ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల కాదు కదా..!

ABN, First Publish Date - 2020-10-05T07:23:25+05:30

మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో అసలు ఇంతకు ముందైనా కలుసుకున్నామా అంతా కలేనా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో

అసలు ఇంతకు ముందైనా కలుసుకున్నామా

అంతా కలేనా..?


మెదడులో మొలిచిన రెప్పల మీద

ఎవరెవరో నడిచిపోతున్నారు

వారి పాదాల స్పర్శ ఊహామోహమో.. నిజమో..!

ఒక్క ఈ దేహానికీ ఎన్ని సందేహాలో!


రెక్కలతో ఎగురుతున్న కొల్లేటి సరసు

దాని వెనక పాటలా తాటి దోనె పరుగు

అందులో ఒక పిల్లాడు ఆకాశానికి గేలం వేసి చూస్తున్నట్టు

చుట్టూ గాలిలో ఊగుతూ ఒక దృశ్యం-

నిద్రను గిచ్చి చూస్తే దేహం మీద మచ్చ


కొన్ని నవ్వులు.. కొన్ని మాటలు.. కొన్ని మనసులు

తాకిన అనుభవం తాజాగా వుంది

ఎందుకో అంతలోనే అదంతా

ఉయ్యాల నాటి ఊహ కాదుకదా అనిపిస్తోంది

అప్పుడు రెండు చేతుల్లోకి తీసుకుని

ముద్దులు పెట్టుకున్న సముద్రం

ఎప్పుడూ వేళ్ళ మధ్య నుంచి ఇసుకలా జారుతుంది

ఇసుక నిజమా.. సముద్రం నిజమా

ఆ అనుభూతి ఆత్మదా.. దేహానిదా..?


ఏరిన పూల గుత్తులు..

నూరిన కలల కత్తులు..

ఎన్ని మంచుబిందువుల ముత్యాల రాశులు

అన్నీ ఏ జన్మలోని ఊసులు?


పేరులేవో తలుచుకుంటున్నాను

మళ్ళీ ఎప్పుడు పిలుచుకుంటాము?

ఒకరినొకరు ముట్టుకుని మరీ ఎప్పుడు చూసుకుంటాము?

ఈ పేర్లన్నీ ఉన్నవి కాదేమో..

కలలాంటి నా కథలో పాత్రల కోసం

నేను పెట్టుకున్న పేర్లేమో..!


పాదాలకు చుట్టుకున్న సముద్రాల నీలిమ

గుండెకు అంటుకున్న ఆకాశాల అరుణిమ

ఇంకా ఈ అరచేతిలో మెదులుతున్న ఒక కనుపాప

ఇంకా ఈ కనుకొలకుల్లో ఊగుతున్న హిమాలయాలు

ఉలిక్కిపడతాను.. అంతా నా పిచ్చి కాదని

అప్పుడప్పుడూ గుండెను కుదిపి చూసుకుంటాను


ఆలోచనల తీరం నిండా ఇసుక గూళ్ళు..

పసిపిల్లల్లాంటి మనుషులు.. కెరటాల లేళ్ళు

ఇది మనసుకు వేలాడదీసిన జీవచిత్రమా

లేక ఒట్ఠి గాలిపటమా..? 


ఆకాశం నుంచి లోయలోకి నిటారుగా మెట్లు

ఎగబాకుతూ దిగజారుతూ ఏవేవో ఊహలు-

చేతుల్ని గట్టిగా పట్టుకోవాలి

ఎవరి చేతుల్ని..?


లోయ చుట్టూ చేతులు చాపిన నక్షత్రాలు-

తాకితే డిజిటల్‌ గోడకు గుద్దుకున్న

నుదురు మీద చితికిన కలల గుడ్లు-

మెలకువ నీళ్ళలో కాళ్ళు కడుక్కుని

భ్రమ నా ఆత్మలోకి ఎప్పుడు అడుగు పెట్టిందో తెలియదు

నన్ను వస్త్రంలా చుట్టుకుని అదెప్పుడు తిరిగి

మెలకువలో సంచరిస్తుందో తెలియదు

ఆ సంశయ సంభ్రమ భ్రమణం అంతమెప్పుడో అర్థం కాదు


శూన్యానికీ శూన్యానికీ మధ్య

ఈ సన్నటి మంచు తెర చినిగేదెప్పుడు?

నిజమూ అబద్ధమూ ఎదురెదురుపడి

పరస్పరం పోల్చుకునేదెప్పుడు?

ఏమిటో అసలు మనమెప్పుడైనా కలుసుకున్నామా

కలుసుకున్నామని అనుకున్నామా?

పోనీ ఈసారైనా కలుసుకున్నప్పుడు

అది నిజమో కలో గట్టిగా తేల్చుకుందాం

ప్రసాదమూర్తి

84998 66699


Updated Date - 2020-10-05T07:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising