‘మారిన వైరస్’ పైనా కోవాగ్జిన్ పనిచేస్తుంది
ABN, First Publish Date - 2020-12-30T06:55:18+05:30
భారత్ బయోటెక్ విరో సెల్ కల్చర్ టెక్నాలజీ ఆధారంగా కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నిరూపితమైన టెక్నాలజీ.
- కొవాగ్జిన్‌పై భారత్ బయో సీఎండీ కృష్ణ ఎల్లా
- కరోనా వైరస్ మ్యుటేషన్ ఊహించిందే
- ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్లలో భద్రత, సమర్థత రెండూ ఉంటాయ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ బయోటెక్ విరో సెల్ కల్చర్ టెక్నాలజీ ఆధారంగా కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నిరూపితమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఆధారంగా అనేక వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు. కొవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్లలో భదత్ర, పనితీరు సామర్థ్యం (ఎఫికసీ) సమతౌల్యంలో ఉంటాయి. రెండింటికీ ప్రాధాన్యం ఉంటుందని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. కరోనా వైరస్ మ్యుటేషన్ల నుంచి కూడా కొవాగ్జిన్ రక్షణ కల్పించగలదని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏర్పాటు డాక్టర్ మనోహర్ వీఎన్ శిరోద్కర్ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో ‘ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్- అవర్ జర్నీ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.
‘వైరస్ లివింగ్ ఆర్గానిజం కాదు. అది కొనసాగడానికి ప్రయత్నిస్తుంది. అందుకు అది అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా వైరస్ పిల్లలపై దాడి చేయలేకపోతోంది. వారిపై ఎలా దాడి చేయాలన్న దానికి మ్యుటేషన్ ఒక విధానం. ప్రజలు ఐసోలేషన్‌లో ఉండడం వల్ల ఒకరిలో వైరస్ బాగా పెరిగి ట్రాన్స్‌మిషన్ వేగం అవుతోంద’ని వివరించారు. కరోనా వైరస్ మ్యుటేషన్ ఊహించిందేనని, మ్యుటేటెడ్ వైరస్ నుంచి కూడా రక్షణ కల్పించే విధంగా కొవాగ్జిన్ అభివృద్ధి చేస్తున్నామని కృష్ణ చెప్పారు.
20 వేల మంది వాలెంటర్లు:
కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. 26,000 వాలంటీర్లపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. చైనా, రష్యా కూడా ఎఫికసీ పరీక్షలు నిర్వహించలేదు. కొవాగ్జిన్‌పై చేపట్టిన ఎఫికసీ పరీక్షలు వర్థమాన దేశాల్లోనే పెద్దదని కృష్ట వ్యాఖ్యానించారు. కోతులపై చేసిన పరీక్షలు ప్రోత్సాకర ఫలితాలను ఇచ్చాయి. వాక్సిన్ అభివృద్ధిలో ప్రతికూల ప్రభావాలు 15 శాతం కన్నా తక్కువ ఉన్నంత వరకూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు
నాజల్ వ్యాక్సిన్ బేష్:
ప్రస్తుత అభివృద్ధిలో ఉన్న దాదాపు అన్ని వ్యాక్సిన్లు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే.. 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమవుతాయి. ఇదంతా పర్యావరణానికి హాని కలిగించే విషయం. సెయింట్ లూయి్‌సలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంతో కలిసి నాజల్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. కోతులపై చేసిన ప్రయోగాల్లో పైన, కింద భాగం ఊపిరితిత్తులకు వ్యాక్సిన్ రక్షణ ఇచ్చిందని కృష్ణ తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్, ఇన్‌యాక్టివేట్ వ్యాక్సిన్‌తో పోలిస్తే నాజల్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. మెరుగైన రక్షణ, ఇమ్యూనిటీ ఇస్తుందన్నారు. కాగా కంపెనీ అభివృద్ధి చేస్తున్న జికా వైరస్ రెండో దశ క్లినికల్ పరీక్షల స్థాయిలో ఉందని కృష్ణ ఎల్లా తెలిపారు.
40 వేల వైర్‌సలు ఉన్నాయ్
తెలియని వైర్‌సలు 40 వేలు ఉన్నాయి. జునోటిక్ వైరస్‌లు 10 వేలు ఉన్నాయి. జునోటిక్ వైరస్ వల్ల వచ్చే వ్యాధులను విస్మరిస్తున్నాం. అవి మహమ్మారులుగా మారుతున్నాయని కృష్ణ ఎల్లా అన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఒక సాధనంగా పని చేస్తోంది. భారత్‌లో వినూత్నాల అభివృద్ధి పెరగాలని కృష్ణ వివరించారు.
Updated Date - 2020-12-30T06:55:18+05:30 IST