ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్యయనశీలి, కళాప్రేమికుడు కె. సదాశివరావు

ABN, First Publish Date - 2020-12-15T09:39:48+05:30

‘Life levels all; death reveals the great’. ఒక వ్యక్తి మరణించాక అతని ప్రత్యేకత, విశిష్టత, నిర్దిష్ట రంగంలో అతని ముద్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నివాళి : కె. సదాశివరావు

సుమారు అయిదేళ్ళ కిందట ‘పాలపిట్ట’ మాస పత్రికలో ‘పాలపుంత’ పై నేను రాసిన సమీక్షా వ్యాసం చదివాక సదాశివరావు నన్ను అభిమానించడం మొదలెట్టారు. విశ్వ సాహిత్య అధ్యయనాసక్తి, ప్రపంచ క్లాసిక్స్ పట్ల ఒక అవగాహన ఉన్నవారిని తన సన్నిహితులుగా చేరదీస్తారని నేను గ్రహించాను. తరచూ ఫోన్ చేసి ‘ఏమోయ్.. ఏమిటి ఇవ్వాళ నీ ప్రోగ్రాం... ఐ మాక్స్‌లో సినిమా చూద్దాం.. కలుస్తావా..’ అని అడుగుతూ చాలా విషయాలపై సుదీర్ఘంగా సంభాషించేవారు. వర్తమాన తెలుగు సాహిత్యంపై, కవులూ రచయితలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘ఏమీ చదవరు.. ఏదేదో రాసేస్తారు', అనేవాడు. ‘చదివే వాళ్ళేమో రాయరు, నువ్వెందుకు ఒక నవల రాయడానికి పూనుకోవు?’ అని నన్ను మందలించిన సందర్భాలెన్నో.


‘Life levels all; death reveals the great’. ఒక వ్యక్తి మరణించాక అతని ప్రత్యేకత, విశిష్టత, నిర్దిష్ట రంగంలో అతని ముద్ర... మన స్మృతిపథంలో అనివార్యంగా కదలాడతాయి. తెలుగు సాహిత్యంలో ‘సైన్స్ ఫిక్షన్’ ప్రాచుర్యం పొందడానికి కె. సదాశివరావు ముఖ్య కారకుడని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సమకాలీన తెలుగు సాహితీలోకంలో ప్రచలితంగా వున్న వివిధ భావజాలాలు, అస్తిత్వ ఉద్యమాలు, వాటికి సంబంధించిన వాద వివాదాలు, రాజకీయ–తాత్విక చర్చలేవీ పట్టించుకోకుండా, తన ధోరణిలో తాను వర్తమాన ప్రపంచ సాహిత్యాన్ని, నచ్చిన పుస్తకాల్ని, జాతీయ అంతర్జాతీయ పత్రికల్ని చదువుతూ, ఇష్టవ్యాపకాలైన మూవీగోయింగ్, పెయింటింగ్, మ్యూజిక్ లో సేదదీరుతూ, స్నేహితులతో తరచూ జరిపే ఆత్మీయ టెలిఫోనిక్ సంభాషణల ద్వారా అనేక విషయాలపై తన ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలు పంచుకుంటూ, వీలయినప్పుడల్లా వాళ్ళను కలుసుకుంటూ... అనునిత్యం బయటి ప్రపంచంతో సంపర్కం పెట్టుకుంటూండేవారు కె.సదాశివరావు. ఆయన ప్రచారార్భాటాలంటే గిట్టని మంచి కథా రచయిత, కవి, అనువాదకుడు అని నిర్దిష్ట అభిరుచి గల సాహితీ మిత్రులకు తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసర్‍లో అంతటి గాఢమైన అధ్యయన శీలత, విశ్వ సాహిత్యంపై లోతైన అవగాహన, కళా ప్రేమిక దృష్టి మరెవరిలో చూసి వుండము. ఈయన విలక్షణమైన వ్యక్తిత్వం, కొన్ని సమకాలీన అంశాల పట్ల ప్రకటించిన దృక్పథం, attitude కొందరికి నచ్చక పోయి వుండవచ్చు. ఏ విషయం పైనైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీదే కించిత్ కరుకుగా చెప్పే ఈయన అలవాటు చాలామందికి మింగుడు పడేది కాదని నేనూ గమనించాను. సాహిత్యం దేశ కాల ప్రాంతీయ మాండలిక ఎల్లలు దాటి సార్వకాలిక, సార్వజనిక విలువలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి వుండాలన్నది తన నిశ్చితాభిప్రాయంగా వుండేది.


తెలుగు రచయితలలో సదాశివరావు సాంప్రదాయిక కథ, బ్రిటిష్ కలోనియల్ కథ, సైన్స్ ఫిక్షన్ కథ –ఈ మూడు రకాల కథలలో సిద్ధహస్తుడు. ‘క్రాస్ రోడ్స్’ కొత్త సంపుటిలోని పొగమంచు, చలిమంటలు, అశ్వమేధం, తుషార బిందువు, యులిసెస్ వచ్చిన రోజు... తదితర పదకొండు కథలు; లాస్ట్ పెరేడ్, యాత్ర, నేకేడ్ ఫకీర్, డిల్లీ దర్బార్.. వంటి 8 ఆంగ్ల రాజ్య కథలు; సైన్స్ ఫిక్షన్ కోవకు చెందిన ఆత్మా ఫాక్టర్, మానవ ఫాక్టర్, ఏలియన్ రిపోర్ట్, మిస్డ్ యూనివర్స్... తదితర కథలు ఆయన అనితర సాధ్యమైన రచనా నైపుణ్యానికి అద్దం పడతాయి. అందరిలాగా, కథ రాయడానికి క్షుద్బాధితుల గోస, బాహిర్ జీవితపు సంఘర్షణ, కన్నీరు పెట్టించే అతి విషాద ఘటన ఇతనికవసరం లేదు. ఒక పుస్తకం చదూతున్నప్పుడు మస్తిష్కంలో మెరిసే ఆలోచన, లేదా జ్ఞాపకాల దొంతరలోంచి తేలి వచ్చే ఊహ, లేదా దైనందిన జీవితంలో తారసిల్లే ఒక కలయిక రేకెత్తించే భావోద్వేగం, లేదా మామూలు ఘటన కలిగించే విచిత్ర అనుభూతి, అలాంటివి కొండోకచో మనసు పై వేసే ప్రగాఢ ముద్ర... వీటి చుట్టూ అల్లినవే సదాశివరావు కథల ఇతివృత్తాలు. ‘చలి మంటలు’ కథలో, దుర్భర దారిద్ర్యంలో ఓలలాడుతూ కూడా ఎవరి సాయం యాచించకుండా, కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడకుండా, నిరంతరం పర్ఫెక్షనిజం కోసం తపించే నిరు పేదకవి పరంజ్యోతి వృత్తాంతం పాఠకుని గుండె ద్రవింపజేస్తుంది. ‘పొగమంచు’ కథ ఒక యాదృచ్చిక ఘటన కథకుని రొటీన్ జీవితానికి థ్రిల్ ఇచ్చి ఒక రోజును మరుపురానిదిగా మలచిన వైనాన్ని ఆహ్లాదకరంగా చిత్రించింది. ‘నేకెడ్ ఫకీర్’ కథ, మహాత్మాగాంధీ పట్ల ఆంగ్లేయ అధికార వర్గాల్లోని సమాంతర దృక్పథాన్ని, ఆరాధనా భావాన్ని తెలియజేసి మనల్ని అబ్బుర పరుస్తుంది. టైం ట్రావెలింగ్‍ని చిత్రించిన ‘ఆద్యంతాల నడుమ’, ‘ఏలియన్ రిపోర్ట్’ కథలు, సుదూర భూత, భవిష్యత్ కాలాలను, గ్రహాంతర యానాలను చిత్రించిన ‘ఆత్మా ఫాక్టర్’, ‘మానవ ఫాక్టర్’ కథలు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల పురోగమనం మూలంగా సాధ్యమయ్యే గ్రహాంతర మానవ స్థావరాలు, నూత్న మానవ జీవన శైలిని దృశ్యమానం చేసి మనల్ని విభ్రమ పరుస్తాయి. మనకంతగా తెలియని, చరిత్ర పుస్తకాల్లో కనపడని కలోనియల్ పాలన నాటి సమాజ స్థితిగతులు, భిన్న వర్గాలకు చెందిన మనుషుల అలవాట్లు, ప్రవర్తన గురించి ఇతని ఆంగ్ల రాజ్య కథలు చెబుతాయి. కొన్ని ప్రపంచ ప్రసిద్ధ కవితల్ని, ప్రయోగశీల కథల్ని తెలుగు చేసి తన అనువాద పటిమను చాటుకున్నాడు. కవిగా ఇతని ప్రజ్ఞను ‘కావ్యకళ’ లోని కవితలు, ఇతని నిరంతర అధ్యయనాసక్తిని, సాహితీ పరిశీలన అనురక్తిని, లోతైన విశ్లేషణా శక్తిని ‘పాలపుంత’లోని సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీతల పరిచయ వ్యాసాలు నిరూపిస్తాయి. 


సదాశివరావు రాసిన ‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’, అనువదించిన ‘రాజన్స్ యూనివర్సల్ రోబోట్స్’ ఇటీవలే ఎమెస్కో వారి ద్వారా ప్రచురితమైనాయి. ఈ పుస్తకాలు తెలుగు పాఠకులలో సైన్స్ ఫిక్షన్ పట్ల అవగాహన పెంచి ఆసక్తిని రేకెత్తిస్తాయని చెప్పవచ్చు. నిరంతర అధ్యయనశీలి ఐన సదాశివరావు అనేక పుస్తకాలు చదివి, పలు ఆకరాలు పరిశోధించి, ‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’ అనే బృహద్గ్రంథం రాశారు. ఒక్కొక్కటి సుమారు 300 పేజీలున్న 4 వాల్యూముల ఈ పుస్తకంలో మేరీ షెల్లీ, జూల్స్ వెర్న్, హెచ్.జి.వెల్స్, అలన్ పో... మొదలుకుని మార్గరెట్ అట్వుడ్, సి.ఎస్.లూయిస్, జో హాల్డ్‌మన్.. వరకు 80మంది రచయితలను - వారి జీవన విశేషాలు, వారి రచనలు, వాటి ఇతివృత్తాలు సహా క్లుప్తంగానైనా చక్కగా పరిచయం చేయడం జరిగింది. 


సుమారు అయిదేళ్ళ కిందట ‘పాలపిట్ట’ మాస పత్రికలో ‘పాలపుంత’ పై నేను రాసిన సమీక్షా వ్యాసం చదివాక సదాశివరావు నన్ను అభిమానించడం మొదలెట్టారు. విశ్వ సాహిత్య అధ్యయనాసక్తి, ప్రపంచ క్లాసిక్స్ పట్ల ఒక అవగాహన ఉన్నవారిని తన సన్నిహితులుగా చేరదీస్తారని నేను గ్రహించాను. తరచూ ఫోన్ చేసి ‘ఏమోయ్.. ఏమిటి ఇవ్వాళ నీ ప్రోగ్రాం... ఐ మాక్స్‌లో సినిమా చూద్దాం.. కలుస్తావా..’ అని అడుగుతూ చాలా విషయాలపై సుదీర్ఘంగా సంభాషించేవారు. తనకు నచ్చిన వార్తా క్లిప్ప్పింగ్స్, అంతర్జాతీయ మాగజైన్ల పేజీలు, వీడియోలు, క్లాసిక్ మూవీస్, ఫోటోలు, ప్రముఖ రచయితలతో ఉత్తరప్రత్యుత్తరాలు నాకు మెయిల్ చేసేవాడు. ఆయన చేతిలో ఎల్లప్పుడూ ఎదో ఒక పుస్తకం. జార్జ్ లూయి బోర్హెస్‌ను తరచూ ప్రస్తావించే వాడు. వర్తమాన తెలుగు సాహిత్యంపై, కవులూ రచయితలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘ఏమీ చదవరు.. ఏదేదో రాసేస్తారు’, అనేవాడు. ‘చదివే వాళ్ళేమో రాయరు, నువ్వెందుకు ఒక నవల రాయడానికి పూనుకోవు?’ అని నన్ను మందలించిన సందర్భాలెన్నో. నేను గత రెండేళ్ళ నుంచి వెలయించాలనుకుంటున్న సుమారు 50 సాహిత్య వ్యాసాల సంపుటి డిటిపి కాపీని ఎన్నడో ఆయనకిచ్చి అభిప్రాయం రాసివ్వమన్నాను. ‘ఇవి పుస్తకంగా రావాల్సిందే. నేను ఆర్థికంగా సాయపడతాను. బయట సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పుస్తక ముఖ చిత్రం, ప్రింటింగ్ పని మొదలెడదాం’ అన్నారు. హామీని నిలబెట్టుకునే అవకాశం మృత్యువు ఆయన కివ్వలేదు. 


