రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు
ABN, First Publish Date - 2020-04-05T11:30:44+05:30
దేశంలో కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది....
కరోనా రోగులకు ఆక్సిజన్ అందించండి...
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.కరోనా వైరస్ సోకిన రోగులకు ఆక్సిజన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది.ఆసుపత్రుల్లోని కరోనా రోగులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించాలని కేంద్రం కోరింది. కరోనా రోగులున్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే కంట్రోల్ రూం ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు, లేదా ఆల్ ఇండియా గ్యాస్ ఉత్పత్తిదారుల సంఘాన్ని సంప్రదించాలని కోరింది. ఈ మేర కేంద్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారిణి వందనా గుర్నానీ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, కేంద్రపాలితప్రాంతాల అధికారులకు లేఖలు రాశారు.
ఆక్సిజన్ సరఫరా చేసే గ్యాస్ లైన్లలో ఇన్ఫెక్షన్లు సోకకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిణి వందనా గుర్నానీ సూచించారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ పాయింట్ నుంచి క్రిటికల్ కేర్ ఉన్న ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో కార్మికుల నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. కరోనా రోగుల కోసం చైనా నుంచి పదివేల వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని, దేశంలో మరో 40 వేల వెంటిలేటర్ల ఉత్పత్తి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆర్డరు ఇచ్చిందని వందనా చెప్పారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆక్సిజన్ సిలిండర్లను, ట్రాలీలను సబ్బు వేడినీళ్లతో శుభ్రం చేయాలని ఆమె ఆదేశించారు.సిలిండర్లు, కంటెయినర్లను శుభ్రం ఉంచడంతోపాటు కరోనా రోగులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిణి వందనా ఆదేశించారు.
Updated Date - 2020-04-05T11:30:44+05:30 IST