చైనా ఎఫ్‌పీఐలకు కళ్లెం?
ABN, First Publish Date - 2020-06-18T06:16:40+05:30
స్టాక్ మార్కెట్‌లో చైనా పెట్టుబడులను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా చైనా, హాంకాంగ్, మకావు కేంద్రంగా పని చేసే ఎఫ్‌పీఐలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది...
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో చైనా పెట్టుబడులను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా చైనా, హాంకాంగ్, మకావు కేంద్రంగా పని చేసే ఎఫ్‌పీఐలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓకే చెబితే తప్ప, ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఎఫ్‌పీఐల నమోదును ఆమోదించకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. బ్యాంకింగ్, రక్షణ, టెలికాం వంటి కీలక రంగాలకు చెందిన కంపెనీల్లో చైనా ఎఫ్‌పీఐల పెట్టుబడులను నియంత్రించే చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ దిశగా పావులు కదుపుతోంది. భారత కంపెనీల్లో చైనా ఎఫ్‌పీఐల పెట్టుబడుల వివరాలు అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే సెబీ, ఆర్‌బీఐని కోరింది. సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐపై నియంత్రణ పేరుతో, ప్రభుత్వం ఇప్పటికే చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది.
ఉద్రిక్తతలు ముదిరితే ప్రభావం: భారత-చైనా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికిప్పుడు లేకపోయినా మరింత ముదిరితే మాత్రం ప్రభావం తప్పదని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) అధ్యక్షుడు ఎస్‌కే సరాఫ్ చెప్పారు. రెండు దేశాలు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించకపోతే, ఉద్రిక్తతలు పెరిగి ఆ ప్రభావం ద్వైపాక్షిక వాణిజ్యం మీదా పడుతుందని భారత దుస్తుల ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ చెప్పారు.
మనకే ఎక్కువ నష్టం: చైనా దిగుమతులను నిషేధించడం లేదా దిగుమతి సుంకాలు పెంచితే మనకే ఎక్కువ నష్టమని నిపుణులు చెబుతున్నారు. బల్క్ డ్రగ్స్ వంటి కొన్ని ఉత్పత్తుల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కీలక రంగాల్లో దేశీయ ఉత్పత్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమని ఢిల్లీ జేఎన్‌టీయూ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ బిశ్వజిత్ ధర్ చెప్పారు.
Updated Date - 2020-06-18T06:16:40+05:30 IST