నేటి పొదుపు.. రేపటికి మదుపు
ABN, First Publish Date - 2020-10-31T05:13:09+05:30
మనం ఎంత సంపాదించామని కాదు.. ఎంత జాగ్రత్త చేశామనేదే ముఖ్యం. వచ్చింది వచ్చినట్టుగా మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేస్తే మిగిలేదేముంది. ఒంట్లో ఓపిక, పనిచేసే శక్తి ఎల్లకాలం ఉండవు కదా!
ప్రణాళికలతోనే మంచి భవిష్యత్తు
ఆర్థిక క్రమశిక్షణే వార్థక్యానికి రక్ష
విలాస సంస్కృతితో పెరుగుతున్న దుబారా
నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం
ఏలూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మనం ఎంత సంపాదించామని కాదు.. ఎంత జాగ్రత్త చేశామనేదే ముఖ్యం. వచ్చింది వచ్చినట్టుగా మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేస్తే మిగిలేదేముంది. ఒంట్లో ఓపిక, పనిచేసే శక్తి ఎల్లకాలం ఉండవు కదా! అలాంటప్పుడు దీపముండగానే ఇల్లు చక్కబెట్టు కోవాల్సిందే. ఈ ఏడాది కరోనా కారణంగా వేలకు వేలు వేతనాలు తీసుకునే ఉద్యోగులు కూడా అగచాట్లు పడ్డారు. పనులు లేకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో లక్షల రూపాయల ప్యాకేజీలున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం విలలాడి పోయారు. ఊహాంచని ఉపద్రవం ఎదురైనా.. వృద్ధాప్యం వెంటాడినా.. ఆదుకునేది ఆ పొదుపే. ఒక వ్యక్తి చేసే ఈ పొదుపు ఒక కుటుంబానికి బాసటనిస్తే.. జాతి మొత్తం చేసే పొదుపు దేశానికి అండగా నిలుస్తుంది. నిలకడైన అభివృద్ధిని సాధిస్తుంది.
641 బ్రాంచ్‌లు..రూ.23,225.20 కోట్ల డిపాజిట్లు
జిల్లా జనాభా 40 లక్షలు ఉండగా బ్యాంకు ఖాతాలు 50 లక్షలకు పైనే ఉన్నాయి. 2014 నాటికే బ్యాంకు ఖాతాలు 47 లక్షలు ఉండేవి. ఈమధ్య కాలంలో పెరిగిన ఖాతాల సంఖ్య నామ మాత్రమనే చెప్పాలి. జిల్లాలోని 641 బ్రాంచ్‌ల్లో రూ.23,225.20 కోట్లు ప్రజలు డిపాజిట్ చేశారు. జనాభాను మించిన స్థాయిలో ఇప్పటికే ఖాతాలు ఉండడంతో ఇటీవల పెరిగిన ఖాతాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతా పథకం, ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు బ్యాంకు ఖాతాలకు ముడిపడి ఉండడంతో ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిలో పొదుపు లక్ష్యంగా ఉన్న ఖాతాలు నామమాత్రమేనని చెప్పవచ్చు.
పొదుపునకు తగ్గిన ప్రాధాన్యం
గడిచిన రెండు దశాబ్దాల్లో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పినట్లే కనిపిస్తోంది. ప్రపంచీకరణ ఆవిష్క రించిన విలాస, వస్తు వినిమయ సం
స్కృతి దుబారాను పెంచింది. అవసరం ఉన్నా లేకపోయినా విలాసాల కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయడం పెరిగింది. ఖర్చు పెట్టడమే కాదు క్రెడిట్ కార్డుల పుణ్యమా అని తాహతుకు మించి ఖర్చు చేసేస్తున్నారు. మరోవైపు పొదుపుపై అవగాహన కల్పించే బాధ్యత నుంచి బ్యాంకులు, ప్రభుత్వం తప్పుకున్నట్లే కనిపిస్తోంది. పొదుపుపై వడ్డీలు తగ్గిస్తుండడంతో బ్యాంకులో పొదుపు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. దీనిపై ఆర్థిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పొదుపు సంస్కృతిని పెంచాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మ్యూచు వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఒకింత ఆశజనక పరిణామం. ఎప్పుడో భారీ మొత్తం బ్యాంకులో వేద్దాములే.. ఇన్వెస్టు చేద్దాములే అనుకుంటే పొరపాటే.. ఎప్పటికప్పుడు ఎంత చిన్నమొత్తమైనా పొదుపు చేసుకునేందుకు బ్యాంకులు, తపాలా శాఖ పరిధిలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి నెలా రూ.వెయ్యి పొదుపు చేస్తున్నా..
నాకు ముగ్గురు పిల్లలు. చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకు వచ్చే నెలవారీ జీతంలో ప్రతినెలా రూ.వెయ్యి పోస్టాఫీసులో దాచుకుంటు న్నాను. పిల్లలు పెద్దవాళ్లయ్యేటప్పుడు, వారి చదువులకు చాలా ఖర్చవుతుంది. అందుకోసం ప్రతి నెలా పొదుపు చేస్తున్నాను.
– బి.రమాదేవి, ఏలూరు
Updated Date - 2020-10-31T05:13:09+05:30 IST