బెంజ్.. బంద్
ABN, First Publish Date - 2020-05-09T10:11:33+05:30
ప్రపంచంలోనే అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలన్నీ జర్మనీలో ఉన్నాయి. కరోనా దెబ్బతో ఆ కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కరోనా దెబ్బ నుంచి జర్మనీ కోలుకుంటున్నది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కరోనా విజృంభించిన
- ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్షే కంపెనీలు కూడా..
- జర్మనీలో నిలిచిన కార్ల తయారీ.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం
- ‘ఆంధ్రజ్యోతి’తో ప్రముఖ వైద్యుడు గుజ్జుల రవీంద్ర
ప్రపంచంలోనే అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలన్నీ జర్మనీలో ఉన్నాయి. కరోనా దెబ్బతో ఆ కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కరోనా దెబ్బ నుంచి జర్మనీ కోలుకుంటున్నది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కరోనా విజృంభించిన తీరు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, అక్కడి భారతీయుల స్థితిగతులపై జర్మనీలో ఉంటున్న ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ప్రముఖ కార్డియాలజీ, ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్ గుజ్జుల రవీంద్ర ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
కార్ల కంపెనీల మూతతో కుదేలైన ఆర్థిక రంగం
ప్రపంచంలోనే పేరొందిన మెర్సిడెస్ 8 బెంజ్, ఫోక్స్‌వ్యాగన్, పోర్షే, ఆడి కార్లు జర్మనీలోనే తయారవుతున్నాయి. కరోనా కారణంగా మార్చి 15 నుంచి కార్ల కంపెనీలు మూతపడ్డాయి. ఇది జర్మనీ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. జూన్ మొదటి వారం నుంచి కార్ల కంపెనీల్లో కార్యకలాపాలు దశల వారీగా ప్రారంభం కానున్నాయి.
కరోనా రోగులకు మెరుగైన చికిత్స
జర్మనీలో ఇప్పటి వరకు 1.65 లక్షల మందికి కరోనా వ్యాధి సోకింది. 1.35 లక్షల మంది కోలుకున్నారు. దాదాపు 2 వేల మంది చనిపోయారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మందికి ఈ వ్యాధి సోకుతున్నది. రోగులకు మెరుగైన చికిత్స అందుతోంది. మార్చి రెండవ వారం నుంచి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కరోనా తగ్గు ముఖం పట్టడంతో స్తంభించిన కార్యాకలాపాలన్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. విద్యాలయాల్లో ఇంటర్, పది తరగతులు ప్రారంభమయ్యాయి.
భారతీయులు, తెలుగు విద్యార్థులు క్షేమం
జర్మనీలో ఉన్న భారతీయుల్లో కొందరికి కరోనా సోకినప్పటికీ ప్రాణనష్టం జరగలేదు. ఇక్కడున్న భారతీయ సంఘాలు ప్రవాస భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నాయి. జర్మనీలో విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు అందరూ క్షేమంగానే ఉన్నారు.
సంస్థలు, కంపెనీలకు ఆర్థిక సాయం
కరోనా వల్ల చిన్న కంపెనీలు మూతపడగా.. ఒక్కో కంపెనీకి 9వేల యూరోల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. పెద్ద సంస్థలన్నిటికీ కలిపి 10 బిలియన్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. ఉపాధి కోల్పోయిన వారికి పనిని బట్టి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.
ప్రభుత్వ చర్యలకు 80ు ప్రజల మద్దతు
దేశంలోని కరోనా పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ తదితర విషయాలపై ప్రతీ సోమవారం ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తుంది. సగటున 80ు మంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ మద్దతును ప్రకటించారు. జర్మనీలోని అర్హత కలిగిన నా లాంటి వైద్యులందరూ కరోనా రోగులకు చికిత్స అందించడంలో ముందు వరుసలో ఉన్నారు. కరోనా నివారణకు దేశంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం అనంతరం దేశం తిరిగి ఆర్థికంగా పూర్వ స్థితికి చేరుకుంటుందని, యూరోపియన్ దేశాలన్నిటిలో కరోనా నిర్మూలనలో జర్మనీ ముందడుగులో ఉంటుందని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది.
25 ఏళ్ల పాటు మేయర్‌గా పనిచేసిన రవీంద్ర
ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన రవీంద్ర 1974లో వైద్య విద్య కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రాజకీయ కుటుంబానికి చెందిన రవీంద్ర.. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్ట్ లాండ్స్ బర్గ్ నగరానికి 1993 నుంచి 25 సంవత్సరాల పాటు మేయర్‌గా పనిచేశారు. మేయర్ కార్యాలయంలోనే క్లినిక్‌ను ఏర్పాటు చేసుకొని వైద్య వృత్తిని కొనసాగించారు.
(న్యూయార్క్ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ)
Updated Date - 2020-05-09T10:11:33+05:30 IST