కుండపోత
ABN, First Publish Date - 2020-09-14T10:33:13+05:30
జిల్లాలో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులతో మొదలైన భారీ వర్షాలు ..
రికార్డు స్థాయిలో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు
ఉధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగు, తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలు
ఏలూరుకు పొంచివున్న ముంపు ముప్పు
కొట్టుకుపోయిన రూ.40 లక్షల చేపలు
ఏలూరు సిటీ/చింతలపూడి/ఏలూరు రూరల్/ బుట్టాయ గూడెం/జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 13 : జిల్లాలో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులతో మొదలైన భారీ వర్షాలు ఆదివారం కొనసాగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు రికార్డుస్థాయిలో కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఫలి తంగా వాగులు పొంగుతున్నాయి. చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయం ఎగువ ప్రాంతంలో వరద నీరు చేరుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట కు ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో నీటిమట్టం 349 అడుగులకు చేరింది. మూడు గేట్లు ఎత్తివేసి దిగువకు 4600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ శివ పురం, బేతుపల్లి ఏరియాల్లో వర్షాలు పడుతున్నందున వరద పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, పెరిగితే దిగువకు నీటి విడుదలను పెంచుతామని ప్రాజెక్టు పర్య వేక్షణాధికారి అప్పారావు చెప్పారు. తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఏలూరుకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.
మరిన్ని క్యూసెక్కులు దిగువకు వదలడంతో దిగువనున్న ఏలూరు, కొల్లేరులంక గ్రామాలకు ముంపు తప్పదు. రాత్రి పది గంటల ప్రాంతంలో నగరంలోని తమ్మిలేరు రెండు పాయలు నీటితో ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. శనివారపుపేట లోబ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పైకి వచ్చే అవకాశం ఉండడంతో త్రీటౌన్ సీఐ మూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకటరమణ సిబ్బందితో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైఎస్‌ఆర్ కాలనీ, పోణంగి, శ్రీపర్రు కాజ్‌వేలపై నుంచి వరద ప్రవాహం వెళ్లే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పొంగుతున్న కొండవాగులు
భారీ వర్షాలకు జల్లేరు వాగు ద్వారా కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేర డంతో ఆదివారం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగు వకు విడుదల చేశారు. జలాశయం నీటి సామర్ధ్యం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.28 మీటర్ల నీటి సామర్థ్యం ఉంద ని ఇరిగేషన్ డీఈ కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి ఎర్రచెరువు పూర్తిగా నిండిపోయి గట్లు తెగిపోయే పరిస్థితి ఉండడంతో అధికారులు వెంటనే చెరువుకు గండి కొట్టించారు. నిమ్మలగూడెంలో 48 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువు భారీ వర్షం కారణంగా డ్యామ్‌కు ఏర్పాటుచేసిన ఇనుప మెస్‌లు కొట్టుకుపోవడంతో చెరువు లోని సుమారు రూ.40 లక్షల విలువైన చేపలు కొట్టుకు పోయినట్టు స్థానికులు తెలిపారు. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం నుంచి రెండోసారి ఆదివారం ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదలచేశారు.
అటవీ ప్రాంతాల్లోని కొండవాగుల ద్వారా వరద నీరు జలాశయంలోకి భారీగా వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 217.8 ఎంటీఎస్ కాగా ప్రస్తుతం జలాశయంలో 217 ఎంటీఎస్ నీరు ఉంది. ఇన్‌ఫ్లో 75 కూసెక్కులు వస్తుండగా ముందుజాగ్రత్త చర్యగా జలాశయం ఒక గేటును ఎత్తి 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డీఈ శ్రీనివాస్, ఏఈ కిరణ్ తెలిపారు. వరద పెరిగితే నీటి విడుదలను పెంచుతామన్నా రు. పట్టణాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోని పల్లపు ప్రాం తాలు ముంపునకు గురయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
గోడ కూలి 98 గొర్రెలు మృత్యువాత
ద్వారకా తిరుమల: ప్రహరీ కూలి 98 గొర్రెలు మృతి చెందాయి. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవ రం, చేబ్రోలు, కొత్తగూడెం గ్రామాలకు చెందిన పలువురు 1500 గొర్రెలను ద్వారకా తిరుమల పరిస ర ప్రాంతాల్లో మేపుతున్నారు. శనివారం రాత్రి గంట న్నరపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో సత్తెన్న గూడెంలోని ప్రహరీ కూలడంతో పక్కనేవున్న గొర్రె ల్లో 98 మృతి చెందాయి.
Updated Date - 2020-09-14T10:33:13+05:30 IST