నిరక్షరాస్యులు @ 80 లక్షలు!
ABN, First Publish Date - 2020-01-12T15:05:34+05:30
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులు..
- ఇప్పటికే 3,391 పంచాయతీల్లో 20 లక్షల మంది గుర్తింపు
- నేటితో ముగియనున్న పల్లెప్రగతి
హైదరాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులు 80 లక్షల మంది దాకా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 2 నుంచి జరుగుతున్న పల్లెప్రగతి ఆదివారంతో ముగియనుంది. 12,751 గ్రామ పంచాయతీల్లో 2,04,71,664 జనాభా ఉండగా.. అందులో 3,391 గ్రామ పంచాయతీల్లో 20,61,746 మంది నిరక్షరాస్యులున్నట్లు లెక్కలు తీశారు. అయితే మిగతా గ్రామ పంచాయతీల డేటా ఎంట్రీ కూడా పూర్తయితే ఈ సంఖ్య 80 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి వీలుగా.. తొలుత నిరక్షరాస్యులను గుర్తించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. వారిని గుర్తించిన తరువాత.. ‘ఈచ్ వన్ టీచ్ వన్’ను పకడ్బందీగా అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా అక్షరాస్యత సూచీలో తెలంగాణ వెనుకబడటానికి వయోజనుల నిరక్షరాస్యత ప్రధాన కారణమని గుర్తించారు. నిరక్షరాస్యతను తగ్గించేందుకు ఏ ప్రణాళికలు రూపొందించాలనే అంశంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా అధికారులతో సమీక్షిస్తున్నారు. పల్లెప్రగతితో అధికారులంతా గ్రామాలకు వెళ్లడంతో పాటు ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టడంతో గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా పనిచేయని బోర్‌వెల్స్ 11,495 గుర్తించగా.. వాటిలో 8,803 బోర్‌వెల్స్‌ను మట్టితో మూసివేశారు. అలాగే 1,16,454 నీళ్లు నిలిచే గుంతలను గుర్తించగా.. 1,04,303 గుంతలను పూడ్చేశారు. 64,120 ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, అంగన్‌వాడీలను ఈ ప్రక్రియలో శుభ్రం చేశారు.
Updated Date - 2020-01-12T15:05:34+05:30 IST