ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలం తల్లికి పాడు కలలు

ABN, First Publish Date - 2020-10-03T06:00:08+05:30

కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ తొందరపాటుతో వ్యవహరించింది. ఆర్డినెన్‌్సలను హడావుడిగా జారీ చేసింది. ఎవరినీ సంప్రదించకుండానే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ తొందరపాటుతో వ్యవహరించింది. ఆర్డినెన్‌్సలను హడావుడిగా జారీ చేసింది. ఎవరినీ సంప్రదించకుండానే వాటి స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదాన్ని పొందింది. ఆ బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలన్న వివిధ రాజకీయపక్షాల డిమాండ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇది రాజ్యాంగబద్ధమేనా? నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ వివాదాస్పద చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది.


ఒకేపాట ఒకే బాణీలో పాడుతున్నారు- ప్రధానమంత్రి మోదీ, వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ సిఇఓ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధులూ! రైతు లోకానికి నిత్య సంక్రాంతి వచ్చిందన్నదే ఆ పాట పల్లవించిన భావం సుమా! నిజమేనా? వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని మోదీ సర్కార్ చెప్పుకుంటున్న తరుణంలో కొత్త పంటలు మార్కెట్లకు తరలిరావడం ప్రారంభమయింది. అమలులోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, కొత్త పంటల కొనుగోళ్ళలో రైతులకు లబ్ధిని సమకూరుస్తాయా? కనీస మద్దతు ధరకు కొత్త చట్టాలు పూచీ ఇవ్వకపోవడం వల్లే ఆ ప్రశ్న వేయవలసివచ్చింది. కొత్త మార్కెటింగ్ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సహజంగానే తమ పంటలకు మంచి ధరలు లభిస్తాయా లేదా అనే విషయమై ఆదుర్దా పడుతున్నారు. ‘వ్యవసాయక ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీ’ (ఏపీఎమ్‌సీ)లతో రైతుల అదృష్ట దురదృష్టాలు ఇంతవరకు ముడివడివున్నాయని, ఇప్పుడు కొత్త చట్టాలతో ఆ సందిగ్ధ పరిస్థితి తొలగిపోయి మార్కెట్ యార్డులకు వెలుపల ఎక్కడైనా, ఎవరికైనా తమ పంటలను అమ్ముకునే స్వేచ్ఛ వారికి లభించిందన్నది పాలకుల వాదన. మరి దీనిని బలపరిచే భోగట్టా (డేటా)ను ప్రభుత్వం ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆ వాదన నిరాధారమైనది. 


సరే, వ్యవసాయరంగ స్థితిగతుల సమాచారం ఏం చెబుతుందో చూడండి: మన రైతులలో 86శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. వీరి భూకమతాలు రెండు హెక్టార్లకంటే తక్కువే (ఒక హెక్టారు= 2.471 ఎకరాలు); భూ కమతాలు అంతకంతకూ చిన్నవై పోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2010–-11లో 1380 లక్షలుగా ఉన్న భూ కమతాల సంఖ్య 2015–-16లో 1460 లక్షలకు పెరిగింది; చిన్న రైతులకు మిగులు ధాన్యమన్నది పెద్దగా ఉండదు. అయినప్పటికీ కుటుంబ అవసరాల కోసమో లేదా రుణాలు తీర్చడానికో వారు కొద్ది బస్తాల ధాన్యాన్ని తప్పనిసరిగా విక్రయించుకోవల్సి వస్తున్నది; కేవలం ఆరు శాతం మంది రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ఏపీఎమ్‌సీ మార్కెట్ యార్డులలో విక్రయిస్తున్నారు. మిగతా 94 శాతం మంది మార్కెట్ యార్డులకు వెలుపల, చాలావరకు స్థానిక వ్యాపారులు లేదా సహకార సంఘాలకు అమ్ముకుంటున్నారు; కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలోనూ, చండీగఢ్ మినహా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ఏపీఎమ్‌సీలు లేవు. కొద్ది సంవత్సరాల క్రితం బిహార్ తమ ఏపీఎమ్‌సీ చట్టాన్ని రద్దు చేసింది. ఈ రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఏపీఎమ్‌సీల వెలుపలే జరుగుతుంది; ఎపీఎమ్‌సీల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. హర్యానాలో 106 ఉండగా పంజాబ్‌లో 145 ఉన్నాయి. తమిళనాడులో 283 ఉన్నాయి. పంజాబ్, హర్యానాలలో దిగుబడి అవుతున్న వరి, గోధుమ ధాన్యంలో 70 శాతాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే (ముఖ్యంగా భారత ఆహార సంస్థ) కొనుగోలు చేస్తున్నాయి. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడులోని ఏపీఎమ్‌సీల ద్వారా మొత్తం వ్యవసాయక ఉత్పత్తుల వ్యాపారం విలువ రూ.129.76 కోట్లు; మహారాష్ట్రలో రైతులు మార్కెట్ యార్డ్ సేవలను ఉపయోగించుకునేందుకు సగటున 25 కిలోమీటర్లు ప్రయాణించవలసివస్తుంది. 


