం చేయించాం. బాధితుల్లో పెద్ద కుమారుడు అమ్రీష్ (42) ఎల్‌ఎల్‌బీ, మేఘన (39) సైకాలజీలో ఎంఏ చేశారు. చిన్న కుమారుడు ఆర్థికశాస్త్రంలో బీఏ చేశాడు. ఇప్పటికీ వారు స్థిమితంగా లేరు. వెంటనే వారికి చికిత్స అవసరం’’ అని పటేల్ వెల్లడించారు.
Updated Date - 2020-12-29T09:23:10+05:30 IST