అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ.. మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకుందాం అనుకుంటుంటే..
ABN, First Publish Date - 2020-12-16T04:34:41+05:30
ఈ ఏడాదంతా వర్రీయే.. సార్వా సాగు చేపట్టారే కానీ.. ఒక పక్క వానలు.. మరో పక్క వరదలు.. ఆ తరువాత నివర్ తుఫాన్ అన్నదాతను కోలుకోనీయకుండా కష్టనష్టాల పాలు చేసింది.. ఏదో మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకుందాం అనుకుంటుంటే.. మరో పక్క అధికారుల దాళ్వా హడావుడి.. గుక్క తిప్పుకోనీయడం లేదు.. పండిన పంటను వదిలేసి.. దాళ్వా సాగుకు రైతులు పరుగులు పెడుతున్నారు.
కష్టాల్లో.. సా..గు
రైతులను వదలని సార్వా
పొలంగట్లపైనే 10 శాతం పంట
అమ్ముడుపోని ధాన్యం
దాళ్వాకు హడావుడి
ఈ ఏడాదంతా వర్రీయే.. సార్వా సాగు చేపట్టారే కానీ.. ఒక పక్క వానలు.. మరో పక్క వరదలు.. ఆ తరువాత నివర్ తుఫాన్ అన్నదాతను కోలుకోనీయకుండా కష్టనష్టాల పాలు చేసింది.. ఏదో మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకుందాం అనుకుంటుంటే.. మరో పక్క అధికారుల దాళ్వా హడావుడి.. గుక్క తిప్పుకోనీయడం లేదు.. పండిన పంటను వదిలేసి.. దాళ్వా సాగుకు రైతులు పరుగులు పెడుతున్నారు.
పెంటపాడు, డిసెంబరు 15 : ఒక పక్క నాట్లు వేస్తుంటే.. మరో పక్క సార్వా కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నాయి. మండలంలో రైతులు ఇంకా సార్వా మాసూళ్ల కష్టాల నుంచి గట్టెక్కలేదు. సుమారు 10 శాతం ధాన్యం ఇంకా పొలం గట్లపైనే ఉంది. ఆరుదల ఉంటేనే ధాన్యాన్ని తీసుకుంటామని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల కారణంగా రైతులు ఒక వైపు నుంచి దాళ్వా నారుమడుల పనులు పూర్తి చేస్తూనే మరో పక్క సార్వా ధాన్యాన్ని అరబెట్టుకుని ఒబ్బిడి చేసే పనిలో తలమునకలవుతున్నారు. దాళ్వా నారుమడులు ముగింపు దశకు చేరుకున్నాయి. మండలంలో 23,230 ఎకరాల్లో దాళ్వా సాగు చేపట్టారు. ప్రస్తుతం 5 శాతం మినహా మండలంలో నారుమడులు ముగిశాయి. మిగిలినవి కూడా మరో రెండు రోజుల్లో పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. పండించిన ధాన్యం ఇంకా సొమ్ముగా మారక, మరో పక్క దాళ్వా సాగుకు పెట్టుబడుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొలకలు వచ్చి, రంగు మారిన ధాన్యం పరిస్థితి ఏంటో రైతులకు అర్థం కావడం లేదు. ఇటీవల వచ్చిన ప్రత్యేక కేంద్ర బృందం మొలకలు వచ్చి, రంగుమారిన ధాన్యం కూడా ఖరీదు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.సార్వా రైతులకు తీవ్ర నష్టాన్ని, కన్నీళ్లను మిగిల్చినప్పటికి రైతులు దాళ్వా సాగు లో జాప్యం చేయకుండా పనులు ముందుకు సాగించారు. తమ కష్టం గమనించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధ నలు సడలించాలని రైతాంగం కోరుతున్నారు.
నారు ఆరోగ్యంగా పెంచండి : పార్థసారథి, ఏవో
మండలంలో దాళ్వా నారుమడులు దాదాపు పూర్తయ్యాయి. నారు ఆరోగ్యంగా పెరగాలంటే రైతులు నారుమడుల్లో ఎకరానికి 2 కేజీల యూరియా, 1 కేజీ పొటాషియం చల్లుకోవాలి. దీని వల్ల పెరగని నారు బాగా పెరుగుతుంది. ఎకరానికి 4జీ గుళికలు 4 కేజీలు చల్లుకుంటే కాండం తొలిచే పురుగులు దరిచేరకుండా ఉంటాయి.
Updated Date - 2020-12-16T04:34:41+05:30 IST