ఎన్నోసార్లు ఫోన్ చేయగా గత సెప్టెంబర్ మొదటివారంలో ఆయన ఇంటికి వెళ్లాను. స్టూడియో రూమ్‍లో దుమ్ము, ధూళి పేరుకు పోయిఉన్న గుట్టల కొద్దీ పుస్తకాలు. నాకు తరచూ చేసే ఫోన్ కాల్స్, సుదీర్ఘ సంభాషణలు ఒక్కొక్క సారి నాకు ఆశ్చర్యం కలిగించి ఆయన ఏదో ‘క్రైసిస్’లో వున్నట్టు అనుమానం వచ్చేది. బహుశ అది వయసు మీరినతనం (తన వయసు 74 యేళ్ళని ఇటీవలే చెప్పారు నాకు- అయినా ఆరోగ్యంగా, హుషారుగా కనపడేవారు) వల్ల కావచ్చు, లేదా ‘ఒక సీనియర్ రచయితగా తను తెలుగు సాహితీ లోకంలో విస్మరణకు గురవుతున్నాన’న్న ఫీలింగ్ కావచ్చు. 'సైన్స్ ఫిక్షన్ రచయితలు’ వాల్యూమ్స్ ఆసాంతం చదివే వ్యవధి నాకింకా చిక్కలేదు. ‘...రోబోట్స్’ చదివి కొన్ని అనువాద లోపాలు, అచ్చుతప్పులు ఎత్తి చూపుతూ చిన్న వ్యాఖ్యానం పంపించాను. అందుకు ఆయన అలిగి ఫోనులో విరుచుకుపడ్డారు. సమీక్ష, విమర్శ నాకు చేత కాదనీ, నాతో స్నేహం బంద్ చేస్తానని కోపంగా అన్నారు. ఒక నెల రోజులు గ్యాప్ తర్వాత అక్టోబర్ మొదటివారంలో ఫోన్ చేసి ‘ఆంధ్రజ్యోతి- వివిధ’లో ప్రచురితమైన కథా ప్రక్రియపై నేను రాసిన వ్యాసం బాగుందంటూ మెచ్చుకుని త్వరలోనే కలుద్దామన్నారు. కానీ మేము కలుసుకోలేదు. ‘జీవా ఫాక్టర్’ అనే కథ, మరో నాలుగు కొత్త తరహా కథలు రాయాలని ప్రణాళిక పెట్టుకున్నపెద్దమనిషి అకస్మాత్తుగా జీవితం చాలించాడు. దాదాపు ప్రతి దినం పెద్దరికం ఉట్టిపడే హుకుం లాంటి ఆత్మీయ పలకరింపు, చదువుతూ, రాస్తూ నిత్యం క్రియాశీలంగా ఉండాలన్న తను నమ్మిన నియమాన్ని నాకు ప్రభోదించిన గొంతుక ఇక వినపడదు; సరళ స్వచ్చమైన, ఆరోగ్యవంతమైన భౌతిక రూపం ఇక కనపడదు. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది.

ఆడెపు లక్ష్మీపతి

9701227207

Updated Date - 2020-12-15T09:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising