మరో 2,003 మరణాలు
ABN, First Publish Date - 2020-06-18T07:22:26+05:30
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా మరో 2,003 మందిని ఆ మహమ్మారి బలిగొంది. దీంతో బుధవారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3,54,065కు చేరగా...
- మహారాష్ట్ర, ఢిల్లీ పాత గణాంకాలను సవరించడంతో పెరిగిన మృతులు
- దేశవ్యాప్తంగా 3.5 లక్షల కరోనా కేసులు
- 11, 13 స్థానాల్లో ఆంధ్రా, తెలంగాణ
న్యూఢిల్లీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా మరో 2,003 మందిని ఆ మహమ్మారి బలిగొంది. దీంతో బుధవారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3,54,065కు చేరగా, వారిలో ఇప్పటివరకు 11,903 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల రేటు 3.8ు పెరిగింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఇంతకుముందు తాము కేంద్ర ఆరోగ్యశాఖకు సమర్పించిన కరోనా మరణాల గణాంకాలను సవరించాయి. పాత గణాంకాలను కరోనా మరణాల జాబితాకు జోడించడం వల్లే బుధవారం నమోదైన మొత్తం మరణాల సంఖ్య అమాంతం పెరిగి 2,003కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఇక దేశంలో గడిచిన ఒక్క రోజులో 10,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,55,227 మంది కరోనా సోకి చికిత్స పొందుతుండగా, 1,86,935 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్యలో ప్రపంచదేశాలలో భారత్ 8వ స్థానానికి చేరుకోగా, కేసుల నమోదులో 4వ స్థానంలోనే కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్‌తోపాటు మన దేశంలోనూ రోజుకు సుమారు పదివేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
రాష్ట్రాల్లో ఉధృతి ఇలా..
కరోనాతో వణుకుతున్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,13,445 మందికి వైరస్ సోకగా.. 5,537 మంది మృతిచెందారు. వైరస్ ఉధృతిలో ద్వితీయ స్థానంలో ఉన్న తమిళనాడులో 48,019 మంది మహమ్మారి బారిన పగా.. 528 మంది మృతిచెందారు. తృతీయ స్థానంలో ఉన్న ఢిల్లీలో 44,688 పాజిటివ్ కేసులు నమోదవగా, 1,837 మంది ప్రాణాలు కోల్పోయారు. 11వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాటికి 6,841 కేసులు నమోదవగా, 3,244 మంది చికిత్స పొందుతున్నారు. 3,509 మంది కోలుకోగా, 88 మంది మరణించారు. 13వ స్థానంలో ఉన్న తెలంగాణలో ఈనెల 16 నాటికి 5,406 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీరిలో 2,188మంది చికిత్స పొందుతున్నారు. 3,027మంది కోలుకోగా, 191 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకినవారు కోలుకునే రేటు క్రమక్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 52.8 శాతానికి పెరిగిందని తెలిపింది.
ఢిల్లీ మంత్రికి కరోనా
ఢిల్లీలో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఈ జాబితాలో అక్కడి ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్(55)తో పాటు ఎమ్మెల్యేలు కల్కాజీ ఆతిషి, విశేష్ రవి, రాజ్‌కుమార్ ఆనంద్ ఉన్నారు. ఇక తమిళనాడులో సీఎం కార్యాలయంలో పనిచేసే సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ ఒకరు కరోనాతో మృతిచెందారు. కర్నాటకలో కరోనా కేసులు 8వేలకు చేరువలో ఉన్నాయి. కాగా, అతి తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ కలిగిన రోగుల చికిత్సకు రైల్వేశాఖ బుధవారం ఐదు రాష్ట్రాల్లో 960 రైల్వే ఐసొలేషన్ కోచ్‌లను ఏర్పాటు చేసింది.
నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా
నా వల్లే కరోనా సోకి భర్త చనిపోయాడు : ఏసీపీ
అత్యవసర పనులు ఉంటేనే బయటికి వెళ్లాలని ప్రభుత్వాలు గొంతు చించుకుంటున్నా చాలామంది వినిపించుకోవడం లేదు. అలాంటి వారు కచ్చితంగా ఢిల్లీ ఏసీపీ సురీందర్ జీత్ కౌర్ చెబుతున్న మాటలు వినాలి. కరోనాతో తన కుటుంబానికి జరిగిన తీవ్రమైన నష్టం గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నా భర్త చరణ్‌జీత్ సింగ్(54) లాక్‌డౌన్ల వేళ ఇంటిపట్టునే ఉండేవారు. నేను మాత్రం అనివార్య పరిస్థితుల్లో విధులకు ప్రతిరోజు వెళ్లేదాణ్ని. నా వల్ల కొవిడ్ సోకి మా ఆయన ప్రాణాలు కోల్పోయారు. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను’’ అని చెప్పారు. కాగా, సురీందర్ జీత్‌కౌర్‌కు మే నెలలో కరోనా సోకగా కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు.
Updated Date - 2020-06-18T07:22:26+05:30 IST