ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపాదక సర్వోత్తముడు

ABN, First Publish Date - 2020-02-29T06:24:51+05:30

ఎడిటర్‌ అనే మాటకు సంపాదకుడు అనే తెలుగు రూపాన్నిచ్చిన మహా పాత్రికేయులు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. ‘ఆంగ్లపదాలకు ఆంధ్రపదాలు’ అనే శీర్షికను నిర్వహించి ఎన్నో ఇంగ్లీషు పదాలకు తెలుగు మాటలను స్థిరీకరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడేళ్ళ జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత గాడిచర్లను పలకరించడానికి జనం భయపడేవారట,- తమకు కూడా శిక్ష పడుతుందేమోనని! అలాంటి సమయంలో మిత్రులు కొమర్రాజు లక్ష్మణరావుతో సాంగత్యం చిరకాలం నడిచింది. గాడిచర్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అబ్రహాం లింకన్‌ గురించి ఆయన రాసిన గ్రంథం తెలుగులో పూర్తి స్థాయి జీవిత చరిత్ర పుస్తకంగా రికార్డులకెక్కింది. గాంధీ తొలి రచన ‘హిందీ స్వరాజ్‌’కు 1920 ప్రాంతంలో అనువాదం చేశారు. మారుపేరుతో తెలుగులో కథలు రాశారు. తొలి రాయలసీమ కథారచయితగానూ రికార్డులకెక్కారు గాడిచర్ల.


ఎడిటర్‌ అనే మాటకు సంపాదకుడు అనే తెలుగు రూపాన్నిచ్చిన మహా పాత్రికేయులు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. ‘ఆంగ్లపదాలకు ఆంధ్రపదాలు’ అనే శీర్షికను నిర్వహించి ఎన్నో ఇంగ్లీషు పదాలకు తెలుగు మాటలను స్థిరీకరించారు. తెలుగులో పూర్తిస్థాయి దినపత్రికగా 1914లో మద్రాసు నుంచి ప్రారంభమైన ఆంధ్రపత్రిక దినపత్రిక తొలి సంపాదకుడుగా మూడు సంవత్సరాలు పనిచేశారు. తర్వాత 1919లో అదే మద్రాసు నుంచి ‘ది నేషనలిస్టు’ అనే ఆంగ్ల వారపత్రికను బ్రిటీషు ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ నడిపారు. ‘తుపాకిగుండు’ అనే శీర్షికతో 1919 ఏప్రిల్‌ 13న రాసిన సంపాదకీయం రాజద్రోహం వైపు నెట్టింది. ఈ పత్రిక 19 వారాలే నడిచింది. ఆంధ్రపత్రికలో సంపాదకుడిగా చేరకముందు ‘స్వరాజ్య’ (1908) పత్రికలో ‘‘అరెరె ! ఫిరంగి కూడా మృగమా!...’’ అంటూ సాగే సంపాదకీయం రాసి తొలిసారి దక్షిణ భారతదేశంలో పాత్రికేయ రాజకీయ ఖైదీగా మూడు సంవత్సరాలు ఘోరశిక్ష అనుభవించారు. ‘నేషనలిస్టు’ పత్రిక తర్వాత మద్రాసు నుంచే ‘సౌందర్యవల్లి’ అనే మాసపత్రికను స్త్రీ సమస్యలు ప్రధానంగా నడిపారు. స్త్రీల మాసపత్రిక అని పేర్కొనలేదు కానీ, 1919–-1920 ప్రాంతంలో నడిపిన ఈ పత్రికలోనే స్త్రీలకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని ప్రతిపాదించారు. అప్పటికి ఆంధ్రవిశ్వవిద్యాలయం కూడా ఏర్పడలేదని గమనించాలి. తాడిపత్రి నుంచి ‘మాతృసేవ’ అనే పత్రికను నిర్వహించడమేకాదు, ‘పంచాయతి’ పత్రికను మద్రాసు నుంచే తెలుగు, ఆంగ్లం, తమిళ భాషలలో నడిపారు.


