కరోనా భయంతో ఎంతపని చేశారో చూడండి.!
ABN, First Publish Date - 2020-03-16T21:32:20+05:30
ప్రపంచవ్యాప్తంగా కరోనా పేరు మోత మోగుతోంది. భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ...
త్రిస్సూర్: ప్రపంచవ్యాప్తంగా కరోనా పేరు మోత మోగుతోంది. భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. వినోదం కోసం సినిమాలు, షికార్లకు బయటకు వెళ్లే ప్రజలు ఇంట్లోనే కాలక్షేపానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ప్రయాణాలకు కూడా అత్యంత అవసరం అయితే తప్ప ముందుకు రావడం లేదు. ఇతర దేశాల నుంచి ఎవరైనా తిరిగొచ్చారని తెలిస్తే ఆ ఛాయలకు కూడా వెళ్లడం లేదు. వెళ్లక పోవడం వారిష్టం కానీ ఇతర దేశాల నుంచి వచ్చారని తెలిసి భార్యాభర్తలను వారి ఫ్లాట్‌లో ఉండగా బయట తాళం వేసిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో వెలుగుచూసింది.
సౌదీ అరేబియాలో ఉన్న తమ కొడుకును చూసి ఆ భార్యాభర్తలు తిరిగి ఇంటికొచ్చారు. వారు సౌదీ నుంచి వచ్చారని తెలుసుకున్న ఆ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు వారిని ఫ్లాట్‌లో ఉంచి తాళమేశారు. భార్యాభర్తలు ఎంత కొట్టినా తాళం తీయలేదు. అంతేకాదు, వారి ఫ్లాట్ డోర్‌పై ‘కరోనా’ అని రాసిన పేపర్‌ను అంటించారు. అసలు విషయం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు స్పందించి వారికి విముక్తి కలిగించారు. అసోసియేషన్ సభ్యులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. మరో విషయమేంటంటే.. ఆ భార్యాభర్తలకు వైద్య పరీక్షలు చేయగా.. కరోనా లేదని తేలింది.
Updated Date - 2020-03-16T21:32:20+05:30 IST