ఏ నిమిషానికి ఏమి జరుగునో.. అన్నా డీఎంకేలో అయోమయం..
ABN, First Publish Date - 2020-10-04T17:50:28+05:30
సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పేరును ప్రకటిస్తారా? లేక పన్నీర్‌సెల్వం పేరును ప్రకటిస్తారా? ఎడప్పాడిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పన్నీర్‌సెల్వం మళ్లీ మౌనయుద్ధానికి
చెన్నై: సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పేరును ప్రకటిస్తారా? లేక పన్నీర్‌సెల్వం పేరును ప్రకటిస్తారా? ఎడప్పాడిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పన్నీర్‌సెల్వం మళ్లీ మౌనయుద్ధానికి దిగుతారా? లేక పన్నీర్‌సెల్వంను బుజ్జగించేలా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెడతారా? వీరిద్దరు ఇలా సీఎం పదవికోసం పోట్లాడుతుంటే జైలు నుంచి విడుదలయ్యే శశికళ పార్టీని హస్తగతం చేసుకుంటారా? 7వ తేదీ సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన విడుదలవుతుందని అధిష్ఠానం చెప్పినా ఇద్దరు మంత్రులు కాబోయే సీఎం ఎడప్పాడి పళనిస్వామేనంటూ ప్రకటించి పార్టీలో అయోమయం సృష్టించడం న్యాయమేనా? ఈ ప్రశ్నలన్నీ ఎంజీఆర్ కాలం నుండి ఇప్పటిదాకా పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉంటున్న కోటాను కోట్లమంది అన్నాడీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎంజీఆర్, జయలలిత హాయంలో మిలటరీ అధికారుల సమావేశంలా జరిగే కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఇంత రసాభాసగా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు. తన జీవితాన్నే పణంగా పెట్టి అమ్మ (జయ) కాపాడిన పార్టీ పరువును ఇలా దిగజార్చటం న్యాయమేనా అని కార్యకర్తలంతా ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు పార్టీని కాపాడేందుకు శశికళ రావాలంటూ పిలుపునిస్తున్నారు. మరో వైపు ఎడప్పాడికి వంతపాడుతూ ఇద్దరు మంత్రులు పార్టీలో అయోమయం సృష్టిస్తున్నారు. ఈ విషమ పరిస్థితులలో ఎంజీఆర్, జయలలిత కష్టపడి పెంచి పోషించిన అన్నాడీఎంకే గతి ఏమవుతోందనని కార్యకర్తలంతా ఆందోళన చెందుతున్నారు.
కొంగు మండలం...
సీఎం అభ్యర్థిగా తననే కొనసాగించాలని పట్టుబడుతున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ‘కొంగుమండలం’ అని పిలిచే కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూరు, కరూరు, సేలం, దిండుగల్, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలలోనే గట్టి మద్దతు ఉందని ఆ మండలానికి చెందిన ఇద్దరు మంత్రులు పదే పదే ప్రకటించడం విడ్డూరంగా ఉందని పార్టీ సీనియర్ కార్యకర్తలు చెబుతున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హయాం నుంచి ఈ కొంగుమండలం పార్టీకి కంచుకోటగా ఉందంటున్నారు. ఎంజీఆర్ తర్వాత పగ్గాలు చేపట్టిన జయలలిత ఈ కొంగు మండలంలో పార్టీని బలోపేతం చేశారని, ప్రస్తుతం ఈ మండలంలోని ప్రజలు ఎడప్పాడికి మద్దతు ఇస్తున్నారంటూ చెప్పడం వింతగా ఉందన్నారు. ఈ కొంగుమండలం ప్రజలు ఇప్పటికీ ఎంజీఆర్, జయలలితను ఆరాధ్యదేవతలుగా భావించే ఓట్లు వేస్తున్నారనే విషయం జగమెరిగిన సత్యమని తెలిపారు. అన్నాడీఎంకే తరఫున సీఎంగా ఎవరున్నా వారికి అండగా నిలిచేది కొంగుమండల ప్రజలేనని చెప్పారు. ఇక ఈ కొంగుమండలానికి చెందిన ముగ్గురు మంత్రులు ఎడప్పాడికి వంతపాడటంలో వింతేమీ లేదన్నారు.
దక్షిణాది జిల్లాల్లో...
కొంగుమండలం సరే దక్షిణాది జిల్లాల మాటేమిటి? ఈ జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సొంత జిల్లా తేని తప్ప తక్కిన జిల్లాల్లో పార్టీపరంగా ప్రభుత్వపరంగా అభివృద్ధి పనులేవీ జరుగలేదు. ఆ జిల్లాల్లో అన్నాడీఎంకేకు ఎదురుగాలులే వీస్తున్నాయి. మదురైలో ఎయిమ్స్ ఆస్పత్రి అంటూ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. నిర్మాణ పనులేవీ జరుగలేదు. ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో తమను ఆర్థికపరంగా ఆదుకోలేదని ఆ జిల్లాల ప్రజలంతా ఎడప్పాడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ సీనియర్ కార్యకర్తలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ అన్నాడీఎంకే పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓపీఎస్‌కు పార్టీలోనే మద్దతు...
అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంకు పార్టీలో గట్టి మద్దతు లభిస్తున్న మాట వాస్తవమేనని, అయితే తమ అందరికంటే సీనియర్ నేత అనే గౌరవభావంతో చూస్తున్నారే తప్ప క్లిష్ట సమయంలో అండగా నిలిచే నేతలెవరూ లేరని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఎడప్పాడికి ప్రజల మద్దతు, పార్టీ నాయకుల మద్దతు ఉన్నాయని చెప్పారు. పన్నీర్‌సెల్వం ప్లస్ పాయింట్ ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల ఆశీస్సులేనని అన్నారు. బీజేపీ అండగా ఉండటం వల్లే పన్నీర్‌సెల్వం తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారని చెప్పారు. ఇవన్నీ సరే ఐదు నెలలకు పైగా లాక్‌డౌన్ కారణంగా అజ్ఞాతవాసంలో గడిపిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ ఉన్నట్టుండి తెరమీదికి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీ పెద్దల పిలుపునందుకుని దినకరన్ ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీనడ్డాతో ఫోన్‌లో చర్చలు జరుపడం వెనుక అసలు కారణం అన్నాడీఎంకేలో శశికళ మునుపటిలా చక్రం తిప్పేందుకేనని స్పష్టమవుతోందని చెబుతున్నారు.
శశికళ ప్రస్తావన అవసరమా?
అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం సమయంలో రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద వేల సంఖ్యలో కార్యకర్తలు గుమికూడారు. ఆ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఒ.పన్నీర్‌సెల్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని, పార్టీ గెలుపునకు వ్యూహరచనలు రూపొందిస్తారని నాలుగు గంటలపాటు ఆశగా ఎదురుచూశారు. ఆ సమావేశంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం పార్టీ నుంచి గెంటివేయబడిన శశికళ పేరును అనవసరంగా ప్రస్తావించి అయోమయానికి గురిచేసి, సమావేశాన్ని రసాభాసగా మార్చడం గమనించిన కార్యకర్తలంతా తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. తనను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టింది శశికళేనని, అయితే అ సమయంలోనే శాసనసభ్యులందరి మద్దతు తనకు లభించిదంటూ ఎడప్పాడి... పన్నీర్‌సెల్వం వైపు చూస్తూ రెచ్చగొట్టారని తెలిపారు. పన్నీర్‌సెల్వం కూడా తానేమీ తీసిపోనట్లుగా ‘మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో శశికళ కూర్చోబెట్టి ఉండొచ్చు గాక, నన్ను మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆశీనులు గావించింది
అమ్మే (జయలలితే)’నని ప్రతివిమర్శ చేయడాన్ని కూడా పార్టీ కార్యకర్తలంతా సహించలేకపోయారు. వీరిరువురూ శశికళ పేరును ప్రస్తావించడం వల్లే పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం గందరగోళంగా మారిందంటున్నారు.
దినకరన్ ఢిల్లీ పర్యటన ప్రభావం...
అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడం, ఆ వెనుకే ముఖ్యమంత్రి ఎడప్పాడి ఇద్దరు మంత్రులను ఢిల్లీకి పంపడం వెనుక ఏదో బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్నాడీఎంకేలో అమ్మామక్కల్ మున్నేట్ర కళగాన్ని విలీనం చేయడానికి బీజేపీ పెద్దలు దినకరన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియడం వల్లే ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలను కలుసుకున్నారని వినికిడి. జైలు నుంచి శశికళ విడుదలైతే అన్నాడీఎంకే పార్టీలో భారీ మార్పులు జరుగుతాయని, పార్టీని ఆమె కైవశం చేసుకుంటారని చెబుతూ పార్టీ నేతలు అనవసరంగా భయపడుతుండడం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య, పార్టీ నేతల మధ్య, మంత్రుల మధ్య ఐకమత్యం కొరవడినట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయంటున్నారు. అందరిదీ తలోదారిగా వుంటే పార్టీ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడుతున్నామంటున్నారు. సీఎం అభ్యర్థిపై నాలుగు రోజుల తర్వాత వెలువడనున్న అధికారిక ప్రకటన పార్టీలో కలహాలు, కలతలు పుట్టిస్తుందో లేక అందరినీ సమైక్యపరుస్తుందో తెలియక నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీ సీనియర్ సభ్వత్వం కలిగిన పార్టీ శ్రేణులంతా ఆందోళనలో ఉన్నారని చెప్పటం అతిశయోక్తికాదు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 7 వ తేదీ తర్వాత సీఎం అభ్యర్థి పేరును ప్రకటించిన తర్వాత అన్నాడీఎంకేలో పెనుమార్పులు చోటుచేసుకోవడం ఖాయమనే పార్టీ శ్రేణుల అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి.
Updated Date - 2020-10-04T17:50:28+05:30 IST