ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరకంలో విహారం..

ABN, First Publish Date - 2020-10-04T08:15:20+05:30

ఆనందవినోదాలకో, వ్యాపారాభివృద్ధికో చేసే యాత్రలే పర్యాటకం. యాత్రికుల ఆకర్షణ, వసతి, వినోదం, వ్యాపారం పర్యాటకంలో భాగం. స్వదేశీ పర్యటనలతో ప్రాంతీయ సంస్థలకు లాభం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది యాత్రికులు క్రూరత్వం, ప్రమాదాలు, ప్రకృతి, మానవ విపత్తులు, అపకీర్తిహత్యల స్థలాలను సందర్శిస్తున్నారు. చరిత్రలో చీకటి కోణాల సమాచారం నేటి ప్రపంచం అధోగతికి కారణాలను తెలుపుతుంది. వాటికి పరిష్కారాల ఆవిష్కరణతో మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడుతుంది.


ఆనందవినోదాలకో, వ్యాపారాభివృద్ధికో చేసే యాత్రలే పర్యాటకం. యాత్రికుల ఆకర్షణ, వసతి, వినోదం, వ్యాపారం పర్యాటకంలో భాగం. స్వదేశీ పర్యటనలతో ప్రాంతీయ సంస్థలకు లాభం. అంతర్జాతీయ పర్యాటకం వల్ల చెల్లింపు సంతులన సమస్యలతో విదేశీ మారక ద్రవ్య నిలువలపై ప్రభావం పడుతుంది. మాములు పర్యాటక ప్రాంతాలకు కాకుండా దుఃఖమరణాలతో చారిత్రక సంబంధాలున్న ప్రదేశాలకు యాత్రలు చీకటి పర్యాటకం అవుతాయి. వీటిని అనారోగ్య, నల్ల, థానా, విచార పర్యటనలు అని కూడా అంటారు. స్థలప్రభావ ప్రత్యేక లక్షణాలే యాత్రికులను చీకటి పర్యాటకానికి పురిగొల్పవు. అక్కడి నరమేధాలు, బాధాకరమైన సంఘటనలతో ఆ స్థలానికి ఉన్న సంబంధాల కంటే వాటి చారిత్రిక ప్రాముఖ్యత ప్రధాన పర్యాటక ఆకర్షణ అవుతుంది. ఆసక్తికరమైన రహస్య కుట్రలు తెలుస్తాయని చాలామంది చీకటి ప్రదేశాలకు వెళతారు. కొందరు వాటిని భయం, బలహీనతలు, అనాలోచిత సంఘటనల స్థలాలని భావిస్తారు.మరికొందరు ఆ స్థలాలకు ప్రగాఢ తాత్వికతలను జోడిస్తారు.


కొందరు చీకటి పర్యాటకాన్ని గౌరవ చర్యగా చూస్తారు. కొందరు అనైతికమంటారు. 16వ శతాబ్దంలో లండన్లో బహిరంగ ఉరిశిక్షలను ప్రజలు ఆసక్తిగా చూశారు. 1815లో నెదర్లాండ్, ఫ్రాన్స్‌ మధ్య బెల్జియంలో జరిగిన వాటర్లూ యుద్ధాన్ని ప్రజలు బండ్లపై నుంచి తిలకించేవారు. మృత్యుచర్యలను చూడటం ప్రజల చిరకాల సంప్రదాయ అలవాటు. ఇటీవల ఈ అలవాటు గురించి సైద్ధాంతికంగా అధ్యయనం చేశారు. అమెరికా పాత్రికేయ రాజకీయ వ్యంగ్యవాది పాట్రిక్ జేక్ ఓ’ రూర్కె 1988లో తన వార్సా, మనాగువ, బెల్ఫాస్ట్ యాత్రను ‘నరకంలో సెలవు’గా వర్ణించారు. లండన్ సిటీ వర్సిటీకి చెందిన సామాజికశాస్త్రాల ఆచార్యుడు క్రిస్ రోజేక్ 1993లో దీన్ని ‘నల్లమచ్చ పర్యాటకం’ అన్నారు. స్కాట్లండ్ గ్లాస్గోలో ఈ అంశంపై మొదటి అధ్యయనం జరిగింది. 1996లో గ్లాస్గో కాలెడోనియన్ వర్సిటీకి చెందిన ‘ఆతిథ్యం, పర్యటన, విరామ సమయనిర్వహణ’ విభాగం అధ్యాపకవర్గ సభ్యులు జాన్ లెనన్, మాల్కోల్మ్ ఫోలేలు చీకటి పర్యాటకం అనే పదాల్ని ప్రయోగించారు. 1996లోనే గ్లాస్గో స్ట్రాత్క్లైడ్ వర్సిటీ పర్యాటక మార్కెటింగ్ ఆచార్యుడు ఎవి సీటన్ థానా పర్యాటకం అని అన్నారు. 2014 నాటికి ఈ అంశంపై అనేక అధ్యయనాలు జరిగాయి. పర్యాటకాల నిర్వచనాలు, వివరణలు విద్యారంగం, బాహ్య ప్రపంచం, పర్యాటక సాహిత్యాలలో ప్రచారంలోకి వచ్చాయి. చీకటి పర్యాటకం మీద అనుభవాధార పరిశోధనలు తక్కువే జరిగాయి. 


