అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం
ABN, First Publish Date - 2020-12-30T05:06:13+05:30
అర్హత ఉండి ఇంటిస్థలం మంజూరు కానివారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో వారికి కూడా స్థలం ఇస్తామని జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి హామీ ఇచ్చారు.
దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో స్థలం
జేసీ వెంకట రమణారెడ్డి
ఏలూరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): అర్హత ఉండి ఇంటిస్థలం మంజూరు కానివారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో వారికి కూడా స్థలం ఇస్తామని జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన తహసీలార్లు, కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులతో ఇళ్ల పట్టాల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చే విధం గా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు తప్పనిసరిగా అందిస్తామని చెప్పారు. అర్హులైనవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీని జనవరి 7లోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించి 5 రోజులు కావస్తున్నా ఇంకా కొన్ని మండలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పథకమని, అన్ని చోట్లా ఆయా శాసన సభ్యులకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలు పంపిణీ చేయవద్దని ఆయన అధికారులకు సూచించారు. కొన్ని చోట్ల లబ్దిదారుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏవైనా అవక తవకలు జరిగితే చర్యలు తప్పవని ఆయన వారిని హెచ్చరించారు. ఇళ్ల పట్టాలు మ్యాన్యువల్‌గా కాకుండా ప్రింటెండ్‌గా ఇస్తున్నామని, ఒక్క పట్టా కూడా వృఽథా కాకుండా జగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పట్టాల పంపిణీ అనంతరం రిజిస్టరులో లబ్ధిదారుల సంతకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులకు స్థలం చూపించి ఆ స్థలంలో నిల్చోబెట్టి పట్టా ఇచ్చి, స్థలం నెంబరు కనిపించేలా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:06:13+05:30 IST