కరోనా వివాదం!
ABN, First Publish Date - 2020-11-04T05:15:26+05:30
కరోనా పరీక్షలు రెండు శాఖల ఉద్యోగుల మధ్య వివాదాన్ని తెచ్చిపెట్టాయి.
కొవిడ్ పరీక్షలకు హాజరుకాని వైద్య సిబ్బంది
సచివాలయ ఏఎన్‌ఎంలు చేయాలంటూ ఆదేశం
శిక్షణ లేకుండా పరీక్షలు ఎలా చేస్తామంటూ నిరసన
వీరవాసరం, నవంబరు3 : కరోనా పరీక్షలు రెండు శాఖల ఉద్యోగుల మధ్య వివాదాన్ని తెచ్చిపెట్టాయి. వీరవాసరం వీఈసీ జూనియర్ కళాశాల, లిటిల్‌బడ్స్ స్కూల్‌లో విద్యార్థులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కొవిడ్ పరీక్షలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు.అయితే మధ్యాహ్నం 12 గంటలు దాటినా వీరవాసరం పీహెచ్‌సీ సిబ్బంది గాని కొవిడ్ పరీక్షలు చేసే బృందం గాని రాలేదు. సచివాలయ ఏఎన్‌ఎంలు జూనియర్ కళాశాల, లిటిల్ బడ్స్ స్కూలు వద్దకు వచ్చి వైద్యులు, పీహెచ్‌సీ సిబ్బంది లేకపోవడంతో పీహెచ్‌సీకి వెళ్లిపోయారు. ఇక్కడే వివాదం మొదలైంది. పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు మీరే చేయాలంటూ సచివాలయ ఏఎన్‌ఎంలను ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ లేకుండా కొవిడ్ పరీక్షలు మేము ఎలా చేస్తామంటూ సచివాలయ ఏఎన్‌ఎంలు ప్రశ్నించారు. దీంతో పీహెచ్‌సీ వైద్యురాలికి , ఏఎన్‌ఎంలకు వాగ్వాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఏఎన్‌ఎంలు పీహెచ్‌సీ ముందే నిరసనకు దిగారు. కొవిడ్ పరీక్షలు చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విద్యాసంస్థలకు రాకపోవడంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రంగం నాయుడుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చివరకు ఆయన ఆదేశాలపై పీహెచ్‌సీ హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ం,ఆశ వలంటీర్లు కొవిడ్ పరీక్షలు చేయడానికి హాజరయ్యారు. అయితే పీహెచ్‌సీ వైద్యురాలు, ఏఎన్‌ఎంల వివాదం ముదిరింది.
Updated Date - 2020-11-04T05:15:26+05:30 IST