‘హత్రాస్’ కేసు : అమిత్ మాలవీయ, దిగ్విజయ్ సింగ్‌లపై చర్యలకు ఎన్‌సీడబ్ల్యూ సిద్ధం
ABN, First Publish Date - 2020-10-05T00:14:24+05:30
‘హత్రాస్’ బాధితురాలి గుర్తింపును వెల్లడించిన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : ‘హత్రాస్’ బాధితురాలి గుర్తింపును వెల్లడించిన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన మహిళలు, బాలల పేర్లు, ఇతర వివరాలను వెల్లడించరాదనే నిబంధనలు చెప్తున్నప్పటికీ, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, తదితరులు బాధితురాలి గుర్తింపును వెల్లడించినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖ శర్మ మాట్లాడుతూ, అమిత్ మాలవీయ మాత్రమే కాకుండా, దిగ్విజయ్ సింగ్, స్వర భాస్కర్, మరికొందరు ‘హత్రాస్’ బాధితురాలి గుర్తింపును బహిరంగంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించినట్లు చెప్పారు. ఆమె గుర్తింపు వివరాలను జంతర్ మంతర్ వద్ద మరికొందరు వెల్లడించారన్నారు.
బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయంపై రిపోర్టులో స్పష్టత లేదన్నారు. మరోవైపు కోర్టు స్వీయ విచారణ జరుపుతోందన్నారు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో, పోస్టర్లలో వెల్లడించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని ఓ గ్రామంలో సెప్టెంబరు 14న పందొమ్మిదేళ్ళ దళిత యువతిపై అగ్ర వర్ణానికి చెందిన నలుగురు అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరచినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు సెప్టెంబరు 29న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేశారు. అయితే సీబీఐ దర్యాప్తుకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదు, ఈ కేసుపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2020-10-05T00:14:24+05:30 IST