అమెరికాలో విఫలమైన చట్టాలు ఇక్కడ రుద్దేస్తున్నారు: సిద్ధూ
ABN, First Publish Date - 2020-10-05T00:52:51+05:30
అమెరికాలో విఫల వ్యవస్థలను ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ..
న్యూఢిల్లీ: అమెరికాలో విఫల వ్యవస్థలను ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలు గుప్పించారు. దేశాన్ని కేపటలిస్టులే నడుపుతున్నారని అన్నారు. రైతులకు ఒనగూరే ప్రయోజనాలను 'సబ్సిడీలు'గా చెబుతూ, ప్రోత్సాహకాల పేరుతో సంపన్నులకు లక్షలాది రూపాయల మినహాయింపులు ఇస్తున్నారని సిద్ధూ అన్నారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్‌లోని మొగాలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో సిద్ధూ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సిద్ధూ మాట్లాడుతూ, రైతులకు ఉపశమనం కలిగించేలా కనీస మద్దతు ధరతో రైతుల ఉత్పత్తులను పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యాపిల్ రైతుల విషయంలో ఇదే చేసిందని ఆయన గుర్తు చేశారు. యాపిల్స్‌ను హిమాచల్ ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు, వారికి (రైతులకు) మనం కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వలేం? అని సిద్ధూ ప్రశ్నించారు. సమాఖ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ దాడిలో భాగంగానే రైతు చట్టాలను తెచ్చారని ఆయన విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీతో కలసి సిద్ధూ ఒకే వేదికను పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Updated Date - 2020-10-05T00:52:51+05:30 IST