బిల్లులు రాక.. సొమ్ముల్లేక!
ABN, First Publish Date - 2020-10-04T07:45:48+05:30
జిల్లాలో మిల్లర్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయి పడింది. రబీ సీజన్ ప్రారంభం నుంచి పైసా మంజూరు చేయలేదు. దాదాపు రూ. 150 కోట్లు చెల్లించాలి.
మిల్లర్ల ఎదురుచూపులు
ప్రభుత్వ బకాయి రూ. 150 కోట్లు
బియ్యం అప్పగించినా అందని బిల్లులు
ఇంకా విడుదల కాని రబీ సొమ్ములు
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మిల్లర్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయి పడింది. రబీ సీజన్ ప్రారంభం నుంచి పైసా మంజూరు చేయలేదు. దాదాపు రూ. 150 కోట్లు చెల్లించాలి. ప్రస్తుతం ఆ సొమ్ములు చెల్లిస్తేనే ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంటుంది. మిల్లర్లు కోలుకునే వీలు కలు గుతుంది. ఈ ఏడాది మిల్లర్లు రికార్డు స్థాయిలో బియ్యాన్ని అప్పగించారు.ప్రతి ఏటా కొద్ది మంది మిల్లర్లు బియ్యం సకాలంలో అప్పగించలేక డిఫాల్టర్లుగా మిగిలేవారు. గడచిన రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని మిల్లర్లు అంతా పూర్తి స్థాయిలో బియ్యం ఇవ్వగలిగారు.
రబీకి సంబంధించి సెప్టెంబరు 30వ తేదీ లోగా 8.15 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం అక్టోబరు 31వరకు గడువు పెంచినా ముందుగానే పౌర సరఫరాల కార్పొరేషన్, భారత ఆహార సంస్థకు రబీ బియ్యాన్ని అందజేశారు. ఇక ప్రభు త్వమే బిల్లులు చెల్లించాల్సి ఉంది.ఈ ఏడాది మిల్లర్లకు బియ్యం ఉప ఉత్పత్తులు అంతగా లాభించలేదు. కస్టమ్ మిల్లింగ్ విధానంలో క్వింటా ధాన్యా నికి 67 కిలోల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించ నున్నారు.ధాన్యం మరాడించిన తర్వాత ఉత్పత్తి అయ్యే నూక, తవుడు, ఊక మిల్లర్లకు మిగలనున్నాయి. ప్రభు త్వం కస్టమ్ మిల్లింగ్ ఛార్జీలు చెల్లించనుంది.
కరోనా కారణంగా ఈ సారి నూక, తవుడుకు డిమాండ్ తగ్గి ధరలు పతనమయ్యాయి. ఫలితంగా మిల్లర్లకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. నూకపైనే క్వింటాకు దాదాపు రూ. 400 ధర తగ్గింది. గతంలో సుమారు రూ. 2200లు పలికే నూక ఇప్పుడు రూ. 1800లకు అమ్మకాలు సాగిం చడం గగనమైంది.దాంతో మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చే బకాయిలకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం బిల్లులు చెల్లించక.. ఇటు చేతిలో చిల్లిగవ్వ లేక మిల్లర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వం బకాయి చెల్లిస్తే రుణాలు తీర్చుకునే ఆలోచనలో పలువురు మిల్లర్లు ఉన్నారు.
ప్రస్తుతం మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ మసూళ్లు ప్రారంభమై ధాన్యం మార్కెట్‌లోకి వస్తుంది. మరో నెల రోజుల్లో డెల్టాలోనూ వరికోతలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పాతబకాయిలు విడుదలకు అధికారులు ప్రయత్నించాలి. లేదంటే రైస్ మిల్లింగ్ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
బిల్లులకు కసరత్తు ..రాజు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల కార్పొరేషన్
మిల్లర్లకు బిల్లులు మంజూరు చేయడానికి కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలు వడింది.బిల్లులు పెట్టుకోవాలని సూచించింది. మిల్లర్లు బిల్లులు పెట్టుకుంటే తదనుగుణంగా చెల్లించే చర్యలు తీసుకుంటాం. బిల్లులు ఇవ్వడానికి అభ్యంతరం లేదు.
Updated Date - 2020-10-04T07:45:48+05:30 IST