పఠనంలో పల్లవించిన మానవత
ABN, First Publish Date - 2020-10-04T08:25:10+05:30
గాంధీని మహాత్ముడిని చేసిందేమిటి? ఆయన తన కాలం ఉత్తమోత్తమ సృష్టి అనే విషయమై చాలా చెప్పడం, ఎంతో రాయడం జరిగింది. అయితే గాంధీ పఠనాసక్తులు ఆయన ఆలోచనలను...
పుస్తక పఠనం గాంధీకి ఒక సాధన. స్వారస్యం కోసం లేదా కేవలం సమాచారం కోసం చదవడమనేది ఆయన స్వభావానికి విరుద్ధం. తన జీవితాన్ని నిశితంగా పరీక్షించుకునేందుకు గాంధీని గ్రంథపఠనమే సదా పురిగొల్పింది. నైతికంగా ఆమోదయోగ్యం కాని స్వార్థపరత్వం నుంచి బయటపడి ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆలోచన, ప్రవర్తనలను అలవరచుకోవడంలో ఆయనకు తోడ్పడింది పుస్తక పఠనమే. విస్తృత పఠనం ప్రేరేపించిన నిరంతర తత్వ పరిశీలనలు, ఆత్మశోధనలతో ఆయన మహోన్నత వ్యక్తిత్వం విప్పారింది.
గాంధీని మహాత్ముడిని చేసిందేమిటి? ఆయన తన కాలం ఉత్తమోత్తమ సృష్టి అనే విషయమై చాలా చెప్పడం, ఎంతో రాయడం జరిగింది. అయితే గాంధీ పఠనాసక్తులు ఆయన ఆలోచనలను తీర్చిదిద్దాయన్న వాస్తవం చాలా వరకు గమనంలోకి రానేలేదు. నిజానికి గాంధీ మంచి అధ్యయనపరుడని, ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో వేలాది పుస్తకాలు ఉండేవని చాలా మందికి తెలియనే తెలియదు. 1917లో అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పిన తరువాత ఆయన తన సొంత గ్రంథాలయంపై హక్కులు వదులుకున్నారు. ఆ విస్తార పుస్తక సంచయం సబర్మతి ఆశ్రమం ఆస్తి అయిపోయింది. గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారి ఆస్తులను వలస పాలకులు స్వాధీనపరచుకోగా ఆ సత్యాగ్రహీల పట్ల సానుభూతితో గాంధీ, తన సబర్మతి ఆశ్రమాన్ని రద్దు చేశారు. ఆ ఆశ్రమానికి తాను ఇచ్చిన పుస్తక సంచయాన్ని ఆయన అహ్మదాబాద్ మునిసిపల్ లైబ్రరీకి ఇచ్చేశారు. తాను దాదాపు 11,000 పుస్తకాలను సేకరించినట్టు 1933 జూలై 27న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
గాంధీ జీవితం, ఉద్యమాలు, భావాల అధ్యయనవేత్తలు కీరిటి భవసార్, మార్క్ లిండ్లే, పూర్ణిమా ఉపాధ్యాయ్ తమ ‘ది బిబ్లియోగ్రఫీ ఆఫ్ బుక్స్ రీడ్ బై మహాత్మా’లో కేవలం 4500 పుస్తకాల జాబితా మాత్రమే ఇచ్చారు. అయితేనేం, ఆ పుస్తకాల జాబితా, వాటిని సేకరించిన మేధావి మనస్సు లోతులను తరచి చూసేందుకు మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. పరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ‘ది డిసెంట్ ఆఫ్ మ్యాన్’, గణిత శాస్త్రవేత్త జేమ్స్ జీన్స్ ‘ది మిస్టీరియస్ యూనివర్స్’ మొదలు అస్సీరియన్ వ్యంగ్య రచయిత లూసియన్ రచనల దాకా ఎన్నో ఉన్నాయి. క్రీ.శ. రెండవ శతాబ్దికి చెందిన లూసియన్ విలియం షేక్‌స్పియర్, జోనాథన్ స్విఫ్ట్‌లను అమితంగా ప్రభావితం చేసిన పురాతన విజ్ఞుడు. ఆయన రచించిన ‘ట్రిప్స్ టు మూన్’ (ప్రపంచపు మొట్టమొదటి శాస్త్ర విజ్ఞానాధారిత కాల్పనిక రచనగా పరిగణన పొందుతోంది) చాలా చక్కని ఉపదేశాత్మకమైన అధిక్షేప రచన అని 1924 సెప్టెంబర్ 4 ‘యంగ్ ఇండియా’లో గాంధీ రాశారు. స్విఫ్ట్ ‘గలివర్స్ ట్రావెల్స్’, టాల్‌స్టాయ్ సాహిత్యేతర రచనలు, కొన్ని అరుదైన సాహిత్య కృతులను కూడా గాంధీ చదివారు. కవిత్వ పఠనంలో కూడా ఆయనకు మంచి అభిరుచి, శ్రద్ధాసక్తులు ఉండేవి. గోథే మహాకవి ‘ఫౌస్ట్’, ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ అనుసృజించిన ఒమర్ ఖయ్యాం ‘ది రుబాయత్’ తో సహా హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలలోని పలు కావ్యాలు గాంధీ గ్రంథాలయంలో ఉన్నాయి. మతం, చరిత్ర, తత్త్వశాస్త్రంలో ఆయన ఆసక్తులు సుప్రసిద్ధమైనవి. ఎడ్వర్డ్ గిబ్బన్, థామస్ కార్లైల్ నుంచి పతంజలి, భర్తృహరి దాకా; బుద్ధుని సమాలోచనల ‘సుత్తనిపాత’, ప్లేటో అజరామర తాత్త్విక గ్రంథాలు, బెర్ట్రెండ్ రస్సెల్ రచనలతో పాటు బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణాలకు సంబంధించిన పలు అనువాదాలు కూడా ఉన్నట్టు ‘బిబ్లియోగ్రఫీ’ పేర్కొంది.
దక్షిణాఫ్రికాలో నివశించిన కాలంలో సత్యంతో ప్రయోగాల ఫలితంగా గాంధీ దృక్పథంలో మౌలికమార్పు వచ్చింది. విస్తృత గ్రంథపఠనమే ఆయనలో ఈ మార్పునకు విశేషంగా దోహదం చేసింది. తన జీవితాన్ని నిశితంగా పరీక్షించుకునేందుకు గాంధీని గ్రంథపఠనమే సదా పురిగొల్పింది. నైతికంగా ఆమోదయోగ్యంకాని స్వార్థపరత్వం నుంచి బయటపడి ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆలోచన, ప్రవర్తనలను అలవరచుకోవడంలో ఆయనకు తోడ్పడింది ఉదాత్త రచనల అధ్యయనమే. ఆ ప్రభావం ఆయన ఆత్మకథలో స్పష్టంగా కన్పిస్తుంది. విస్తృత పఠనం ప్రేరేపించిన నిరంతర తత్వ పరిశీలనలు, ఆత్మశోధనలతో ఆయన మహోన్నత వ్యక్తిత్వం విప్పారింది. పుస్తక పఠనం గాంధీకి ఒక సాధన. స్వారస్యం కోసం లేదా కేవలం సమాచారం కోసం చదవడమనేది ఆయన స్వభావానికి విరుద్ధం. సత్యంతో ఆయన ప్రయోగాలు తనలోని స్వార్థపరత్వాన్ని పరిపూర్ణంగా నిర్మూలించుకునేందుకు చేసిన ప్రయత్నాలే. ఒకప్పుడు సోక్రటీస్, బుద్ధుడు అటువంటి నిర్మలత్వాన్ని సాధించారని ఆయన భావించారు. వారివలే తానూ పరిపూర్ణ నిస్వార్థుడు కావాలని ఆయన సంకల్పించుకున్నారు. స్వార్థపరత్వం నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడాన్నే ఆయన మోక్షంగా భావించారు. ఒక మత దురహంకారి తనను హత్య చేసే క్షణం వరకు అటువంటి మోక్షాన్ని సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ లక్ష్య సాధనలో తాను సఫలం కాలేకపోతున్నానని ఆయన ఒప్పుకునేవారు. ఈ అసాధారణ నిజాయితీపరుడు తన వైఫల్యానికి ఎంతో విచారిస్తుండేవారు.
నిరంతర పఠనం, వివేచన, రచనా వ్యాపకాలతో పాటు రాజకీయ కార్యాచరణ గాంధీ తనను తాను నిత్యం ప్రశ్నించుకోవడానికి తోడ్పడ్డాయి. తద్వారా ఆయన తనను తాను పరివర్తన చెందించుకున్నారు. ఆత్మ పరివర్తనాత్మకంగా ప్రశ్నించుకోవడమే తాత్విక అన్వేషణ అనేది ఆయన భావన. స్వార్థపరత్వం నుంచి మోక్షసాధనకు సాగించిన ప్రస్థానంలో ఈ ప్రక్రియ ఆయనకు సహాయపడింది. కార్లైల్ ‘ది ఫ్రెంచ్ రివొల్యూషన్’ చదివిన అనంతరం శ్వేతజాతులు భారత్ లాంటి ప్రాచ్యజాతులకు ఆదర్శం కావు, కాలేవనే అభిప్రాయానికి గాంధీ వచ్చారు. జోనాధన్ స్విఫ్ట్ గలివర్స్ ట్రావెల్స్‌లో ఆధునిక నాగరికతపై సంధించిన నిశిత విమర్శలు ప్రభావశీలంగా ఉన్నాయని ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవతగిందని ఆయన వ్యాఖ్యానించారు. 1909లో ఆధునిక నాగరికతపై విమర్శనాత్మకంగా హిందూ స్వరాజ్ అనే గ్రంథాన్ని గాంధీ రాశారు.
గాంధీ తనను తాను సనాతన హిందువుగా పరిగణించుకునేవారు. దైనందిన మతాచారాలకు ఆయన చాలా దూరంగా ఉండేవారనే విషయం ఆయన రచనలను బట్టి మనకు విశదమవుతుంది. ఎటువంటి పూజలు, క్రతువులను ఆయన నిర్వహించేవారు కాదు, పాల్గొనేవారు కాదు. హిందూ మతగ్రంథాలు చెప్పిన విషయాలను ఆయన విశ్వసించేవారు. అయితే ఇతర మతాల పవిత్ర గ్రంథాలను కూడా ఆయన అదే వైఖరితో చూసేవారు. బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం ఏ మత గ్రంథమైనా కానివ్వండి వాటిపై గాంధీ ఆలోచనలు ఒకే విధంగా ఉండేవి. ‘వేదాలు దైవవాక్కు స్ఫూర్తితో రూపొందాయనడంలో అర్థమేమిటి? వేదాలు భగవంతుని నుంచి స్ఫూర్తి పొందినవి అయితే బైబిల్, ఖురాన్ మొదలైనవి మాత్రం ఎందుకు కావు?’ ఆని ఆయన ప్రశ్నించారు. ఇది 1901 నాటి మాట. ‘వేదాలు భగవంతుని నుంచి స్ఫూర్తి పొందినవి అయితే..’ అనే మాటలో ధ్వనిస్తున్న సంశయాన్ని గ్రహించారా? దైవప్రేరిత మతగ్రంథాల విషయమై ఆయన తన జీవితాంతం ఇటువంటి వైఖరినే చూపారు.
డాక్టర్ కె.పి. శంకరన్
(‘ది వైర్’లో వెలువడిన వ్యాసంలోని కొన్ని భాగాలకు స్వేచ్ఛానువాదం)
Updated Date - 2020-10-04T08:25:10+05:30 IST