రైతుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ రచ్చబండలు
ABN, First Publish Date - 2020-12-11T19:03:12+05:30
నూతన వ్యవసాయ చట్టాలపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు బీజేపీ భారీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా విలేకర్ల సమావేశాలు, రచ్చబండలను నిర్వహించబోతోంది. ఈ చట్టాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టేందుకు ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ చట్టాలకు సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, ఆ ప్రతిపాదనలను తిరస్కరించడంతోపాటు ఆంధోళన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
నూతన చట్టాల వల్ల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరకు భరోసా ఉండదని, కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి జిల్లాలోనూ రైతులకు ఈ చట్టాలపై అవగాహన కల్పించాలని బీజేపీ నిర్ణయించింది. విలేకర్ల సమావేశాలు, రచ్చబండలను శుక్రవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దాదాపు 700 విలేకర్ల సమావేశాలు, సుమారు 700 రచ్చబండలు నిర్వహించి, ఈ చట్టాలపై రైతుల్లో ఏర్పడిన సందేహాలను నివృత్తి చేయాలని నిర్ణయించింది.
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్; ఫార్మర్స్ ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్‌మెంట్ యాక్ట్‌లను రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో రైతు సంఘాల చర్చలు విఫలమయ్యాయి. రైతుల ఆందోళనను అర్థం చేసుకుని ఈ చట్టాల్లో కొన్ని సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రైతులతో చర్చలు కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రి తోమర్ చెప్పారు.
Updated Date - 2020-12-11T19:03:12+05:30 IST