సమగ్ర తెలుగు విశ్వవిద్యాలయం: ఒక ప్రణాళిక
ABN, First Publish Date - 2020-10-04T08:21:11+05:30
తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటై 35 సంవత్సరాలు గడచింది. తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న...
తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి పుట్టిల్లు తెలంగాణాయే. పవిత్ర గోదావరి నదిలాగా సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా ఇక్కడ పుట్టి విస్తరించినదే. నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాల వలె సమగ్ర తెలుగు విశ్వద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేయాలి.
తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటై 35 సంవత్సరాలు గడచింది. తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న పవిత్ర లక్ష్యంతో ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎన్టీఆర్ తర్వాత 30 ఏండ్లకు మళ్ళీ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడింది. మళ్ళీ అదే జాతి చైతన్యం, భాషా చైతన్యం, మళ్లీ అదే ఉద్యమం పునఃఆవిష్కృతమైంది. కళలు, సంస్కృతి వికాసంతో తెలంగాణ యావత్తూ పులకించిపోయింది.ఈ నేపథ్యంలో తెలంగాణ భాషా సంస్కృతి కళల వికాసం కోసం; అధ్యయనం, పరిశోధనల కోసం ఇంతకు పూర్వమే ఏర్పాటైన తెలుగు విశ్వవిద్యాలయాన్ని సమగ్రంగా అభివృద్ధిపరచవలసి ఉంది. దానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవలసి ఉంది. ఆ ప్రణాళికకు సంబంధించిన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
తెలంగాణ ప్రజల రాజకీయాధికార స్వాతంత్య్రానికి ప్రతీకగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని రూపొందించవలసి ఉంది. 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ తెలుగు విశ్వవిద్యాలయంగానో లేదా అంతర్జాతీయ తెలుగు విశ్వవిద్యాలయంగానో ఉన్నతీకరించవలసి ఉంది. దానికి తగినట్లుగా నూతన చట్టాన్ని రూపొందించుకోవలసి ఉంటుంది. తెలంగాణలోని ప్రాచీన తెలుగు కవులలో, పండితులలో, దార్శనికులలో ఒకరి పేరును విశ్వవిద్యాలయానికి పెట్టాలి.
విశ్వవిద్యాలయం ఆర్థిక స్వావలంబన సాధించాలి. దాని నిర్వహణకు, స్వయంప్రతిపత్తికి ఆర్థిక వనరుల ఏర్పాటు అత్యంత ముఖ్యమైన అంశం. ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయానికున్న ఆర్థిక వనరులను గుర్తించి వాటిని విస్తరించాలి. వివిధ దేశాలలో ఉన్న తెలుగు సంఘాలను విశ్వవిద్యాలయ శాశ్వత అనుబంధ సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా వారినుంచి తగినన్ని నిధిలను సేకరించాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఎక్కువమంది తెలుగువారు ఉన్న ప్రభుత్వాల నుంచి తగినన్ని గ్రాంట్స్‌ను సమకూర్చుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వచ్చే విధంగా ఆయా రాష్ట్రాల, ఆయా దేశాల ప్రభుత్వ శాఖలతో, సంస్థలతో ఎంఓయులు కుదుర్చుకోవాలి. తెలుగు భాషా సంస్కృతులు, కళలపై అభిమానం, అంకితభావం కల్గిన ధనవంతులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల రూపంలో నిధులు సేకరించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన యుజిసి, ఐసిహెచ్‌ఆర్, సిఎస్‌టిటి, సిఐఐఎల్, సెంట్రల్ సాహిత్య అకాడమి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ (ఎమ్‌హెచ్‌ఆర్‌డి) వంటి సంస్థల నుంచి పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్స్, సెమినార్స్, ఓరియంటేషన్ ప్రోగ్రాములు, వర్క్‌షాప్స్, పుస్తక ప్రచురణ, పత్రికా ప్రచురణ, అనువాదాలు మొదలైన విద్యా సంబంధమైన కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని ప్రతి సంవత్సరం వందశాతం వచ్చేటట్లుగా కృషి చేసి సాధించాలి. జానపద కళారూపాల అభివృద్ధి, అధ్యయనం, పరిశోధనల కోసం FOSSIL (Folklore Society of South Indian Languages) వంటి సంస్థల ఆర్థిక సహకారం పొందే ప్రయత్నం చేయవచ్చు. సంగీతం, నృత్యం వంటి లలిత కళలకు సంబంధించిన అధ్యయన, అధ్యాపన, పరిశోధనలకు అవసరమైన వనరుల్ని కేంద్రప్రభుత్వంలోని ఫైన్ ఆర్ట్స్, సాంస్కృతిక విభాగాల నుంచి సమీకరించుకోవాలి.
దాదాపు 500 కోట్ల రూపాయల కార్పస్‌ఫండ్‌తో ప్రపంచ తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకే మణికిరీటంగా తీర్చిదిద్దవలసి ఉంటుంది. ఇది విద్యాపరంగా తెలుగు భాషా సంస్కృతి వికాసానికి కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం మరొక ముఖ్యమైన అంశం. దానికి అనుగుణంగా రూపొందించుకుని అమలుపరచవలసిన కార్యప్రణాళికలో ఉండాల్సిన అంశాలు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అరకొర వసతులతో కొనసాగుతున్న ఓరియంటల్ కళాశాలలు సమర్థంగా పనిచేయడానికి వీలుగా తెలుగు విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలి. తద్వారా వాటి పునరుద్ధరణ బాధ్యతను ప్రభుత్వపరంగా తెలుగు విశ్వవిద్యాలయం చేపట్టాలి.
ప్రస్తుతమున్న తులనాత్మక అధ్యయన విభాగాన్ని పునరుద్ధరిస్తూ దక్షిణాది భాషలతో తెలుగుకు ఉన్న సంబంధాన్ని తెలియపరచే విధంగా ద్రావిడ భాషల విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
సిలికానాంధ్ర, మలేసియా, పారిస్, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, హిబ్రూ యూనివర్సిటీ (జెరూసలేం) మొదలైన సంస్థలతో తెలుగు విశ్వ విద్యాలయం ఇప్పటికే ఎంఓయులను చేసుకుంది. ఇవి సమర్థంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తల పరిశోధన వ్యాసాలను, రాష్ట్రేతర ప్రాంతాలలో, వివిధ దేశాలలో ఉండే కవులు, పండితుల పరిశోధన వ్యాసాలను సేకరించి ఎంపిక చేసిన వాటితో ఒక ప్రామాణికమైన పత్రికను ‘తెలుగు పరిశోధన’ (రీసెర్చ్ జర్నల్) పేరుతో ప్రచురించాలి.
బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం ఉన్న 100 ఎకరాల క్యాంపస్‌లో ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనాన్ని వినియోగంలోకి తెస్తూ నూతన వసతిగృహాన్ని నిర్మించాలి.
ప్రాంతీయ అస్తిత్వాన్ని నిరూపించుకొనే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవహారంలో ఉన్న పదజాలానికి ఒక సమగ్రమైన నిఘంటువును ప్రముఖ భాషావేత్తల అధ్వర్యంలో నిర్మించుకోవాలి. ఈ విషయంలో ఇంతకుపూర్వం కొంత కృషి జరిగింది. దీనిని వేగవంతం చేయాలి.
రవీంద్రభారతి వంటి ప్రతిష్ఠాత్మకమైన ఆడిటోరియాన్ని తెలుగు విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌లో నిర్మించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థల సహకారంతో లలిత కళల అధ్యయనానికి, పరిశోధనకు అవసరమయ్యే కొత్త భవనాన్ని, భాషా సాహిత్య పరిశోధన కేంద్రానికి ప్రత్యేక భవనాన్ని నిర్మించాలి. ప్రాచీన కాలం నుంచి ఈనాటివరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన, తెలుగు సాహిత్యానికి సంబంధించిన కవులు, రచయితలు, భాషా పరిశోధకుల కృషిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వివిధ కోర్సుల్ని నిర్వహించడానికి వీలుగా అధ్యయన, అధ్యాపనల కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలి. ఇందుకు సిఐఐఎల్, సిఎస్‌టిటి వంటి కేంద్ర సంస్థల సహకారం తీసుకోవాలి.
తెలంగాణ తెలుగు కవుల రచనలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రముఖమైన వాటిని ఎంపిక చేసి ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువదించడానికి ప్రత్యేకంగా అనువాద విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ విభాగం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా బాధ్యత వహించవలసి ఉంటుంది.
వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న జానపద గిరిజన విజ్ఞానపీఠం పునరుద్ధరించాలి. స్వంత భవనంతో పాటు FOSSIL సహకారంతో వరంగల్‌లో జానపద గిరిజన మ్యూజియాన్ని ఇదివరకే ఏర్పాటు చేశారు. అక్కడి అధ్యాపకులు ఎంతో విస్తృతమైన సమాచారాన్ని సేకరించారు. ఇది తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన అనేక అంశాలను నిరూపించేదిగా ఉంది. అందువల్ల ఈ ప్రాంతీయ కేంద్రంలో జానపద కళల అధ్యయనానికి, పరిశోధనకు తగిన సిబ్బందిని, సౌకర్యాలను సమకూర్చాలి.
తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి పుట్టిల్లు తెలంగాణాయే. పవిత్ర గోదావరి నదిలాగా సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా ఇక్కడ పుట్టి విస్తరించినదే. నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాలవలె సమగ్ర తెలుగు విశ్వద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేయాలి.
ప్రొఫెసర్ కె.యాదగిరి
పూర్వసంచాలకులు, తెలుగు అకాడమి
Updated Date - 2020-10-04T08:21:11+05:30 IST