1883 సెప్టెంబరు 14న గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలులో జన్మించినా ఆయన పూర్వీకులు కడప జిల్లా పులివెందుల ప్రాంతం సింహాద్రిపురానికి చెందిన వారు. గుంతకల్లులో హైస్కూలు విద్య, పిమ్మట మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో చదివి 1906లో తెలుగు ఎం.ఏ. పాసయ్యారు. అలా తొలిసారి తెలుగు ఎం.ఏ. పట్టా పొందినవారిలో పానుగల్లు రాజా (రామరా యణం) మొదటి వారు కాగా, గాడిచర్ల రెండవ వారు. వేదం వేంకటరాయశాస్త్రి అధ్యాపకుడు కాగా భోగరాజు పటాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, గిడుగు సీతాపతి అంతే వాసులయిన మిత్రులు. కృష్ణదేవరాయలు గురించి ‘ది ఫర్‌గాటెన్‌ ఎంపైర్‌’ పేర ఎం.ఏ. పరీక్షకు అవసరమైన సిద్ధాంత గ్రంథం ఆంగ్లంలో రాసిన పండి తుడు గాడిచర్ల. చిత్తూరు ప్రాంతానికి చెందిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఏకైక కుమార్తె ద్వారక, అల్లుడు పార్థసారథి గొప్ప సంగీత విద్వాంసులు.


మూడేళ్ళ జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత గాడిచర్లను పలకరించడానికి జనం భయపడేవారట.. - తమకు కూడా శిక్ష పడుతుందేమోనని! అలాంటి సమయంలో మిత్రులు కొమర్రాజు లక్ష్మణరావుతో సాంగత్యం చిరకాలం నడిచింది. గాడిచర్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అబ్రహాం లింకన్‌ గురించి ఆయన రాసిన గ్రంథం తెలుగులో పూర్తి స్థాయి జీవిత చరిత్ర పుస్తకంగా రికార్డులకెక్కింది. విజ్ఞాన సంబంధరచనలు ఎన్నో చేశారు. గాంధీ తొలి రచన ‘హిందీ స్వరాజ్‌’కు 1920 ప్రాంతంలో అనువాదం చేశారు. మారుపేరుతో తెలుగులో కథలు రాశారు. తొలి రాయలసీమ కథారచయితగానూ రికార్డులకెక్కారు గాడిచర్ల.


తెలుగు గ్రంథాల గురించి ఇంగ్లీషులో పరిచయం చేస్తూ జి.హెచ్‌.ఎస్‌. పేరుతో ‘హిందూ’ పత్రికలో దశాబ్దం పైగా ఒక ధారావాహిక నిర్వహించారు. ఒక సమీక్షకు 15 రూపాయల వంతున పారితోషికం పొందారు. ఆంధ్రపత్రిక తర్వాతి సంపాదకుడు అవుటుపల్లి నారాయణరావు తెలిపిన దాని ప్రకారం - ఆంధ్రపత్రిక సంపాదకుడుగా పొందిన దినబత్తెం కన్నా ఈ గ్రంథ సమీక్షకు పొందిన పారితోషికమే ఎక్కువ. 1960 ఫిబ్రవరి 29న (లీపు సంవత్సరం) గాడిచర్ల గతించినపుడు ఆంధ్రపత్రిక తన సంపాదకీయంలో ఆంధ్రపత్రిక దినపత్రిక తొలి సంపాదకుడని పేర్కొన్నది. అంతవరకు ఆయన సంపాదకుడనే విషయం ఎక్కడా నమోదు కాలేదు. ఇది మహా సంపాదకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 60వ వర్ధంతి సంవత్సర సందర్భం. తెలివి, ప్రతిభ, ధైర్యం, చొరవ, పట్టుదల, సత్సాంగత్యం, నిజాయితీ వంటి గుణాలతో పాటు నిరంతరం శ్రమించే లక్షణం, కొత్తగా ప్రయత్నించాలి అనే గుణంగల గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయోద్యమానికి చేసిన సేవ అనుపమానమైనది. ఇంకా విజ్ఞాన చంద్రికామండలి ద్వారా, భారత వయోజన విద్యాసంఘం ద్వారా సేవలందించారు. మద్రాసు శాసనమండలి సభ్యుడుగానూ పని చేశారు. పాకీపనివార్ల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతటి సర్వోత్కృష్టమైన గాడిచర్ల జయంతి (సెప్టెంబరు 14)ని తెలుగు సంపాదకుల దినోత్సవంగా జరుపుకోవాలి. కొరవడిన సంపాదకుల స్వేచ్ఛ, సామర్థ్యాలు, మితిమీరిన రాజకీయ, స్వార్థ ప్రయోజనాలతో కూడిన జర్నలిజం ధోరణుల మధ్య పెరగవలసిన మేధో సంపాదకుల పాత్ర గురించి ఈ సందర్భంలో చర్చించుకోవాలి.

డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌

(నేడు గాడిచర్ల 60వ వర్ధంతి)

Updated Date - 2020-02-29T06:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising