ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర ధన్యుడు మధునాపంతుల

ABN, First Publish Date - 2020-03-05T08:48:22+05:30

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి సిద్ధార్థి నామసంవత్సరం ఫాల్గుణమాసంలో పౌర్ణమి రోజున (1920 మార్చి 5) తూర్పుగోదావరి జిల్లా ఐలెండు పోలవరంలో పూర్ణచంద్రుడిలా మాతామహుని ఇంట ఉదయించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్ర మహోజ్జ్వల చరిత్ర గురించి మణులవంటి పద్యాలతో చక్కని మణిహారంను గుది గుచ్చి తెలుగు భాషామతల్లిని అలంకరించిన మహాకవులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. సాహిత్య చరిత్రను ధిషణతో సుసంపన్నంచేసి స్వర్ణయుగంగా తన కాలాన్ని సాహిత్యాన్ని తెలుగుభాషా సరస్వతికి సమర్పించిన ధన్యులు మధునాపంతులవారు.


మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి సిద్ధార్థి నామసంవత్సరం ఫాల్గుణమాసంలో పౌర్ణమి రోజున (1920 మార్చి 5) తూర్పుగోదావరి జిల్లా ఐలెండు పోలవరంలో పూర్ణచంద్రుడిలా మాతామహుని ఇంట ఉదయించారు. తండ్రి సూర్యనారాయణమూర్తి, తల్లి సుబ్బలక్ష్మి. విశ్వనాథ వారి పేరు వినగానే ‘ రామాయణ కల్పవృక్షం’ స్ఫురించినట్లు మధునాపంతుల వారి పేరు వినగానే ‘ఆంధ్రపురాణం’ జ్ఞప్తికి వస్తుంది. సంప్రదాయ కవిత్వం రాసే కవులలో అత్యంత నవీనుడు, అభినవాంధ్ర కవులలో అత్యంత సంప్రదాయ కవి తల్లజుడు మధునా పంతుల అని సాహిత్యవేత్తలు అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు. 


12వ శతాబ్దంలో కశ్మీర్ పండితుడు కల్హణుడు కశ్మీరు రాజుల చరిత్రను గ్రంథస్థం చేశాడు. ‘రాజతరంగిణి’ అనే పేరుతో చరిత్రను గ్రంథస్థం చేసిన మొదటి కావ్యమది. అటు తరువాత ఆ రీతిలో ఆంధ్రదేశచరిత్రను గ్రంథస్థం చేసినవారు మధునాపంతులవారే. ఈ కారణంగా ఆయన ‘ఆంధ్ర కల్హణుడు’ గా సుప్రసిద్ధులయ్యారు. ‘రాజమహేంద్రిలో నడయాడుతున్న నన్నయ’ అని మధునాపంతుల వారిని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించారు.


మహాకావ్యం ‘ఆంధ్ర పురాణం’తో పాటు తోరణం, శ్రీఖండం, చైత్రరథం, కేళాకుళి, సదాశివ సంచాశిక మొదలైన ఖండ కావ్య కృతులు మధునాపంతుల వారి లేఖిని నుంచి వెలువడ్డాయి. ఆయన మరో సుప్రసిద్ధ గ్రంథం ‘ఆంధ్ర రచయితలు’.

నన్నయగారిపైన తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ మధునాపంతుల వారు ఎన్నో వ్యాసాలను రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ వ్యాసాలను ‘వ్యాసపీఠం’ పేరుతో ప్రచురించారు. ‘తెలుగు సారస్వత ప్రపంచమును నిరంతరముగా వెలిగించిన దివ్య తేజోమయుడు’ అనీ, . ‘వాఙ్మయవాహినికి శుచిత్వ సిద్ధిని ప్రసాదించిన వాగనుశాసనుడు’ అనీ నన్నయపైన తమ అపార భక్తి ప్రపత్తులను మధునాపంతుల వారు ప్రకటించుకున్నారు. నన్నయ గురించి ఇంకా ఇలా అన్నారు: ‘నన్నయ నాటికి తెలుగు జాతి వ్యవహరించే భాష తక్కువది కాదు. ఎంతో తియ్యనైనది. రసగూఢమైన భాష. ఛందోలావణ్యంతో తరంగితమై ఉన్న నాటి తెలుగు వాఙ్మయం గోక్షీరం వంటిది. గాఢ ప్రతిభా సంపన్నుడైన నన్నయ ఆ పాల నుండి నవ్యనవనీతం ఎత్తి తీసినాడు. ఆ వెన్న వెచ్చబెట్టినాడు. గుమగుమలాడే గోఘృతం అయింది. అదే ఆంధ్రమహాభారత సారస్వతం. వెయ్యేండ్లు అన్నమాట ఏమిటి? ఆ నెయ్యి కావ్యప్రపంచంలో కల్పాంతస్థాయి ఉత్తరోత్తర యుగాల సాహిత్య జీవులకూ తేజోదాయి. ఋషి తుల్యుడు నన్నయ. ఆయన తెలుగు పద్యం రసప్రపూర్ణ సరోవరంగా భావుకులను పిలిచి అవగాహనం చేసుకోమంటుంది’. అలా నన్నయగారిని వేనోళ్ళ ప్రశంసిస్తూ ఆ వాగామృతధారలో పాఠకుల నోలలాడించిన కమనీయ సారస్వతావతారమూర్తి మధునాపంతుల వారు. ఆంధ్రభాషోద్ధరణకు నడుము కట్టిన నన్నయభట్టారకుని ఆంధ్ర భాషా సేవను, సభ్యరమణీయమైన సారస్వత అభినివేశమును పొందికైన పలుకుబడితో రసరమ్యంగా ఆయన అందించినారు. 


పద్యరచన అంటే మధునాపంతుల వారికి ప్రాణప్రదం. ‘ఆంధ్రపురాణం’లో-

‘ఛందస్సుందరమైన పద్యకవితా సారస్వతంబన్నమా

డెందంబూరి సముద్రమై పొరలి గొండ్లింజేయునానందని

ష్యందంబై ససిలేని కైతకు లోనైయున్న నే డామహ

స్సౌందర్యం బెటు గూరు భారతి భవిష్యం బింక బొల్పారెడిన్‌’


అని పద్యరచన పట్ల తమ ఆసక్తిని తెలియజేశారు. ‘ఆంధ్రపురాణం’లోశాతవాహనపర్వంలో కావ్యహోమం, చాళుక్యపర్వంలో భారతావతరణం, కాకతీయ పర్వంలో రాణీ రుద్రమాంబ సమర శౌర్యం చాలా ప్రసిద్ధి పొందిన ఘట్టాలు. ఇంకా పున:ప్రతిష్ఠాపర్వం, విద్యానగరపర్వం, శ్రీ కృష్ణదేవరాయపర్వం, విజయపర్వం, నాయకరాజ పర్వం రసవత్తరమైన పద్యాలతో రసజ్ఞులను ఆకట్టుకున్నాయి.


రాణి రుద్రమ ఆంధ్రసామ్రాజ్ఞిగా ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుంటే ఓర్వలేని శత్రువులు అసూయతో- 

‘ఆడుదానికి రాజ్య పట్ట్టాభిషేక

వైభవ ప్రాఛవములె సెబాసు! మనకు 

ఇంక ముందాంధ్ర భూమిలో ఇంటనింట

కొదవలేదంట పసువు గుంకుమపంట’ అని అనుకున్నారట. 


ఈ పద్యంలోని అంత్యప్రాసలు శ్రవణసుభగంగా ధ్వనిస్తాయి. పదలాలిత్యానికీ శబ్ద సౌందర్యానికి అంత్యప్రాసకు ‘ఆంధ్రపురాణం’ లోని ఎన్నో పద్యాలు ఉదాహరణలుగా నిలుస్తాయి.


దేవగిరి ప్రభువు మహాదేవరాజు ఓరుగల్లు కోటముట్టడించడానికి ఎదురు చూస్తున్నాడని సంస్థానోద్యోగి చెప్పినప్పుడు- 


‘అంతట ఆంధ్రరాజ్ణి వదనాబ్జము మ్రింగిన కెంవునవ్వుక

ల్పాంత నటద్ఘనాఘన విహారతట్లితికా సహస్రవి 

క్రాంతికి స్వాగతంబిడె చకచ్చక దీప్తు విచ్చుగత్తున్‌

సంతన పెట్టె రాజపరిషత్తున కబ్బుర పాటు గొప్పుచున్‌’ 

అని రుద్రమను మధునాపంతుల వారు అభివర్ణించారు.

తమ పైకి శత్రువు దండెత్తివస్తాడనేమాట వినగానే ఆమె అబ్జమువంటి ముఖము మింగినకెంపు అంటారు కవి. కోపంతో ఎరుపెక్కిందనో, జేవురించిందనో చెప్తే సామాన్యంగా ఉండి ఉండేది కదా. మింగిన కెంపు అనడంలో చక్కని భావుకత వున్నది. ఆమెలోని శౌర్యము, ఉద్రేకము రాజపరిషత్తునకు ఆశ్చర్యము గొల్పింది అని ఆంధ్ర పౌరుషాన్ని చక్కని పదబంధంతో మధునాపంతుల వారు వ్యక్తం చేశారు. 


విద్యానగర పర్వంలో హరిహరరాయ, బుక్కరాయ, విద్యారణ్యస్వామి వంటి వారి చరిత్ర సరళమధురంగా సాగుతుంది. శ్రీనాథ -డిండిమభట్టు శాస్త్రార్థ ప్రౌఢ శాస్త్రచర్చను మధునాపంతుల వారు సహృదయ హృదయంగమంగా వర్ణించారు. కనకాభిషేక ఘట్టంలో-


ఆంధ్రకవి సార్వభౌమ హేమాభిషేక

పరమసమ్మాన మంగళాచరణగాన 

వాద్యనిస్వాన మది యొక్క స్వాతివాన

తనుపుగా మొగ్గవిచ్చెముత్యాశా’ 


అనే తేటగీతి పద్యం సుదీర్ఘ సమాస భూయిష్ఠమై పాఠకుని హృదయానికి హత్తుకునిపోతుంది. శ్రీరంగధామేశ్వరిపై ఆంధ్రాభ్యుదయ శుభాకాంక్ష పద్యాలతో ఆంధ్రపురాణం పూర్తి అవుతుంది.

‘శతధాక్లువ్త సహస్రధా వివృతక్షానే కశ:కోటిశ

స్తత విశ్వోదయ రమ్యరమ్యతర శశ్వత్సృష్టి కళ్యాణి కా

రతి పాత్రంబును నెత్తు మమ్మొదలి పేరంటాలివౌ నీదుకం

టితుదన్‌ మ్గె వికుంఠనాయక చిరంటీ! ఆంధ్రసామ్రాజ్యముల్‌’


అంటూ ఆంధ్రుల, ఆంధ్ర సామ్రాజ్య క్షేమమును కోరుతూ అమ్మవారి పరంగా చేసిన ఈ స్తుతి కవికి గల సామాజిక బాధ్యత, ఆంధ్రాభిమానము సువ్యక్తమవుతాయి. మధునాపంతులవారు. ఆంధ్ర మహోజ్జ్వల చరిత్రను మణులవంటి పద్యాలతో చక్కని మణిహారమును గుది గుచ్చి భాషామతల్లిని అలంకరించి ఆంధ్రులందరికీ గర్వకారకులయినారు. సాహిత్య చరిత్రను ధిషణతో సుసంపన్నంచేసి స్వర్ణయుగంగా తన కాలాన్ని సాహిత్యాన్ని తెలుగుభాషా సరస్వతికి సమర్పించిన ధన్యులు మధునాపంతులవారు. ఆయన సమకాలీన మహాకవుల పొగడ్తలను పొందిన శేముషీ ధురంధరుడు.


ప్రాచీన సాహిత్యాన్ని ఆపోశనపట్టిన మధునాపంతువారు ఆధునిక కవుల సాహిత్యాన్నీ చదివారు. ఆధునికకవులను కొనియాడుతూ పలు ప్రసంగాలు చేశారు. భావకవిత్వ మాధురీ దర్శనములో ఆంధ్రావళికి రమ్యాలోకమునిచ్చిన రాయప్రోలు సుబ్బారావు, శిరీషపేశమైన విమర్శనాత్మక సాహిత్యరచనమునకు కర్ణాటక గాంధర్వధారను పారింపజేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ‘సాహితీసమితి’, ‘నవ్యసాహిత్య పరిషత్‌’ ను ప్రతిభా వైభవంతో నడపి గీతినాటికా ప్రక్రియకు ఖ్యాతి తెచ్చిన విద్వజ్ఞుడు తల్లావఝల శివశంకరశాస్త్రి, వేలూరి శివరామశాస్త్త్రి వెరసి ఈ నలుగురు అభినవాంధ్ర సారస్వతమును నందన ప్రసవముగా పరిమళింపజేసిన తోబుట్టువులని వారి పట్ల తమ ఆత్మీయతను మధునాపంతువారు చాటుకున్నారు.


చిలకమర్తివారిని ప్రస్తుతిస్తూ ‘ఐకమత్యము అను పంచాక్షరీనామమంత్రము ప్రతిమానవుడు పునశ్చరణము చేసి యాచరింపవలెనని ఘోషించినవారాయన’ అని చెప్పడం సమకాలికుడైన మరొక కవిని గురించి ఇంతచక్కని ఆత్మీయప్రసంగము చేయడం మధునాపంతువారి సంస్కారమునకు నిదర్శనము. పానుగంటివారి గురించి చెప్పుతూ ‘ఆర్జనము, సామరస్యము, ప్రేమ, ధర్మదీక్ష, శివేతరక్షతి, జగత్కల్యాణము పానుగంటి వారి మనోరధము’ అని అన్నారు. పానుగంటి వారి సాహిత్య సృష్టి తెలుగువారికి సనాతనమైన పుష్టి, వారి కృష్ణభక్తి సర్వారాధ్యము. పానుగంటివారి యశోలక్ష్మికి ‘సాక్షి’ వ్యాసాలు స్వర్ణసింహాసనమును ఘటించినవని’ పానుగంటివారిని కొనియాడిన సహృదయుడు మధునాపంతువారు.


పండితుడైన కవి, పరిశోధకుడైన విమర్శకుడు కనుకనే మధునాపంతుల వారు తమ ‘ఆంధ్ర రచయితలు’లో పలువురు రచయితల అంతర ప్రతిభా స్వరూపపాన్ని విస్పష్టంగా ఆవిష్కరించారు. బహుభాషావేతృత్వం, నిరంతరాయ సాహిత్య కృషి వంటి మహా లక్షణాలు కలిగిన అసమాన ప్రతిభాశాలి కనుకనే మధునాపంతుల వారిని విశ్వనాథ వారు ‘కవిప్రభువు’అని ప్రశంసించారు.


ఆయన ఖండ కావ్యాల పైన సుప్రసిద్ధ విమర్శకులు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు చక్కని విమర్శా వ్యాసాలు రచించారు. ఆయన ‘రత్న పాంచాలిక’ నాటకం ప్రసిద్ధ నాటక ప్రయోక్త వాడ్రేవు సుందరేశ్వరరావు దర్శకత్వంలో పలు ప్రదర్శనలకు నోచుకున్నది. 


‘బుధుల్లెన్‌నుతియించ నాంధ్రచరితల్‌ పూర్వోక్తమార్గమ్మునన్‌

సుధంబంచ రచించె భవ్యకవితా శోభాయమానుడుశ్రీ 

మధునాపంతు వంశమండనుడు శ్రీమత్సత్యనారాయణుం

డుధరన్‌ కీర్తివహింపనాదు కయిమోడ్పుల్‌ తత్కవిస్వామికిన్‌’

అని వానమామలై వరదాచార్యులు మత్తేభ పద్యంలో ఈ కవి దిగ్గజాన్ని ప్రశంసించారు. 

ఎర్రమిల్లి శారద

(నేడు మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తి శత జయంతి)

Updated Date - 2020-03-05T08:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising