భయపెట్టే వేగం
ABN, First Publish Date - 2020-03-16T08:08:51+05:30
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ నవల చదివారా? అందులో ప్రధాన పాత్రధారి చదరంగ నిపుణుడు రాజుతో ఆడి గెలిచి ఏం కావాలో కోరుకోమంటే.. చదరంగం బల్లలోని మొదటి గడిలో...
- త్వరత్వరగా చుట్టబెట్టే కొవిడ్-19
- తగిన చర్యలు తీసుకోకపోతే
- ప్రతి 6 రోజులకూ కేసులు రెట్టింపు
- అమెరికాలో ఏడు వారాల్లో 2,952 మందికి వ్యాప్తి!
- మనదేశంలో 12 రోజుల్లో 6 నుంచి 110కి
- తగిన జాగ్రత్తలతో వేగాన్ని అడ్డుకోవచ్చు: వైద్యనిపుణులు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ నవల చదివారా? అందులో ప్రధాన పాత్రధారి చదరంగ నిపుణుడు రాజుతో ఆడి గెలిచి ఏం కావాలో కోరుకోమంటే.. చదరంగం బల్లలోని మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది.. ఇలా గడిగడికీ రెట్టింపు చొప్పున ఇవ్వాలని కోరుతాడు! అలా ఇస్తే అరవైనాలుగో గడిలో పెట్టడానికి సరిపడా ధాన్యం ఆ రాజ్యంలోనే ఉండదు. కరోనా కూడా అంతేనని.. దాని కట్టడికి చర్యలు తీసుకోకపోతే సగటున ప్రతి ఆరు రోజులకూ కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని సియాటెల్ (అమెరికా)లోని ఫ్రెడ్ హచిన్సన్ కేన్సర్ రిసెర్చ్ సెంటర్‌కు చెందిన పరిశోధకుడు ట్రెవర్ బెడ్‌ఫోర్డ్ తెలిపారు. కొవిడ్-19కు కేంద్రస్థానమైన చైనాలో ఆ వైరస్ వ్యాప్తి ఎప్పుడు మొదలైందో తెలియదు కాబట్టి.. ఆ దేశాన్ని పక్కనపెడదాం! ఎక్కడో సుదూరంగా ఉన్న అమెరికానే ఉదాహరణగా తీసుకుంటే.. ఈ ఏడాది జనవరి 21న అమెరికాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత నెమ్మదిగా, క్రమంగా పెరుగుతూ 50 రోజులు గడిచేసరికి ఆ దేశంలో 2500 మందికి పాకింది.
ఆదివారంనాటికి అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అక్షరాలా 2952కు చేరింది. అన్ని రాష్ట్రాలకూ పాకింది. 60 మంది చనిపోయారు. ఇక మనదేశంలో కూడా తొలుత కేరళలో మూడు కేసులు వెలుగు చూశాయి. మార్చి 2నఢిల్లీవాసికి, హైదరాబాద్‌వాసికి సోకింది. మార్చి 3 నాటికి కేసుల సంఖ్య కేవలం 6. కానీ, చూస్తుండగానే 12 రోజుల్లో ఆ సంఖ్య 110కి చేరింది. ఇద్దరు వృద్ధులు కరోనాతో మృత్యువాత పడ్డారు. అయితే.. జాగ్రత్త చర్యలతో కొవిడ్-19 వేగవ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా వైరస్ వ్యాపించే వేగం తగ్గి, కేసుల సంఖ్య తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. సింగపూర్‌ను ఉదాహరణగా చూపుతున్నారు. చైనా తర్వాత ఒక దశలో అత్యధిక కేసులు నమోదైన సింగపూర్‌లో ప్రభుత్వం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించింది. దీంతో వైరస్ వ్యాప్తి బాగా తగ్గింది. ఫిబ్రవరి రెండోవారానికి సింగపూర్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80.. మార్చి 13 నాటికి 178 కేసులకు పరిమితమైంది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
Updated Date - 2020-03-16T08:08:51+05:30 IST