నేడు 112 దేశాల్లో 900 చీకటి పర్యాటక స్థలాలున్నాయి. వీటిలో సాధు జంతువులను చంపిన దృశ్యాల ప్రదర్శనశాల రోమ్ కొలోజియం, మత మారణహోమాల్లో తలలు తెగిన శవాల శ్మశానాలు కాటకూంబ్స్ ఉన్నాయి. బ్రిటన్‌లో లండన్ టవర్, ఎడింబర్ కోట లాంటి అమానవీయ ఘటనాస్థలాలను వారసత్వ కేంద్రాల్ని చేశారు. పలువురిని బాధితులుగా మార్చిన బెర్లిన్ గోడ ప్రత్యేక ఆకర్షణ స్థలంగా ఉండేది. నేడు కూలిన గోడ పర్యాటక స్థలం. 1688లో రక్తరహిత విప్లవంతో రెండవ జేమ్స్‌ను గద్దె దింపారు. ఆయన సమర్థకులను జాకొబైట్స్ అంటారు. 1746లో బ్రిటిష్ సైన్యం జాకొబైట్స్‌ను ఓడించింది. ఈ కులోడెన్ యుద్ధస్థలం చీకటి పర్యాటక ప్రదేశం. రొమేనియా జాతీయ స్మారకచిహ్నం బ్రాన్ కోట, పొయెనరి శిథిల కోట, వేల్స్‌లో బ్యూమరీస్ గావోల్ జైలు, లండన్ చెరసాలలో ఘోర హంతకుడు జాక్ రిప్పన్ ప్రదర్శనశాల, జపాన్లోని హిరోషిమా శాంతి స్మారకవనం, ఉక్రెయిన్లో అణుప్రమాదం జరిగిన చెర్నోబిల్ కర్మాగారం, అమెరికాలోని గ్రౌండ్ జీరో ఆస్చ్విట్జ్ కేంద్రీకరణ శిబిరం (రెండవ ప్రపంచ యుద్ధ నరమేధంలో ఆక్రమిత పోలండ్‌లో నాజీలు నడిపిన 40 వినాశక నిర్మూలన, కేంద్రీకరణ భవన సముదాయం), చైనా పాత రాజధాని నాంజింగ్‌లో జపాన్ సైన్యం 1937లో సాగించిన నరమేధానికి సంబంధించిన స్మారక మందిరం చీకటి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు పొందాయి.


కాంబోడియా రాజధాని నాంపెన్ మారణహోమంలో 17 లక్షల మంది పౌరులను, 17 వేల మంది ఖైదీలను చంపారు. దానికి సంబంధించిన తుయోల్ స్లెంగ్ నరమేధ ప్రదర్శనశాల, దక్షిణ కొరియాలోని జెజు తిరుగుబాటు స్థలాలు, కెనడాలోని క్యూబెక్ రాష్ట్రంలో లా ఫర్మ్ వద్ద స్పిరిట్ సరస్సు నిర్బంధ కేంద్రం, వాషింగ్టన్ హోలొకాస్ట్ మెమోరియల్ మ్యూజియం, అమెరికా అణుపరీక్షాస్థలం బికిని అటాల్, 1936-–39 మధ్య అంతర్యుద్ధం జరిగిన స్పెయిన్‌లోని బాల్చైట్, ఐర్లండ్ లీప్ కోట, అలంకరణకు 50వేల కళేబరాలు వాడిన చెచియా, సెడ్లాక్ ఒసువరి క్యాథలిక్ చర్చి, ఇటలీ పాంపోయి శిథిలాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన చీకటి పర్యాటక ప్రదేశాలు. 1982లో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దండెత్తింది. అక్కడి తీవ్రవాద బృందం హెజ్బుల్లా ఆ దాడిని ప్రతిఘటించింది. వేల పాలస్తీనియన్ పౌరులు చనిపోయారు. లక్షలమంది దేశం వదిలివెళ్లారు. 2010లో హెజ్బుల్లా సైనికస్థావరం మ్లీట్‌లో స్మారకచిహ్నం నిర్మించారు. చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో 2008లో సంభవించిన భూకంపంలో 5,300 పిల్లలతో సహా 90 వేల మంది చనిపోయారు. 2009లో ఇంగ్సివు పట్టణంలో స్మారక భవనం కట్టారు. 1994 ఏప్రిల్-, జూలైలలో తుత్సి మైనారిటీల నిర్మూలనకు రువాండా హుతు మెజారిటీలు 8 లక్షల మందిని చంపారు. 2.5 లక్షల మంది స్త్రీలను మానభంగం చేశారు. హతుల ఎముకలు, పుర్రెలతో రువాండాలో నరమేధ స్మారకం నిర్మించారు. ఇరాక్, లిబియా, అఫ్ఘానిస్తాన్లలో యుద్ధం చేసి అమెరికా తన బానిస ప్రభుత్వాలను స్థాపించింది. ఇరాన్, సిరియాలపై భౌతిక, ఆర్థిక యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇవి నేటి చీకటి పర్యటన స్థలాలు. 


