మంత్రి గారి పెరట్లో మునిసిపాలిటీ రోడ్డు
ABN, First Publish Date - 2020-09-30T07:31:59+05:30
తిరుపతి నగరంలో మారుతీ నగర్, రాయల్ నగర్ అనే రెండు ప్రాంతాలను కలుపుతూ నగరపాలక సంస్థ అధికారులు ఒక సిమెంటు రోడ్డు వేశారు. దీని ఖర్చు రూ.20 లక్షలు....
ఒక గేటు వద్ద మొదలై.. మరో గేటు వద్ద క్లోజ్
హుటాహుటిన మరో రెండు రోడ్ల నిర్మాణం
ఆయన హోటల్ వద్దా అభివృద్ధి పనులు
పెద్దిరెడ్డికి ఇంజనీరింగ్ సిబ్బంది కానుక
(తిరుపతి - ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో మారుతీ నగర్, రాయల్ నగర్ అనే రెండు ప్రాంతాలను కలుపుతూ నగరపాలక సంస్థ అధికారులు ఒక సిమెంటు రోడ్డు వేశారు. దీని ఖర్చు రూ.20 లక్షలు. ఈ లింక్ రోడ్డుతో స్థానికులకు కచ్చితంగా ఎంతో మేలు జరిగి ఉంటుందని అనుకుంటే... పప్పులో కాలేసినట్టే. 300 మీటర్ల పొడవున్న ఈ సిమెంట్ రోడ్డు వైసీపీ సీనియర్ నేత, కీలకమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద మొదలై... పెరటి ద్వారం వద్ద అంతమైపోతుంది. రోడ్డుకు అటొక గేటూ, ఇటొక గేటూ! వెరసి... మంత్రి గారికి తప్ప మరొకరికి ఉపయోగపడని ఈ రోడ్డును మునిసిపాలిటీ అధికారులు ప్రభుత్వ నిధులతో నిర్మించారు. తిరుపతి నగరం 18వ డివిజన్ పరిధిలో ఉన్న మారుతీనగర్‌లో మంత్రి పెద్దిరెడ్డి నివాసముంటున్నారు.
సువిశాలమైన ప్రాంగణంలో లంకంత ఇల్లు ఆయనది. దానికి పశ్చిమ ప్రవేశ ద్వారముంది. చాలాఏళ్లుగా రాకపోకలకు ఆ మార్గాన్నే వినియోగిస్తున్నారు. వెనుకవైపున, అంటే తూర్పున కూడా వారి ప్రాంగణం రోడ్డును తాకుతుంది. దాన్ని వినియోగిస్తే మంత్రి, ఆయన కుటుంబీకులు సులువుగా ఎయిర్ బైపాస్ రోడ్డు చేరుకోవచ్చు. ట్రాఫిక్ సమస్య లేకపోవడంతోపాటు సమయం కూడా కలిసొస్తుంది. ముందు గేటు నుంచీ వెనుక గేటు వరకూ మధ్య దూరం 300 మీటర్లు. నిజానికి మంత్రిగారికున్న అర్థబలానికి ఆ రోడ్డు వేసుకోవడం ఎంతమాత్రం కష్టం కాదు. కానీ, ఎందుకో మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రిగారి మెప్పుకోసం ఉత్సాహపడ్డారు. ప్రభుత్వ ఖాతాలో రోడ్డు వేసి ఆయన వద్ద మార్కులు కొట్టేయాలని ఉబలాటపడ్డారు. మంత్రి ఇంటి పశ్చిమ ద్వారం నుంచి తూర్పు గేటు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రెండు వర్కుల కింద ప్రతిపాదనలు సిద్ధం చేసి, మంజూరు చేయించి, చకచకా నిర్మాణం కూడా పూర్తి చేసేశారు.
అదనపు హంగులూ రెడీ
అధికారులు మంత్రి ఇంటి ఆవరణలో సీసీ రోడ్డు వేయడంతో సరిపెట్టుకోలేదు. ఇంటి వెనుకవైపు మంత్రి ప్రయాణానికి సౌకర్యంగా ఉండేలా బండారు ఆంజనేయస్వామి గుడి పక్కన రోడ్డు, ఆ గుడికి దక్షిణం వైపు రోడ్డు, ఎయిర్‌బైపాస్ రోడ్డుకు చేరేలా మరో రోడ్డు... మొత్తం మూడు రోడ్ల పనులను నామినేషన్ కింద అప్పగించి వాటిని అద్దంలా మార్చేశారు. వీటి కోసం సుమారు రూ.25 లక్షల దాకా ఖర్చుచేశారు. ఇంటి వద్దే కాకుండా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్ ఉన్న ఆర్టీసీ బస్టాండు వెనుక మార్గంలోనూ సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసి డివైడర్లతో రోడ్డును ముస్తాబు చేశారు. మొత్తం మీద మంత్రి మెప్పు పొందేందుకు మునిసిపల్ అధికారులు సుమారు రూ.కోటి వరకూ వెచ్చించి... ఆయన నివాసం, హోటళ్ల వద్ద అభివృద్ధి పనులు చేపట్టారు.
Updated Date - 2020-09-30T07:31:59+05:30 IST