ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరాలోచనకు అవకాశం

ABN, First Publish Date - 2020-03-31T09:22:32+05:30

రేపటినుంచి దేశవ్యాప్తంగా జరగాల్సిన జనగణన, జనాభా పట్టిక నవీకరణలు కరోనా కల్లోలంగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ ఒకటినుంచి సెప్టెంబరు ముప్పయ్‌వరకూ ప్రభుత్వం శిక్షణనిచ్చి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటినుంచి దేశవ్యాప్తంగా జరగాల్సిన జనగణన, జనాభా పట్టిక నవీకరణలు కరోనా కల్లోలంగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ ఒకటినుంచి సెప్టెంబరు ముప్పయ్‌వరకూ ప్రభుత్వం శిక్షణనిచ్చి పంపిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి పలు వివరాలు సేకరించే ఈ బృహత్‌ ప్రక్రియ కరోనా రాకతో వాయిదాపడవచ్చునని ఊహించిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఆదివారం ఓ చిన్న రిహార్సల్స్‌తో ఆరంభించి ఏకంగా 21రోజులు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రభుత్వం వెనువెంటనే ఈ ప్రక్రియల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో ఇది అత్యవశ్యకమన్నది అటుంచితే, అనూహ్యంగా అందివచ్చిన ఈ కాలాన్ని ప్రభుత్వం తలుచుకుంటే పునరాలోచన, పునఃస్సమీక్షకు కూడా వినియోగించుకోవచ్చు.


ప్రధాని ప్రకటించిన లాక్‌డౌన్‌ కాలం ఏప్రిల్‌ 15వరకూ ఉన్నది. ఆ తరువాత కూడా ఇది కొనసాగుతుందన్న ప్రచారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని ఖండిస్తున్నది. ప్రస్తుతానికి కొనసాగింపు ఆలోచన ఎంత మాత్రమూ లేదనీ, ఈ ఇరవైయొక్క రోజుల కాలపరిమితి ముగిసే ఒకట్రెండు రోజుల ముందు మాత్రమే, అప్పటి పరిస్థితి ఆధారంగా ఏ నిర్ణయమూ తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నది. మరో పదిహేను రోజుల్లోగానే వాతావరణం కాస్తంత సానుకూలపడి, లాక్‌డౌన్‌ కొనసాగింపు అక్కరలేదనుకున్నప్పటికీ, కరోనా కట్టడికి ప్రభుత్వం తన సమస్త వ్యవస్థలనూ, శక్తియుక్తులను మరింతకాలం వెచ్చించక తప్పదు. కరోనా దెబ్బకు కకావికలమైన సమస్త రంగాలు, ప్రజల దైనందిన జీవితాలు తిరిగి గాడినపడటానికి చాలా కాలమే పడుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సిబ్బందినీ, వనరులనూ వెచ్చిస్తూ, ప్రజలతో విస్తృత సంపర్కం అవసరపడే ఈ లెక్కలను కొంతకాలం నిలిపివేయడం శ్రేయస్కరం. 


జనగణనను ఆదిలో సీఏఏ, ఆ తరువాత ఎన్పీఆర్‌ కమ్మేస్తే, ఇప్పుడు కరోనా కదలనీయకుండా చేసింది. ఎట్టిపరిస్థితిల్లోనూ వీటిని ఆపేదిలేదని కేంద్ర పెద్దలు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న తరుణంలో, ముందుగా ఒడిశాముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నోట ఈ వాయిదా ప్రతిపాదన వెలువడింది. ఎన్పీ్ఆర్‌కు వ్యతిరేకంగా దాదాపు డజను రాష్ట్రాలు ఉద్యమిస్తున్న తరుణంలో నిజానికి కేంద్రపాలకులకు ప్రస్తుత వాతావరణం అవకాశంగా అందివచ్చింది. రాష్ట్రాల సహకారం లేనిదే జనగణన, జనాభాపట్టిక నవీకరణలు అసాధ్యం. కరోనా ఉపద్రవం నుంచి దేశం బయటపడటానికి ఎంతకాలం పడుతుందన్నది అటుంచితే, ఎన్పీఆర్‌లో ప్రభుత్వం అడగబోయే ప్రశ్నల విషయంలో ప్రజల అనుమానాలు అనేకం అలాగే ఉన్నాయి. తల్లిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలు సహా పలు ప్రశ్నలు సంధించి తమకు రాజకీయంగా ఉపకరించే రీతిలో ప్రజలను వడబోసేందుకు పాలకులు సిద్ధపడుతున్నారన్న భయాలున్నాయి. కేంద్రపెద్దలు పలు దశల్లో దిగివచ్చి ఇచ్చిన వివరణలు సైతం వారి గతకాలపు వీరంగాల నేపథ్యంలో వీగిపోతున్నాయి. ఎన్పీఆర్‌కు రాష్ట్రాల సహకారం దక్కనిస్థితిలో ఆన్‌లైన్‌ విధానానికి సైతం కేంద్రం సిద్ధపడుతున్నదన్న వార్తలు కూడా గతంలో వినవచ్చాయి. కేంద్ర రాష్ట్రాలు పరస్పరం సమన్వయంతో సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాల్సిన ఓ కార్యక్రమం చుట్టూ ఇంతటి ఘర్షణ నెలకొనడం సముచితంకాదు. 


ప్రస్తుతం కరోనా ఉపద్రవంతో ఈ ప్రక్రియలను చుట్టుముట్టిన వివాదమంతా వెనక్కుపోయి, వాయిదా ప్రకటనతో ఉపశమించినట్టుగా కనిపిస్తున్నది కానీ, వాటిని యధాతథ రూపంలో ఎప్పుడు అమలు చేయసంకల్పించినా తిరిగి అగ్గి రాజుకోవడం తథ్యం. కరోనా ఉపద్రవం మనకు సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో, సమన్వయంతో సాగాల్సిన అవసరాన్ని తెలియచెబుతున్నది. కేంద్రం ఇప్పటికైనా ఎన్పీఆర్‌, సీఏఏ ఇత్యాది అంశాలపై పునరాలోచన చేసి, మార్పుచేర్పులకు సిద్ధపడాలి. కరోనాపై సంఘటితంగా సాగుతున్న పోరాట స్ఫూర్తిని తదనతరం కూడా సమాజంలో కాపాడుతూ, అన్ని రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలి.

Updated Date - 2020-03-31T09:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising