ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై స్టే
ABN, First Publish Date - 2020-11-03T15:12:35+05:30
జూనియర్‌కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియను హైకోర్టు నిలుపుదల చేసింది
10వ తేదీ వరకు నిలిపేసిన హైకోర్టు
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోత): జూనియర్‌కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రవేశాలపై స్టే విధించింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేక కమిషనర్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఏపీ పాఠశాల విద్యాశాఖ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్‌లను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్ణయాన్ని అడ్డుకోవాలని, గత విధానంలోనే అడ్మిషన్లు జరుపుకొనేందుకు అవకాశం కల్పించాలని సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య, మల్లు జ్ఞానేశ్వర్‌రెడ్డి బృందం, సాయి గీతాంజలి జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ వి.దుర్గాశ్రీనివాసప్రసాద్ తదితరులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయమూర్తి ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, న్యాయవాది దేవవరపు రాంబాబు తదితరులు వాదనలు వినిపిస్తూ...ప్రైవేటు జూనియర్ కాలేజీలు, అన్‌ఎయిడెడ్ కాలేజీల్లో ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ ప్రభుత్వం జారీ చేయలేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఆయన గడువు కోరారు.
Updated Date - 2020-11-03T15:12:35+05:30 IST