1919లో అమృత్సర్లోని జలియావాలాబాగ్‌లో బ్రిటిష్ పాలకులు స్త్రీ శిశువులతో సహా నిరాయుధులైన వేలమందిని కాల్చి చంపారు. అండమాన్ నికోబార్ ద్వీపాలలో కాలాపానీ జైలులో ఆంగ్లేయులు భారత స్వాతంత్ర్య పోరాట యోధులను బంధించేవారు. వారిని రాజకీయంగా, సామాజికంగా దేశం నుంచి వెలేసేవారు. సావర్కర్ భీరత్వానికి ఈ జైలు సాక్ష్యం. గాంధీని సంఘ్ సభ్యుడు, హిందుమహాసభ నాయకుడు, బ్రాహ్మణుడు గోడ్సె క్రూరంగా చంపిన స్థలం ఢిల్లీలోని గాంధీ స్మృతి. 1984లో భోపాల్లో జరిగిన విషవాయు దుర్ఘటనలో అధికార లెక్కల ప్రకారం 3,787 మంది చనిపోయారు. 5 లక్షల మంది రోగాల పాలయ్యారు. క్రీ.శ 850 నాటిదిగా భావిస్తున్న ఉత్తరాఖండ్ రూపకుంద్ అస్థిపంజరాల సరస్సులో 1942లో అసంఖ్యాక మానవ కళేబరాలు తేలాయి. ఇవన్నీ చీకటి పర్యాటక ప్రాంతాలే. నేటి భారతంలో గుజరాత్‌, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర హిందుత్వ ప్రయోగశాలయ్యాయి. ఆ రాష్ట్రాలలోని ఆయా ప్రాంతాలతో పాటు అయోధ్యలో కూల్చిన మసీదు ప్రాంతం, అక్కడ కట్టబోయే రామమందిర్, అయోధ్యలో మసీదు కూల్చివేత తర్వాత అల్లర్లతో అట్టుడికిన ముంబయి, మేధావుల అరెస్టులకు కారణమైన భీమాకోరేగావ్, ప్రగతిశీల విద్యార్థుల అణచివేత కేంద్రాలైన జవహర్‌లాల్ నెహ్రూ, జామియా మిలియా, బనారస్ హిందూ, జాదవపుర్, విశ్వభారతి వర్సిటీలు, పౌరసత్వ ఉద్యమంతో ముస్లింల, వామపక్ష, ప్రగతిశీలభావాల నాయకుల అరెస్టుకు, అక్రమ కేసులకు కారణమైన దిల్లీ షాహీన్ బాగ్, దళిత హత్యలు జరిగిన చుండూరు, కారంచేడు వంటివన్నీ చీకటి పర్యాటక ప్రదేశాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది యాత్రికులు క్రూరత్వం, ప్రమాదాలు, ప్రకృతి, మానవ విపత్తులు, అపకీర్తిహత్యలతో ముడిపడిన స్థలాలను సందర్శిస్తున్నారు. చరిత్రలో చీకటి కోణాల సమాచారం నేటి ప్రపంచం అధోగతికి కారణాలను తెలుపుతుంది. వాటికి పరిష్కారాల ఆవిష్కరణతో మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడుతుంది.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి

Updated Date - 2020-10-04T08:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising