వృద్ధుడికి కరోనా ఉందంటూ రిపోర్టు.. తర్వాత ఎన్నిసార్లు పరీక్షలు చేసినా..!
ABN, First Publish Date - 2020-06-18T20:47:08+05:30
72 ఏళ్ల ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ ఉందంటూ ప్రకటించిన అధికారులు... ఆ తర్వాత యాంత్రిక..
షిల్లాంగ్: 72 ఏళ్ల ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ ఉందంటూ ప్రకటించిన అధికారులు... ఆ తర్వాత యాంత్రిక తప్పిదం అంటూ నాలిక్కరుచుకున్న వైనమిది. మేఘాలయలోని రి-భోయ్ జిల్లా ఉమ్సాంలేమ్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 9న సదరు వ్యక్తి నుంచి నమూనాలను ఆర్‌టీ-పీసీఆర్ ద్వారా పరీక్షించిన అధికారులు కరోనా పాజిటివ్ అని చెప్పారు. పేషెంట్‌కు శ్వాసకోశ సమస్యలు ఉండడంతో ప్రయివేట్ ఆస్పత్రిలో చేరినట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే సదరు పేషెంట్‌తో సన్నిహితంగా మెలిగిన వారెవరికీ కరోనా పాజిటివ్ లేదని తేలడంతో... మళ్లీ అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ‘‘ఈసారి అతడికి ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు వెంటవెంటనే నిర్వహించాం. దీంతో అతడికి కరోనా నెగిటివ్ అని తేలింది..’’ అని రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ అమ్నాన్ వార్ వెల్లడించారు.
తర్వాత ఆయనకు ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా.. ప్రతిసారీ ఫలితం నెగిటివ్ అనే వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు, రెస్పాన్స్ టీమ్ మంగళవారం రాత్రి సమావేశమై.. అతడికి తొలిసారి జరిపిన కరోనా పరీక్షల్లో ఫలితాలు ‘‘తప్పుగా’’ వచ్చినట్టు తేల్చారు. ‘‘ఆర్టీ-పీసీఆర్ ఫలితాలు 99 శాతం కచ్చింగా వస్తాయి. అయితే ఈ పేషెంట్ విషయంలో మానవ తప్పిదం చోటుచేసుకుంది...’’ అని అమ్నాన్ తెలిపారు. కాగా మరికొన్ని అనారోగ్య సమస్య కారణంగా ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలోనే వైద్యం అందిస్తున్నారు.
Updated Date - 2020-06-18T20:47:08+05:30 IST