లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ రోడ్లపైకి అమెరికన్లు
ABN, First Publish Date - 2020-04-21T09:04:16+05:30
కరోనా తమను కబళించివేస్తున్నప్పటికీ అమెరికన్లు లాక్‌డౌన్ వద్దంటున్నారు. నిబంధనలు సడలించాలని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు.
ట్రంప్ వత్తాసు.. తప్పుపడుతున్న గవర్నర్లు
వాషింగ్టన్, ఏప్రిల్ 20: కరోనా తమను కబళించివేస్తున్నప్పటికీ అమెరికన్లు లాక్‌డౌన్ వద్దంటున్నారు. నిబంధనలు సడలించాలని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా మృత్యుపాశాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వాషింగ్టన్, అరిజోనా, కొలరాడో, మోంటానా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నినదించారు. వాషింగ్టన్‌లో 2,500 మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
మోంటానా రాష్ట్రంలో వందల మంది నిరసనలు తెలిపారు. ఆందోళనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వత్తాసు పలుకుతున్నారు. మిచిగన్, వర్జీనియా, మిన్నెసొటాల్లో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు మండిపడుతున్నారు. కరోనా టెస్టులు, చికిత్స, కాంటాక్టులను గుర్తించడంలో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నారని డెమోక్రాటిక్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. అమెరికాలో కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఓరెగావ్, న్యూయార్క్ గవర్నర్లు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
Updated Date - 2020-04-21T09:04:16+05:30 IST