యువతను ఇస్లాంకు సన్నిహితం చేసే పుస్తకాలు సూచిస్తున్న ఇమ్రాన్ ఖాన్
ABN, First Publish Date - 2020-10-04T20:40:15+05:30
ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ యువతను ఇస్లాంకు మరింత సన్నిహితం చేయాలని సంకల్పించారు. ఓ వైపు దేశంలో మానవ హక్కుల
ఇస్లామాబాద్ : ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ యువతను ఇస్లాంకు మరింత సన్నిహితం చేయాలని సంకల్పించారు. ఓ వైపు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతుండగా, ఆయన తాను గతంలో ప్రేరణ పొందిన పుస్తకాన్ని చదవాలని యువతను ప్రోత్సహిస్తున్నారు.
బలూచిస్థాన్, గిల్గిట్-బాల్టిస్థాన్‌లలో పాత్రికేయులపై మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నట్లు మానవ హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో యువతకు ఓ సలహా ఇచ్చారు. ఎలిఫ్ షఫక్ రాసిన ‘ది ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని అక్టోబరు నెలలో యువతకు సూచిస్తున్నానని తెలిపారు. ఇది దైవ ప్రేమ, సూఫిజం గురించి స్ఫూర్తిదాయకమైన పుస్తకమని పేర్కొన్నారు. కొన్నేళ్ళ క్రితం తాను ఈ పుస్తకాన్ని చదివినట్లు, గాఢమైన స్ఫూర్తి పొందినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకం ఫొటోను కూడా ఆయన జత చేశారు.
ఇమ్రాన్ ఖాన్ మే నెలలో ‘లాస్ట్ ఇస్లామిక్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని యువతకు సూచించారు. అష్ట దిగ్బంధనం రోజుల్లో చదవడానికి యువతకు ఇది చాలా గొప్ప పుస్తకమని పేర్కొన్నారు. ఇస్లామిక్ నాగరికత మహోన్నతంగా వెలగడం నుంచి క్షీణత వరకు ఈ పుస్తకంలో వివరించారని, వీటి వెనుకనున్న కారణాలను కూడా తెలిపారని పేర్కొన్నారు.
ఇదిలావుండగా పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రికేయులపై హింస, బెదిరింపులు పెరుగుతున్నాయని పేర్కొంది.
Updated Date - 2020-10-04T20:40:15+05:30 IST