ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ ఢిల్లీలో హిందూ సేన ప్రార్థనలు
ABN, First Publish Date - 2020-11-03T22:53:47+05:30
తూర్పు ఢిల్లీలోని ఓ ఆలయంలో ప్రత్యేకంగా అరగంటపాటు జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ ఢిల్లీలో హిందూసేన ప్రార్థనలు నిర్వహించింది. తూర్పు ఢిల్లీలోని ఓ ఆలయంలో ప్రత్యేకంగా అరగంటపాటు జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ట్రంప్ మళ్లీ ఎన్నికయ్యేలా దీవించమని భగవంతుడిని ప్రార్థించారు. ప్రత్యేక పూజలతోపాటు ఆలయంలో హోమం కూడా నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ రాడికల్స్‌కు పూర్తిగా వ్యతిరేకమని, ప్రపంచ దేశాలు మొత్తం ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇదని పూజా కార్యక్రమాలు నిర్వహించిన పురోహితుడు వేదశాస్త్రి అన్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఎంతో ముఖ్యమని అన్నారు.
ట్రంప్ విజయం సాధించాలంటూ గత ఎన్నికల సందర్భంగా కూడా తాము పూజలు చేసినట్టు హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా తెలిపారు. ఆయన విజయం ప్రపంచ విజయం మాత్రమే కాదని, చైనా, పాకిస్థాన్‌లకు వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మంచి మిత్రదేశం అని పేర్కొన్నారు. ఇదే హిందూ సేన రెండేళ్ల క్రితం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కేక్ కట్ చేసి ట్రంప్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించింది.
Updated Date - 2020-11-03T22:53:47+05:30 IST