కాల్‌డేటా వివరాలివ్వండి
ABN, First Publish Date - 2020-03-16T06:37:02+05:30
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా టెలికాం శాఖ (డాట్)కు చెంది న కొన్ని విభాగాలు భారీగా కాల్ డేటాను కోరుతున్నాయని డాట్ కార్యదర్శి అన్షు ప్రకాశ్ వద్ద టెల్కోలు ఆందోళనను...
- టెల్కోలను కోరుతున్న డాట్ విభాగాలు
- కార్యదర్శికి ఫిర్యాదు చేసిన సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా టెలికాం శాఖ (డాట్)కు చెంది న కొన్ని విభాగాలు భారీగా కాల్ డేటాను కోరుతున్నాయని డాట్ కార్యదర్శి అన్షు ప్రకాశ్ వద్ద టెల్కోలు ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆయనకు ఆయా సంస్థలు ఫిర్యాదు చేసినట్లు టెలికాం శాఖ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీకి సంబంధించి రాష్ట్ర డాట్ విభాగం గత నెల 2, 3, 4 తేదీల్లోని మొత్తం కాల్ డేటాను కోరిందని తెలిపాయి. ఇందు లో మంత్రులు, ఎంపీలు, న్యాయమూర్తులు, కీలక కార్యాలయాలకు సంబంధించిన డేటా కూడా ఉంది. కాల్ డేటా సేకరణకు సంబంధించి స్పష్టమైన సూచనలు, ప్రమాణాలను 2016 ఆగస్టు, 2019 ఏప్రిల్‌లో ప్రభుత్వ సంస్థలకు డాట్ స్పష్టం చేసింది. దాని ప్రకారం.. కాల్ డేటా సమాచారాన్ని కోరే ముందు డాట్ విభాగం కచ్చితంగా వినియోగదారుడి పేరును వెల్లడించడంతో పాటు డేటాను కోరేందుకు సరైన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. సేకరించిన డేటాను ముందుగా వెల్లడించిన కారణం కోసం తప్ప.. వేరే ఏ ఇతర చర్యకు వినియోగించరాదు.
పేర్కొన్న వినియోగంపై సంబంధిత అధికారులకు వివరించి వారి వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డాట్‌కు చెందిన పలు విభాగాలు ఈ మొత్తం ప్రక్రియను గాలికి వదిలేశాయని, భారీగా కాల్ డేటాను అడుగుతున్నాయని టెల్కోలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. డాట్‌కు చెందిన దాదాపు అన్ని లైసెన్స్ సర్వీస్ ఏరియా విభాగాలు కూడా ప్రతి నెల ఒక రోజు మొత్తానికి కాల్ డేటాను కోరుతున్నాయని చెప్పాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 1, 5 తేదీల్లో, ఢిల్లీలో 18వ తేదీ, హరియాణాలో 21వ తేదీ, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లో నెలాఖరున, కేరళ, ఒడిశాల్లో 15వ తేదీ, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో గత నెలాఖరు, ప్రస్తుత నెల 1వ తేదీన కాల్ డేటా ఇవ్వాలని అడుగుతున్నారని టెల్కోలు పేర్కొన్నాయి.
Updated Date - 2020-03-16T06:37:02+05:30 IST