దేశం మొత్తానికి వ్యాక్సీన్ ఇస్తామనలేదు: హెల్త్ సెక్రెటరీ
ABN, First Publish Date - 2020-12-01T23:08:14+05:30
బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో ఫ్రీ వ్యాక్సీన్ అంశాన్ని బీజేపీ చేర్చింది. బిహార్‌లోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ అందిస్తామని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ స్పష్టం చేశారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య అని, ఇలాంటి విషయాలపై వాస్తవిక సమాచారంతో చర్చలు చేయాలని ఆయన సూచించారు. దేశం మొత్తానికి కరోనా వ్యాక్సీన్ ఉచితంగా అందిస్తారని ప్రభుత్వ నేతల నుంచే వ్యాఖ్యలు రావడంతో దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై రాజేష్ భూషన్‌ను మీడియా ప్రశ్నించగా పై విధంగా సమాధానం చెప్పారు.
బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో ఫ్రీ వ్యాక్సీన్ అంశాన్ని బీజేపీ చేర్చింది. బిహార్‌లోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ అందిస్తామని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చదువుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. కాగా, దీనిపై రాజకీయ దుమారం లేవడంతో దేశంలోని ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సీన్ అందిస్తామని మరో కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇక మరో మంత్రి అయిన ప్రతాప్ సారంగి ఇంకో అడుగు ముందుకు వేసి దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ అందించనున్నట్లు దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని అన్నారు.
ఈ నేపథ్యంలో ఫ్రీ వ్యాక్సీన్‌పై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిపై తరుచూ పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ప్రభుత్వంలో ఉన్న నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్రీ వ్యాక్సీన్ అంశాన్ని వినియోగించుకుంటున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి మంగళవారం వివరణ ఇస్తూ ‘‘నేను మీకు ఒక ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. దేశం మొత్తాన్ని కరోనా వ్యాక్సీన్ అందిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి శాస్త్రీయమైన విషయాలపై వాస్తవాల ఆధారంగానే చర్చ చేయాలి’’ అని అన్నారు.
Updated Date - 2020-12-01T23:08:14+05:30 IST