ఒక రాష్ట్రంలో ఏపీఎమ్‌సీలు ఉన్నా లేకున్నా, అవి రైతులకు సమీపంలో ఉన్నా లేదా సుదూరంలో ఉన్నా 94 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు వెలుపలే అమ్ముకోక తప్పడం లేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లోనే వారు అలా చేస్తున్నారనేది గమనార్హం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర వారికి లభించడం లేదు. మరి రైతులు అందరూ ఏపీఎమ్‌సీ మార్కెట్ యార్డులపైనే ఆధారపడి వున్నారని, కొత్త వ్యవసాయ చట్టాలతో వారికి విముక్తి లభించిందని ప్రధానమంత్రి మొదలు అధికార ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరు చెప్పడం ఎంతవరకు సబబు? ప్రభుత్వ వాదన పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అధికారిక సమాచారమే స్పష్టంగా రుజువు చేస్తున్నందున కొత్త వ్యవసాయ చట్టాలు యథాపూర్వస్థితికే తిరుగులేని రీతిలో ఆసరా అవుతున్నాయని చెప్పక తప్పదు. ఇదొక చేదు వాస్తవం. 


రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడంలో వారికి పలు ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించడాన్ని నేను సమర్థించాను (సెప్టెంబర్ 27, ‘కర్షకులూ కపట శాసనాలూ’). ఏపిఎమ్‌సీలు కొంతమంది రైతులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని రద్దు చేయాలని కూడా నేను భావించాను. వ్యావసాయక ఉత్పత్తుల స్వేచ్ఛా వాణిజ్యాన్ని నిరోధిస్తున్న కారణంగా వాటిని కొనసాగించవలసిన అవసరం లేదు. ఏపీఎమ్‌సీలు ఉత్తమ మార్కెట్లు కావనడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. చిన్న, పెద్ద రైతులు అందరికీ అవి ప్రయోజనకరంగా లేవు. అవి అందిస్తున్నసేవలకు గాను రైతులు భారీ ధరలు చెల్లించుకోవలసివస్తోంది. వ్యాపారులు, దళారుల నియంత్రణలో ఉన్న ఏపీఎమ్‌సీల సంఖ్య తక్కువేమీకాదు.


ఏపీఎమ్‌సీలను అంతిమంగా రద్దు చేసేముందు రైతులకు నిజమైన ప్రత్యామ్నాయాలను కల్పించితీరాలి. పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాలలో ఏర్పాటు చేసే బహుళ ప్రత్యామ్నాయ మార్కెట్ల రైతులకు అటువంటి ఉపయోగకర సదుపాయాలను కల్పించగలవు. సరుకుల రవాణా పరంగా రైతులు ఎటువంటి ప్రయాస పడనవసరం లేకుండా అవి వారికి అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెట్లలో విక్రయించే సరుకుల బరువు, ధరను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారముంటుంది. రైతులు తమ ఉత్పత్తులను ఈ మార్కెట్లకు తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు. ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఎవరు కొనుగోలు చేసినా ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరను విధిగా చెల్లించవలసి ఉంటుంది. తద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులలో వలే కాకుండా బహుళ ప్రత్యామ్నాయ మార్కెట్లలో అత్యధిక రైతులు, మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇంచుమించు ప్రతి రైతూ తమ పంటలకు కనీస మద్దతు ధర లేదా మెరుగైన ధరను తప్పక పొందగలుగుతాడు. 


కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారంటీ కల్పించడం పట్ల కొంతమంది తప్పుడు ప్రమాద హెచ్చరికలు చేస్తున్నారు. చట్ట బద్ధమైన కనీస మద్దతు ధరను అమలుపరిచేందుకు చట్ట ఉల్లం ఘనలను కనుగొనవలసివుంటుందని, ఉల్లంఘనకు పాల్పడినవారిని శిక్షించవలసివుంటుందని, ఇదే జరిగితే వేలాది వ్యాపారులు జైలుకు వెళ్ళడం అనివార్యమవుతుందని ఆ అపశకున పక్షులు వాదిస్తున్నాయి. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. ఎందుకంటే సదరు మార్కెట్ల ఆవరణలలో జరిగే క్రయ విక్రయాలకు మాత్రమే చట్టబద్ధమైన గ్యారంటీలు వర్తిస్తాయి. 


మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల సౌకర్యార్థం ఇటువంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను సృష్టించవు. అందుకు విరుద్ధంగా రైతులతో ప్రైవేట్ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కార్పొరేట్ కంపెనీలతో సహా ప్రైవేట్ వ్యాపారులకు అనుమతినిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో ఒక ప్రత్యేక వివాద పరిష్కార వ్యవస్థ నేర్పాటుచేయాలని అవి ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువ అని స్పష్టమవుతుంది. ప్రభుత్వం ఏమి చెబుతున్నప్పటికీ కొత్త చట్టాలతో రైతులకు మరింత ప్రతికూల పరిస్థితులే నెలకొనే అవకాశం ఉంది. అంతేకాక, ఏపీఎమ్‌సీల వెలుపల ప్రైవేట్ అనియంత్రిత వ్యాపారాన్ని చట్టబద్ధం చేసిన తరువాత వ్యాపారులు తమకుతామే ఆ మార్కెట్ కమిటీల నుంచి వైదొలగకుండా ఉంటారా? 


సాగుచేసే పంటలు, మిగులు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారుల తీరుతెన్నుల పరంగా ప్రతి రాష్ట్రంలోనూ విభిన్న పరిస్థితులు నెలకొనివున్నాయి. ఏ రాష్ట్రం విశిష్టత ఆ రాష్ట్రానిదే. కనుక వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి సంబంధించిన చట్టాలను రాష్ట్రాలే విధిగా తీసుకురావాలి. అలా ఒక పంజాబ్ నమూనా ఉండాలి. అలాగే ఒక బిహార్ నమూనా ఉండి తీరాలి. తమ రాష్ట్రానికి ఏది ఉత్తమమో, ఏది ప్రయోజనకరమో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇదే నిజమైన సమాఖ్య పాలనా విధానం. రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన అంశాలపై పార్లమెంటు చేసే చట్టాలు అన్ని రాష్ట్రాలకు సమంగా వర్తిస్తాయా అన్నది సంశయాస్పదమే. కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం మొదటి నుంచీ తొందరపాటుతో వ్యవహరించింది. ఆర్డినెన్స్‌లను హడావుడిగా జారీ చేసింది. ఎవరినీ సంప్రదించకుండానే వాటి స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదాన్ని పొందింది. ఆ బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలన్న వివిధ పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇది రాజ్యాంగబద్ధమేనా? కొత్త వ్యవసాయ చట్టాల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ వివాదాస్పద చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-10-03T06:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising